T20 World Cup: ఆ ఆరు ఫైనల్స్ లో జరిగిందేమిటి? విజేతలెవరు? ఆసీస్-కివీస్ తుదిపోరుకు ముందు వీటిపై ఓ లుక్కేయండి..

By team teluguFirst Published Nov 13, 2021, 4:19 PM IST
Highlights

Australia Vs New Zealand: చిరకాల ప్రత్యర్థుల మధ్య రేపు సాయంత్ర ఆసక్తికర పోరు జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ఆరు ఫైనల్స్ లో  మ్యాచ్ లు ఎలా, ఎవరి మధ్య జరిగాయి..? విజయం ఎవరిని వరించింది..? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం..

సుమారు 20 రోజులుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పొట్టి క్రికెట్ సంగ్రామం చివరి దశకు చేరింది.  లీగ్ దశతో పాటు సెమీఫైనల్స్ కూడా ముగిశాయి. ఇక మిగిలింది తుది సమరమే. ఈ మేరకు ఆదివారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అంచనాలేమీ లేకుండా ప్రపంచకప్ లో అడుగుపెట్టిన కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ సేన.. అయిదు వన్డే ప్రపంచకప్ లు కొట్టినా టీ20 ప్రపంచకప్ లేని లోటును ఈసారైనా తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్న ఆరోన్ ఫించ్  నేతృత్వంలోని కంగారూ సేనతో తలపడనున్నది. ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య రేపు సాయంత్ర ఆసక్తికర పోరు జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ఆరు ఫైనల్స్ లో  మ్యాచ్ లు ఎలా జరిగాయి..? విజయం ఎవరిని వరించింది..? పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనేదానిపై ఓ లుక్కేద్దాం..

పుట్టిందిలా.. 

ఐదు రోజుల పాటు ఆడే టెస్టు క్రికెట్ పట్ల జనాలకు బోర్ కొట్టడంతో ఆ స్థానాన్ని ఒక్కరోజు అంతర్జాతీయ మ్యాచ్ లు (50 ఓవర్లు) భర్తీ చేశాయి. కానీ జనాలకు రోజంతా క్రికెట్ చూసే ఓపిక లేదు. క్రికెట్ చూడటానికి రోజంతా  వేచి  చూడాలా..? అనుకుంటున్న సందర్భంలో వచ్చిందే టీ20. ఈ ధనాధన్ ఆట కూడా క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ లోనే పురుడు పోసుకుంది. ఈ శతాబ్దం మొదట్లో పురుడు పోసుకున్న ఈ ఆట పెద్దగా ప్రాధాన్యం పొందకపోవచ్చునని మొదట్లో అనుమానాలు ఎదురయ్యాయి. కానీ కాలానికి ఎదురొడ్డి మరీ ఇవాళ క్రికెట్ అంటే టీ20.. టీ20 అంటేనే క్రికెట్ అనేంతగా ప్రాధాన్యం సంతరించుకుంది. క్రికెటర్లు కూడా  టెస్టులు.. వన్డేల కంటే టీ20లకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇండియాలో  ఐపీఎల్, పాకిస్థాన్ లో పీసీఎల్, ఆసీస్ లో బిగ్ బాష్ లీగ్, వెస్టిండీస్ లో కరేబియన్ లీగ్.. ఇలా దేశానికో లీగ్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. జనాలను ఇంతగా అలరిస్తున్న తొలి పొట్టి ప్రపంచకప్ 2007లో జరిగింది. 

ప్రస్థానమిది..

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2007లో  దక్షిణాఫ్రికా  వేదికగా తొలి టీ20 ప్రపంచకప్ నిర్వహించింది. అయితే అప్పటికీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఇది ప్రాచుర్యం పొంది ఉంది.  ఆ మూడు జట్లలో ఏదో ఒకటి ఈ కప్పును ఎగరేసుకుపోవడం ఖాయం అనుకున్నారు.  టీమిండియా కూడా ఆ టోర్నీలో పాల్గొంది. అయినా భారత్ కప్పు కొడుతుందని ఎవరూ ఊహించలేదు. గంగూలీ నిష్క్రమణ అనంతరం.. భారత్ కు సారథ్య పగ్గాలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు నాయకుడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తొలి టీ20 ప్రపంచకప్ ను భారత్ సొంతం చేసుకుంది.  

ముహుర్తం మనతోనే.. 

2007 టీ20 ప్రపంచకప్.. చిరకాల ప్రత్యర్థులైన ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. గౌతం గంభీర్ 75 పరుగులతో టాప్ స్కోరర్. పాక్ బౌలర్ ఉమర్ గుల్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్.. 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. జోగిందర్ శర్మ వేసిన ఆఖరు ఓవర్.. మిస్బా బ్యాటింగ్.. శ్రీశాంత్ క్యాచ్ ను భారత అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. 

ఇదీ చదవండి : T20 World cup: కొత్త విజేతను చూస్తామా..? వరల్డ్ కప్ రెండో సెమీస్ లో పాక్ పై ఆసీస్ గెలిస్తే చరిత్రే..

రెండో పట్టు పాకిస్థాన్ దే..

2009లో జరిగిన రెండో టీ20 ప్రపంచకప్ ఫైనల్ పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేశారు. సంగక్కర (64) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. షాహిద్ అఫ్రిది (54) దుమ్ము దులిపాడు. 

మూడో సారి ఇంగ్లాండ్ విజయం.. 

క్రికెట్ పుట్టినిల్లైనప్పటికీ అప్పటివరకు ప్రపంచకప్ నెగ్గలేదన్న అపప్రదను ఇంగ్లాండ్ జయించింది. 2010 లో జరిగిన టీ20 ప్రపంచకప్  ఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది.  ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కాలింగ్ వుడ్ సేన.. 17 ఓవర్లోనే లక్ష్యాన్ని ముద్దాడింది.  అంతే..  ఇంగ్లాండ్ కు తొలి ఐసీసీ ట్రోఫీ దక్కింది. (2019లో  ఆ జట్టు వన్డే ప్రపంచకప్ నెగ్గింది)   

నాలుగో దెబ్బ.. కరేబియన్లది.. 

2012లో జరిగిన టీ20 ప్రపంచకప్ తుది పోరు వెస్టిండీస్-శ్రీలంకల మధ్య జరిగింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్స్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ ను లంక 137 పరుగులకే కట్టడి చేసింది.  శ్యాముల్స్ (78) ఒక్కడే నిలబడ్డాడు. కానీ బౌలింగ్ లో విండీస్ అద్భుతంగా పోరాడింది. లంకను 101 పరుగులకే కట్టడి చేసింది. సునీల్ నరైన్ 3 వికెట్లు పడగొట్టి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

ఎట్టకేలకు లంకకు.. 

అంతకుముందు రెండు సార్లు ఫైనల్స్ కు చేరినా కప్పును ముద్దాడని లంక.. ఈసారి దానిని ఒడిసిపట్టింది. 2014  టీ20 ప్రపంచకప్ ఇండియ-శ్రీలంక మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 130 పరుగులే చేసింది. విరాట్ కోహ్లి (52) ఒక్కడే రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన లంక.. 17.5 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించి తొలి టీ20 ప్రపంచకప్ ను అందుకుంది. 

ఆరోది.. మళ్లీ కరేబియన్లే..

2016 టీ20 ప్రపంచకప్ భారత్ లోనే జరిగింది. ఈసారి భారత్ తప్పక ట్రోఫీ కొడుతుందని అందరూ భావించారు. కానీ ఫైనల్స్ మాత్రం వెస్టిండీస్-ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఇండియన్ లార్డ్స్ గా భావంచే ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 155 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్.. 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ శ్యామూల్స్ (85), బ్రావో (25) కలిసి జట్టును ఆదుకున్నారు. ఆఖర్లో.. బ్రాత్ వైట్ (10 బంతుల్లో 34.. 1 ఫోర్, 4 సిక్సర్లు)  విధ్వంసంతో విండీస్ కు రెండో పొట్టి ప్రపంచకప్ ను అందుకుంది. 

ఇప్పుడెవరు..? 

ఇప్పటివరకు జరిగిన ఆరు ప్రపంచకప్పులలో ఇండియా, శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఒక్కసారి నెగ్గగా.. వెస్టిండీస్ రెండుసార్లు గెలుచుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఇంకా ఖాతా తెరువలేదు. రేపు జరుగబోయే ఆసీస్-కివీస్ పోరులో విజేత ఎవరైనా వాళ్లు కొత్త ఛాంపియనే కానున్నారు. ఇరు జట్లు అన్ని విభాగాల్లో సమానంగానే ఉన్నారు. దీంతో ఈ పోరు రసవత్తరం కానున్నది. మరి రేపటి పోరులో విజేత ఎవరో తెలియాలంటే రేపటిదాకా వేచి చూడాల్సిందే. 

click me!