ICC T20 World Cup: భారత్ మాతో పోటీ పడలేదు.. అందుకే వాళ్లు మాతో ఆడరు : అబ్దుల్ రజాక్ సంచలన వ్యాఖ్యలు

By team teluguFirst Published Oct 5, 2021, 1:49 PM IST
Highlights

Abdul Razzaq: మరికొద్దిరోజుల్లో భారత్-పాకిస్థాన్ మధ్య బిగ్ ఫైట్ జరుగనున్న నేపథ్యంలో పాక్ (Pakistan) మాజీలు నోటికి పని చెప్పారు. ఐసీసీ ఈవెంట్లలో భారత్ (India)కే మంచి రికార్డు ఉన్నా.. ఇష్టారీతిన మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

చాలాకాలం తర్వాత దాయాది దేశాల మధ్య కీలక పోరును ఆస్వాదించే సమయం మరికొద్దిరోజుల్లో రానున్నది. ఈ నేపథ్యంలో భారత్ ను మానసికంగా దెబ్బకొట్టేందుకు ఆ దేశ మాజీలు నోటికి పని కల్పించారు. ఐసీసీ ఈవెంట్లలో భారత్ చేతిలో ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా 14 సార్లు చావుదెబ్బ తిన్న పాక్.. కిందపడ్డా తామే నెంబర్ వన్ అని భీరాలకు పోతున్నది. ఇందులో భాగంగానే  పాక్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్  టీమ్ ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

రజాక్ మాట్లాడుతూ... ‘పాక్ తో పోటీపడే సామర్థ్యం భారత్ కు లేదు. పాక్ లో భారత జట్టులో కంటే నాణ్యమైన ఆటగాళ్లున్నారు. అందుకే వాళ్లు మాతో ఆడటానికి  ముందుకు రావడం లేదు. అయితే ఇరు దేశాలు క్రికెట్ ఆడకపోవడం క్రికెట్ కు మంచిదని నేను అనుకోవడం లేదు. ఒకవేళ రెండు దేశాల మధ్య మ్యాచ్ లు జరిగి ఉంటే ఒత్తిడిని అధిగమించే అవకాశం ఆటగాళ్లకు దక్కేది. పాక్ లో అలా  ఒత్తిడిని తట్టుకుని నిలిచే క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. ఇండియాలో మాత్రం లేరు’ అని అన్నాడు. 

అంతేగాక.. ‘ఇండియా కూడా మంచి టీమే. వాళ్లకు కూడా మంచి ప్లేయర్లున్నారు. కానీ మాతో పోల్చుకుంటే మాత్రం తక్కువే. మాకు ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు. వాళ్ల (భారత్)కు కపిల్ దేవ్. వారిద్దరినీ పోల్చి చూస్తే ఇమ్రాన్ ఖానే నెంబర్ వన్.  ఆ తర్వాత మాకు వసీం అక్రమ్ ఉన్నాడు. కానీ  ఇండియాకు ఆయనతో పోల్చదగ్గ బౌలర్ లేడు. మాకు జావేద్ మియందాద్ ఉంటే ఇండియాకు గవాస్కర్ ఉన్నాడు. తర్వాత మాకు ఇంజమామ్, యూసుఫ్, యూనిస్ ఖాన్, షాహిది అఫ్రిది వంటి ఎంతో మంది మెరుగైన ఆటగాళ్లు తయారయ్యారు. వాళ్లకు కూడా ద్రావిడ్, సెహ్వాగ్ వంటి వాళ్లు ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా చూస్తే భారత్ కంటే పాక్ లోనే టాలెంటెడ్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇందుకే భారత్ మాతో ఆడటానికి ఇష్టపడదు’ అని వ్యాఖ్యానించాడు. 

రజాక్ వ్యాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. అనిశ్చితికి మారుపేరుగా నిలిచే పాక్ జట్టును భారత్ తో పోల్చుకోవడం హాస్యాస్పదమని కామెంట్స్ చేస్తున్నారు. ఐసీసీ ఈవెంట్లలో భారత్ పాక్ లు ఇప్పటివరకు 17 సార్లు తలపడగా.. భారత్ 14 సార్లు నెగ్గగా పాక్ 3 సార్లు మాత్రమే గెలిచింది. ఒత్తిడిని తట్టుకునే వాళ్లైతే బడా ఈవెంట్లలో ఎందుకు ఓడిపోతున్నారో సెలవివ్వాలని రజాక్ ను ప్రశ్నిస్తున్నారు. గత రెండు వరల్డ్ కప్ మ్యాచ్ లలోనూ పాక్ పై భారతే ఘన విజయం సాధించిన విషయాన్ని రజాక్ కు గుర్తు చేస్తున్నారు. 

click me!