సఫారీల మీద కంగారూ బౌలర్ల సవారి.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆసీస్‌దే..

Published : Feb 26, 2023, 09:39 PM ISTUpdated : Feb 26, 2023, 09:47 PM IST
సఫారీల మీద కంగారూ బౌలర్ల సవారి.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆసీస్‌దే..

సారాంశం

ICC Womens T20 World Cup 2023: మహిళల ప్రపంచకప్ ఫైనల్లో బ్యాటింగ్ లో విఫలమైనా  ఆస్ట్రేలియా బౌలింగ్ లో అదరగొట్టింది.  కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన  సఫారీ జట్టు ఓటమితో తగిన మూల్యం చెల్లించుకుంది.  ఫలితంగా ఆసీస్.. వరుసగా రెండోసారి (మొత్తంగా ఆరోసారి) టీ20 ప్రపంచకప్ ను గెలుచుకుంది.   

సంచలనాలు లేవు.  కొత్త విజేతలు పుట్టుకురాలేదు.  ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను సౌతాఫ్రికా  బ్యాటింగ్ వైఫల్యంతో   సంక్లిష్టం చేసుకుని  దారుణ ఓటమిని మూటగట్టుకుంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోయి మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన మంచి అవకాశాన్ని జారవిడుచుకుంది. దేశం దేశమే తరలివచ్చిన   న్యూలాండ్స్ గ్రౌండ్ లో ఆ జట్టు పోరాడి ఓడింది.  బౌలర్లు రాణించి ఆసీస్ ను తక్కువ స్కోరుకే నిలువరించినా  బ్యాటర్లు మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో పాటు మ్యాచ్ కీలక సమయంలో వికెట్లు కోల్పోయి  మూల్యం చెల్లించుకున్నారు.  

న్యూలాండ్స్ గ్రౌండ్ (కేప్‌టౌన్) వేదికగా ముగిసిన  మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో  దక్షిణాఫ్రికా.. 137-6 పరుగుల వద్దే పరిమితమైంది.  ఫలితంగా ఆసీస్.. 19 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఆ జట్టుకు ఇది ఆరో  మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్ కావడం విశేషం. 

లక్ష్య ఛేదనలో  సఫారీ ఓపెనర్ లారా వోల్వార్ట్ (48 బంతుల్లో 61, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించింది.  మిగతావారిలో చోల్ ట్రియాన్  (25) ఫర్వాలేదనిపించింది. మిగిలినవారు  విఫలం కావడంతో ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. 

 మోస్తారు లక్ష్య ఛేదనలో  సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ను నెమ్మదిగానే ఆరంభమైంది. తొలి ఓవర్లోనే వోల్వార్ట్  ఫోర్ కొట్టినా తర్వాత పరుగుల రాక గగనమైంది. బౌండరీల సంగతి పక్కనబెడితే  కనీసం సింగిల్ తీయడానికి కూడా సఫారీ బ్యాటర్లు వెనుకాడారు.  ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డ  ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (17 బంతుల్లో 10) ను డారిస్ బ్రౌన్ ఐదో ఓవర్లో చివరి బంతికి ఔట్ చేసింది.  తొలి పవర్ ప్లే లో దక్షిణాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 22 పరుగులే చేసింది. 

ఏడో ఓవర్లో  వోల్వార్ట్ తో పాటు కాప్ (11) లు చెరో ఫోర్ బాదారు. కానీ ఆసీస్  ఆల్ రౌండర్ గార్డ్‌నర్ ఆ జట్టుకు మరో బ్రేక్ ఇచ్చింది.  సఫారీ కీలక బ్యాటర్ మరిజనె కాప్  ను పెవిలియన్ కు పంపింది.  11వ ఓవర్లో  కెప్టెన్ లుస్ (2) వోల్వార్ట్ తో  సమన్వయ లోపం వల్ల రనౌట్ గా వెనుదిరిగింది.  11 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోరు  55-3 గా ఉంది. 

జోరు పెంచిన వోల్వార్ట్.. 

ఛేదించాల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో  వోల్వార్ట్  గేర్ మార్చింది.  మెక్‌గ్రాత్ వేసిన  13వ ఓవర్లో ఆమె  ఓ సిక్సర్ తో పాటు 14 పరుగులు రాబట్టింది.   వర్హమ్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా  భారీ సిక్సర్ బాదింది.  ఆమెకు తోడుగా ట్రియాన్ కూడా రెచ్చిపోవడంతో సఫారీ స్కోరుబోర్డు వేగం పెరిగింది. 14వ ఓవర్లో 15 పరుగులొచ్చాయి. బ్రౌన్ వేసిన 15 వ ఓవర్ లో రెండో బంతిని బౌండరీకి తరలించిన వోల్వార్ట్.. 43 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది.  15 ఓవర్లు ముగిసేసరికి  దక్షిణాఫ్రికా  98 పరుగులు చేసింది.  విజయానికి  30 బంతుల్లో 59 పరుగులు కావాలి.  

టర్నింగ్ పాయింట్.. 

సాఫీగా సాగుతున్న సఫారీ ఇన్నింగ్స్ లో  భారీ కుదుపు.  17వ ఓవర్లో మూడో బంతికి వోల్వార్ట్..  ఎల్బీగా వెనుదిరిగింది. అంతే సఫారీ చాప్టర్ క్లోజ్. తర్వాత వచ్చిన బ్యాటర్లంతా  పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆ  తర్వాతి ఓవర్లో ట్రియాన్ ను జొనాసేన్ బౌల్డ్ చేసింది. అదే ఓవర్లో బోష్  (1) రనౌట్ అయింది.  ఇక ఆ తర్వాత  దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు.  

 

అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ బెత్ మూనీ (74 నాటౌట్) రాణించింది.  గార్డ్‌నర్ (29) ఫర్వాలేదనిపించింది. సఫారీ బౌలర్లలో మరిజనె కాప్, షబ్నిమ్ ఇస్మాయిల్ లు తలా రెండు వికెట్లు  పడగొట్టారు.  

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది