
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా - ఇంగ్లాండ్ మ్యాచ్ లో భారత మహిళల క్రికెట్ జట్టు యువ సంచలనం రేణుకా సింగ్ ఠాకూర్ ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపించింది. ముట్టుకుంటే క్యాచ్, వదిలిపెడితే వికెట్ అన్నంత రేంజ్ లో ఆమె విధ్వంసం సాగింది. ఈ మ్యాచ్ లో రేణుకా.. 4 ఓవర్లు వేసి 15 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లతో చెలరేగింది. తద్వారా టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్ గా నిలిచింది.
టీ20 ప్రపంచకప్ లో ఇంతవరకూ భారత మహిళల జట్టు తరఫున ప్రియాంక రాయ్ పేరిట ఉండేది. ప్రియాంక.. 2009 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ లో 3.5 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసింది. ఇప్పుడు ఆ రికార్డును రేణుకా చెరిపేసింది.
ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లోనే ఆసీస్ పేసర్ ఆష్లే గార్డ్‌నర్.. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసి 12 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లతో చెలరేగింది. గార్డ్‌నర్ తర్వాత రేణుకా సింగ్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా ఈ జాబితా (టీ20 ప్రపంచకప్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్) లో రేణుకా నాలుగో స్థానంలో ఉంది.
విండీస్ బౌలర్ డాటిన్.. 2018లో బంగ్లాదేశ్ పై 3.4 ఓవర్లు వేసి ఐదు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీసింది. తర్వాత దక్షిణాఫ్రికా క్రికెటర్ లుస్.. 2016లో ఐర్లాండ్ పై మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. తర్వాత స్థానాల్లో గార్డ్‌నర్, రేణుకా, ప్రియాంక రాయ్ ఉన్నారు.
ఇక ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో రేణుకా.. బ్రిటీష్ జట్టుకు వరుస షాకులిచ్చింది. తను వేసిన తొలి ఓవర్ మూడో బంతికే వ్యాట్ (0) వికెట్ కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రేణుకా.. క్యాప్సీ (3) ని క్లీన్ బౌల్డ్ చేసింది. అదే ఊపులో మరో ఓపెనర్ సోఫి డంక్లీ (10) నీ ఔట్ చేసింది. ఇక చివరి ఓవర్లో అమీ జోన్స్, క్యాథరీన్ సీవర్ ను పెవిలియన్ కు పంపి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో రేణుకా ధాటికి ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ పోరాడుతోంది.