T20 Worldcup: పూరన్ కు పూనకమొచ్చినా.. ఆటతీరు మారని మాజీ డిఫెండింగ్ ఛాంపియన్లు.. బంగ్లా ముందు స్వల్ప లక్ష్యం

By team teluguFirst Published Oct 29, 2021, 5:29 PM IST
Highlights

West Indies vs Bangladesh: అసలు వీళ్లు రెండు సార్లు టీ20 కప్ గెలిచిన ఛాంపియన్లేనా..? అన్న అనుమానాన్ని రేకెత్తిస్తూ..  విండీస్ బ్యాటర్లు మళ్లీ విఫలమయ్యారు.  నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్లు కోల్పోయి 142  పరుగులు చేశారు. 

యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) టోర్నీలో  బంగ్లాదేశ్ (Bangladesh) తో జరుగుతున్న తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో వెస్టిండీస్ (West Indies) ఎప్పటిలాగే తడబడింది. వెస్టిండీస్ బ్యాటర్లు.. అసలు వీళ్లు రెండు సార్లు టీ20 కప్ గెలిచిన ఛాంపియన్లేనా..? అన్న అనుమానాన్ని రేకెత్తించారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. విండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో విండీస్.. 7 వికెట్లు కోల్పోయి 142  పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి విండీస్ ను నిలువరించారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ ఇన్నింగ్స్ గొప్పగా ఏం మొదలుకాలేదు. క్రీజులో ఇద్దరు హిట్టర్లు (క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్) ఉన్నా.. రెండు ఓవర్ల దాకా ఒక్క ఫోర్ కూడా రాలేదు.  ఓపెనర్లు క్రిస్ గేల్ (10 బంతుల్లో 4), ఎవిన్ లూయిస్ (9 బంతుల్లో 6) మాత్రమే చేశారు. మూడో ఓవర్ చివరి బంతికి లూయిస్ ను ముస్తాఫిజుర్ ఔట్ చేశాడు. ఇక ఐదో ఓవర్లో మెహది హసన్.. గేల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి విండీస్ స్కోరు 21-2. 

ఓపెనర్లిద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హిట్మెయర్ (9) ఎక్కువసేపు నిలువలేదు. ఆ వెంటనే విండీస్ సారథి కీరన్ పొలార్డ్ (14) రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రసెల్ (0) కూడా రనౌట్ అయ్యాడు. దీంతో విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 

12 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ స్కోరు 61-3. ఈ క్రమంలో వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన రోస్టన్ చేజ్ ( 46 బంతుల్లో 39) నిలకడైన ఆటతీరుతో ఆదుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ..  స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.  రసెల్ రనౌట్ అయ్యాక చేజ్ కు జత కలిసిన వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 

14 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 70-4 గా ఉంది. ఈ సమయంలో చేజ్, పూరన్ గేర్ మార్చారు.  ముస్తాఫిజుర్ వేసిన 15 వ ఓవర్లో  చేజ్ ఫోర్ కొట్టాడు. అదే ఓవర్ ఐదో బంతికి పూరన్ కూడా బౌండ్రీ బాదాడు. దీంతో ఆ ఓవర్లో 14 పరుగులొచ్చాయి. ఇక షకిబ్ ఉల్ హసన వేసిన 16 వ ఓవర్లో పూరన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తొలి రెండు బంతులను స్టేడియం అవతలికి పంపించి.. ఆ ఓవర్లో 15 పరుగులు రాబట్టాడు. 

ఇక తర్వాత ఓవర వేసిన షొరిఫుల్ ఇస్లాం.. 4 పరుగులే ఇచ్చాడు. కానీ 18వ ఓవర్లో పూరన్ మళ్లీ రెచ్చిపోయాడు. మెహది హసన్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని సిక్సర్ కు తరలించిన పూరన్.. మూడో బంతికి మరో ఆరు పరుగులు రాబట్టాడు. దీంతో విండీస్  కనీసం 150 పరుగులైనా చేస్తుందేమోని అనిపించింది. 

కానీ.. 19 వ ఓవర్ వేసిన ఇస్లాం.. విండీస్ కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తొలి బంతికే పూరన్ ను ఔట్ చేసిన అతడు.. చేజ్ ను బౌల్డ్ చేశాడు.  చివర్లో వచ్చిన డ్రేన్ బ్రావో (1) త్వరగానే నిష్క్రమించినా..  జేసన్ హోల్డర్ ( 5 బంతుల్లో 15 నాటౌట్) మెరుపులు మెరిపిండచంతో 20 ఓవర్లలో ఆ జట్టు 142 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో హోల్డర్ రెండు సిక్సర్లు బాదగా.. మళ్లీ క్రీజులోకి వచ్చిన పొలార్డ్ చివరి బంతికి సిక్సర్ కొట్టాడు.  

బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి విండీస్ విధ్వంసకారులను అడ్డుకున్నారు. నాలుగు ఓవర్లు వేసిన టస్కిన్ అహ్మద్.. 17 పరుగులే ఇచ్చాడు. మెహది హసన్ (4-0-27-2), ఇస్లాం (4-0-20-2) పొదుపుగా బౌలింగ్ చేశారు. షకిబ్.. విండీస్  బ్యాటర్లను కట్టడి చేసినా వికెట్ దక్కించుకోలేకపోయాడు. 

కాగా, ఈ విండీస్ ఇన్నింగ్స్ లో రనౌట్ అయిన  రసెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయిన వారి జాబితాలో అతడు చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో అంతకుముందు..  వెటోరీ (న్యూజిలాండ్), అమిర్, యార్డీ, మిస్బా (పాక్), దిల్షాన్, జయవర్దనే (శ్రీలంక), డి. విల్లీ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఉన్నారు. 

click me!