ICC Women's World Cup: కివీస్ ను చిత్తు చేసిన ఆసీస్.. కంగారూల పేస్ ధాటికి న్యూజిలాండ్ విలవిల..

Published : Mar 13, 2022, 10:47 AM IST
ICC Women's World Cup: కివీస్ ను చిత్తు చేసిన ఆసీస్.. కంగారూల పేస్ ధాటికి న్యూజిలాండ్ విలవిల..

సారాంశం

ICC Women's World Cup 2022: మహిళల ప్రపంచకప్ లో  ఆరు సార్లు ప్రపంచ విజేత.. ఏడోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నది. లీగ్ మ్యాచుల్లో భాగంగా ఆ జట్టు.. కివీస్ ను చిత్తుగా ఓడించింది. 

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న  మహిళల ప్రపంచకప్  లో అగ్రశ్రేణి ఆస్ట్రేలియా అదరగొట్టే ప్రదర్శనలతో ముందుకు సాగుతున్నది. ఆసీస్ మహిళల జట్టు ఆదివారం  న్యూజిలాండ్ ను చిత్తు  చిత్తుగా ఓడించింది.   ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా..  వెల్లింగ్టన్ వేదికగా జరిగిన పదకొండో మ్యాచులో  ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పై  141 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.  టాస్ ఓడినా ముందు బ్యాటింగ్ లో అదరగొట్టిన ఆసీస్ అమ్మాయిలు.. తర్వాత బౌలింగ్ లో కూడా కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆసీస్ పేసర్ల ధాటికి  270 పరుగుల ఛేదనలో కివీస్ జట్టు.. 128 పరుగులకే ఆలౌట్ అయింది.  ఎనిమిది మంది ఆటగాళ్లు ఒక అంకె స్కోరుకే వెనుదిరిగారు.  

టాస్ గెలిచి ఆసీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది న్యూజిలాండ్.  అయితే కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ జట్టు బౌలర్లు తొలుత బాగానే బౌలింగ్ చేశారు.  15 ఓవర్ల లోపే  ఆస్ట్రేలియా.. 56 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు హేన్స్ (30),  హీలి (15), కెప్టెన్ లానింగ్ (5) లు వెంటవెంటనే నిష్క్రమించారు. 

ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ఎల్లీస్ పెర్రీ (68).. మూనీ (30) తో కలిసి ఐదో వికెట్ కు 57 పరుగుల  భాగస్వామ్యాన్ని జోడించింది. అయితే మూనీ ఔటవ్వడంతో మెక్గ్రాత్ (57) తో జతకట్టిన పెర్రీ బాధ్యతయుతంగా ఆడింది. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు వంద పరుగులు జోడించారు. ఈ జంటను విడదీయడానికి కివీస్ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. 

 

ఈ ఇద్దరూ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన గార్డ్నర్ (18 బంతుల్లో 48 నాటౌట్) వీరవిహారం చేసింది. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఆమె దంచికొట్టడంతో  నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్.. 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. 

అనంతరం 270 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏ దశలో కూడా  ఆ దిశగా సాగలేదు.  ఆ జట్టుకు ఐదో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ సోఫీ డెవిన్ (6) ను పెర్రీ బౌల్డ్ చేసింది.  అప్పడు మొదలైన కివీస్ వికెట్ల పతనం నిరాటంకంగా సాగింది.  స్కోరు బోర్డుపై 50 పరుగులు కూడా చేరకుండానే  ఆ జట్టు సగం వికెట్లను కోల్పోయింది. అమి (44) ఒక్కతే టాప్ స్కోరర్. 73 కే ఆరు వికెట్లు కోల్పోయిన కివీస్ ను  ఆలౌట్ చేయడానికి ఆసీస్ పెద్దగా కష్టపడలేదు. 30 ఓవర్ల లోనే ఆ జట్టు  పది వికెట్లు కోల్పోయి భారీ ఓటమిని మూటగట్టుకుంది. 

ఆసీస్ బౌలర్లలో బ్రౌన్ మూడు కీలక వికెట్లు తీయగా..  వెల్లింగ్టన్, గార్డ్నర్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.  బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా ఓ వికట్ తీసిన పెర్రీకి ప్లేయర్ ఆఫ్ ది  మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా మూడో విజయం. దీంతో పాయింట్ల పట్టిక (6) లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.  రెండో స్థానంలో భారత్ (4 పాయింట్లు) ఉంది. న్యూజిలాండ్.. నాలుగు మ్యాచులు ఆడి రెండు గెలిచి రెండు ఓడి నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది