
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ లో జరుగబోయే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 (ICC Women's World Cup 2022)కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు భారత వెటరన్ మిథాలీ రాజ్ (Mithali Raj) నాయకత్వం వహించనుండగా.. హర్మన్ ప్రీత్ కౌర్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. ప్రపంచకప్ తో పాటు New Zealandతో జరుగబోయే వన్డే సిరీస్ కు కూడా 14 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. అయితే ఈ రెండు జట్లలో కూడా భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తో పాటు ఆల్ రౌండర్ శిఖా పాండేలకు స్థానం దక్కలేదు. గత కొద్దికాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న ఈ ఇద్దరికీ న్యూజిలాండ్ వన్డే సిరీస్ తో పాటు ప్రపంచ కప్ జట్లలో కూడా స్థానం దక్కలేదు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఈ ఏడాది మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 మధ్య న్యూజిలాండ్ వేదికగా జరుగనున్నది. దీనికోసం భారత జట్టు అన్ని విధాలుగా సిద్ధమైంది. 1973 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్పులు జరుగుతున్నా భారత్ (తొమ్మిదింటిలో పాల్గొంది) ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలువలేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ 12వది. ఆరు సార్లు ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలువగా క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ నాలుగు సార్లు టైటిల్ కొట్టింది. న్యూజిలాండ్ ఒక్కసారి విశ్వ విజేతగా నిలిచింది.
2005 తో పాటు 2017 లలో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ లలో భారత జట్టు ఫైనల్ వరకు చేరినా కప్ కొట్టలేదు. 2005 ఫైనల్ లో ఆసీస్ పై.. 2017 తుదిపోరులో ఇంగ్లాండ్ పై ఓడింది. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా విశ్వ విజేతగా నిలవాలని ఆరాటపడుతున్నది.
ఈ నేపథ్యంలో ఈసారి బ్యాటర్లు, బౌలర్లతో పాటు ఆల్ రౌండర్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. మిథాలీ రాజ్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యశ్తిక భాటియా,దీప్తి శర్మలు బ్యాటర్లుగా ఉండగా.. రిచా ఘోష్ వికెట్ కీపర్ గా ఉండనుంది. ఇక వెటరన్ పేసర్ జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్ లు బౌలర్లతో పాటు ఆల్ రౌండర్ గా కూడా సేవలందించనున్నారు.
ఇదిలాఉండగా.. భారత జట్టు ఫిబ్రవరి 9 నుంచి 24 దాకా న్యూజిలాండ్ తో ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనున్నది. ప్రపంచకప్ నకు ముందు భారత జట్టుకు కివీస్ పరిస్థితులను అలవాటుపడేందుకు ఈ సిరీస్ దోహదపడునున్నది. ఇక మార్చి 6న భారత్ తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
వన్డే ప్రపంచకప్ తో పాటు న్యూజిలాండ్ వన్డేలకు భారత జట్టు : మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యశ్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, జులన్ గోస్వామి, పూజా వస్త్రాకార్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్ , తాన్యా భాటియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్
స్టాండ్ బై ప్లేయర్లు : ఎస్. మేఘనా, ఎక్తా బిస్త్, సిమ్రాన్ దిల్ బహదూర్
న్యూజిలాండ్ తో టీ 20కి భారత జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యశ్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, పూజా వస్త్రాకార్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్ , తాన్యా భాటియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, ఎక్తా బిస్త్, ఎస్. మేఘనా, సిమ్రాన్ దిల్ బహదూర్