
మహిళల ప్రపంచకప్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ ఘన విజయం సొంతం చేసుకుంది. స్పిన్నర్లు నీదా దార్, నశ్రా సంధులు రాణించడంతో విండీస్ ను తక్కువ స్కోరుకే కుప్పకూల్చింది. వర్షం వల్ల 20 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన ఈ మ్యాచులో పాక్.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ప్రపంచకప్ లో వరుసగా నాలుగు మ్యాచులు ఓడిన పాక్ కు ఇదే తొలి విజయం కాగా విండీస్ కు మూడో ఓటమి. వర్షం కారణంగా సుమారు ఐదు గంటల ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచును 20 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచులో పాక్ స్పిన్నర్ నీదా దార్ ఏకంగా నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. 2009 నుంచి ప్రపంచకప్ లో పాకిస్థాన్ కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ విజయానికి ముందు ఆ జట్టు వరుసగా 18 మ్యాచుల్లో ఓటమి పాలైంది.
హమిల్టన్ లోని సెడన్ పార్క్ వేదికగా సోమవారం జరిగిన 20 వ గ్రూప్ మ్యాచులో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్.. అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఆట నాలుగో ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్ హేలే మాథ్యూస్ (1) ను ఫాతిమా సనా ఔట్ చేసింది. మాథ్యూస్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ ఎస్. టేలర్ (31 బంతుల్లో 18) తో కలిసి మరో ఓపెనర్ డాటిన్ (35 బంతుల్లో 27) చేసిన పరుగులు మినహా విండీస్ లో మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన మిగిలినవారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
ఇన్నింగ్స్ 9వ ఓవర్లో 34 పరుగుల వద్ద టేలర్ నిష్క్రమించడంతో విండీస్ వికెట్ల పతనం వేగంగా సాగింది. ఆమె స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన క్యాంప్బెల్ (7), నేషన్ (0), నైట్ (8), హెన్రీ (0) లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఫ్లెచర్ (12 నాటౌట్), అలెన్ (9 నాటౌట్) గా నిలిచారు.
పాక్ బౌలర్లలో నీదా దార్ నాలుగు ఓవర్లు వేసి పది పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకుంది. ఓపెనర్ డాటిన్ తో పాటు క్యాంప్బెల్, నైట్, హెన్రీలు ఆమెకే చిక్కారు. మరో స్పిన్నర్ నష్ర సంధు నాలుగు ఓవర్లు వేసి ఒక మేడిన్ తో 24 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్.. 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 15 బంతులాడిన సిద్ర అమిన్.. 8 పరుగులే చేసి ఫ్లెచర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. మరో ఓపెనర్ మునీబా అలి (43 బంతుల్లో 37) తో రాణించింది. ఆమె 12వ ఓవర్లో సెల్మన్ వేసిన బంతికి డాటిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అయితే కెప్టెన్ బిస్మా మరూఫ్ (29 బంతుల్లో 20 నాటౌట్), ఒమైమా సోహైల్ (27 బంతుల్లో 22 నాటౌట్) లు మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఫలితంగా పాక్.. మరో ఆరు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. నాలుగు వికెట్లు తీసిన పాక్ బౌలర్ నీదా దర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.