ICC World cup 2023: ఇంగ్లాండ్ మరో మ్యాచ్ సమర్పయామి! వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్..

By Chinthakindhi Ramu  |  First Published Nov 4, 2023, 10:19 PM IST

England vs Australia: 7 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయంతో సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్న ఇంగ్లాండ్... మరో మ్యాచ్ గెలిస్తే సెమీస్‌కి ఆస్ట్రేలియా.. 


డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో, వన్ ఆఫ్ ది టైటిల్ ఫెవరెట్‌గా 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీని మొదలెట్టిన ఇంగ్లాండ్ కథ ముగిసింది. వరుసగా ఐదో ఓటమిని ఎదుర్కొన్న ఇంగ్లాండ్, 7 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయంతో సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో పరాజయం పాలైంది ఇంగ్లాండ్.. 287 పరుగుల లక్ష్యఛేదనలో 48.1 ఓవర్లలో 253 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్.. 

287 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌కి ఇన్నింగ్స్ తొలి బంతికే షాక్ తగిలింది. జానీ బెయిర్‌స్టోని, మిచెల్ స్టార్క్ గోల్డెన్ డకౌట్ చేశాడు. 17 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన జో రూట్ కూడా స్టార్క్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

Latest Videos

undefined

19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దశలో డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్ కలిసి మూడో వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 64 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

కెప్టెన్ జోస్ బట్లర్ 7 బంతుల్లో 1 పరుగు చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మొయిన్ ఆలీ, బెన్ స్టోక్స్ కలిసి ఐదో వికెట్‌కి 63 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ని ఆదుకునే ప్రయత్నం చేశారు. 

90 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 2 పరుగులు చేసి అవుట్ కాగా 43 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేసిన మొయిన్ ఆలీ కూడా ఆడమ్ జంపా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు..

మొయిన్ ఆలీ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ విజయానికి 65 బంతుల్లో 101 పరుగులు కావాలి. 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన డేవిడ్ విల్లేని జోష్ హజల్‌వుడ్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ గెలుపుపై ఆశలు వదులుకుంది.

క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ కలిసి 9వ వికెట్‌కి 28 బంతుల్లో 37 పరుగులు జోడించి ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారు. 33 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన క్రిస్ వోక్స్, స్టోయినిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన అదిల్ రషీద్‌ని హజల్‌వుడ్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, 49.3 ఓవర్లలో 286 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మార్నస్ లబుషేన్ 71, కామెరూన్ గ్రీన్ 47, స్టీవ్ స్మిత్ 44, మార్కస్ స్టోయినిస్ 35 పరుగులు, ఆడమ్ జంపా 29 పరుగులు చేసి రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్‌కి 4 వికెట్లు దక్కాయి. 

ఆస్ట్రేలియా తర్వాతి మ్యాచ్‌లో నవంబర్ 7న ఆఫ్ఘాన్‌తో, నవంబర్ 11న బంగ్లాదేశ్‌తో తలబడనుంది. ఈ రెండింట్లో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా ఆస్ట్రేలియా సెమీస్ చేరుతుంది. 

click me!