అండర్-19 అమ్మాయిలు అదుర్స్.. టీమిండియా చేతిలో ఇంగ్లాండ్ చిత్తు.. తొలి వరల్డ్ కప్ మనదే..

By Srinivas MFirst Published Jan 29, 2023, 7:38 PM IST
Highlights

ICC Women's Under-19 T20 World Cup:  ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన  అండర్ - 19 మహిళల టీ20 ప్రపంచకప్ ను భారత్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో  భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ చిత్తుచిత్తుగా ఓడింది. ఫైనల్ లో తెలంగాణ అమ్మాయి  గొంగడి త్రిష బ్యాటింగ్ లో మెరిసింది.

16 దేశాలు.. 40 మ్యాచ్‌లు.. నాలుగు వేదికలు.. వెరసి పదిహేను రోజులుగా  దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ -19 టీ20 ప్రపంచ కప్ క్రికెట్ లో భావి క్రికెటర్ల విన్యాసాలకు అద్భుత ముగింపు. ఆదివారం పోచెఫ్స్ట్రోమ్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ మధ్య ముగిసిన  ఫైనల్ లో యువ భారత్ అదరగొట్టింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ నిలువలేకపోయింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో తొలుత 17.1 ఓవర్లలో  68 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. తర్వాత లక్ష్యాన్ని భారత్.. 14 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి  చరిత్ర సృష్టించింది.

అండర్ - 19 మహిళల ప్రపంచకప్ ను నిర్వహించడం ఇదే తొలిసారి కాగా ఈ టోర్నీలో  భారత్  ట్రోఫీని దక్కించుకోవడం గమనార్హం. భారత సీనియర్ టీమ్  మెంబర్ షెఫాలీ వర్మ  సారథ్యంలోని భారత్.. టోర్నీ  ప్రారంభం నుంచి  వరుస విజయాలతో  (సూపర్ సిక్స్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి)  ఫైనల్ కు చేరి.. తుది పోరులో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. 

ఇంగ్లాండ్ నిర్దేశించిన 69 పరుగుల లక్ష్యాన్ని భారత్  దూకుడుగానే ఆరంభించింది.  కెప్టెన్ షెఫాలీ వర్మ (11 బంతుల్లో 15, 1 ఫోర్, 1 సిక్స్)  ధాటిగా ఆడింది.   కానీ ఆమెను భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లో  హన్నా బేకర్ ఔట్ చేసింది.   మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ (5) కూడా  త్వరగా నిష్క్రమించినా భారత్ భయపడలేదు. సౌమ్య తివారి  (37 బంతుల్లో 24 నాటౌట్, 3 ఫోర్లు), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (29 బంతుల్లో 24, 3 ఫోర్లు) లు  భారత విజయాన్ని ఖాయం చేశారు. 

 

Congratulations to the first ever champions of the Women's ! 🏆🇮🇳 pic.twitter.com/hSE7Z6l4tW

— ICC (@ICC)

అంతకుముందు ఫైనల్  పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్.. ఆది నుంచి  ఒడిదుడుకులతోనే సాగింది.   స్కోరుబోర్డుపై ఒక్క పరుగు చేరగానే  ఆ జట్టు  ఓపెనర్  లిబర్టీ హీప్  (0) ను టిటాస్ సాధు   ఔట్ చేసింది.  స్కోరు బోర్డు 15 పరుగుల వద్ద  నిమా హోలండ్ (10) ను అర్చనా దేవి క్లీన్ బౌల్డ్ చేసింది. 

అదే జోష్ లో అర్చనా..  గ్రేస్ స్క్రీవర్స్  (4) కూడా పెవిలియన్ కు పంపింది.   ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో   టిటాస్ సాధు..  వికెట్ కీపర్ సెరెన్ స్మేల్  (3) ను బౌల్డ్ చేసింది. ఆ తర్వాత  పర్షవి చోప్రా.. చెయిర్స్ పవ్లే (2), ర్యానా మెక్ డొనాల్డ్ (19) ల పని పట్టింది.   ఆ తర్వాత వచ్చిన లోయరార్డర్ బ్యాటర్లు కూడా  అలా వచ్చి ఇలా వెళ్లారు.  టీమిండియాలో సాధు,  అర్చనా దేవి, పర్షవి లకు తలా రెండు వికెట్లు దక్కాయి. షెఫాలీ వర్మ, మన్నత్ కశ్యప్, సోనమ్ యాదవ్ లు చెరో వికెట్ పడగొట్టారు. 

click me!