మీకేటి తెలుస్తదన్నియా.. మేమింటికెళ్లిపోయామన్నియా.. పాక్ బుడ్డోడి బాధలు.. వీడియో షేర్ చేసిన అక్తర్

By team teluguFirst Published Nov 13, 2021, 1:41 PM IST
Highlights

T20 World Cup: భారత్ మాదిరే క్రికెటర్లను అమితంగా అభిమానించే పాక్ లో టీ20 ప్రపంచకప్ లో సెమీస్ ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీ ఆసాంతం రాణించి సెమీస్ మెట్టు మీద చతికిలపడటాన్ని పెద్దవాళ్లే కాదు.. చిన్న పిల్లలు కూడా తట్టుకోలేకపోతున్నారు.

ఉపఖండపు దేశాలలో క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదు.. అది ఒక మతం వంటిది. ఇంగ్లాండ్ లో పుట్టిన ఈ జెంటిల్మెన్ గేమ్.. ఆ దేశంతో పాటు ఆస్ట్రేలియా లో కూడా విస్తృత క్రేజ్ ఏర్పరుచుకుంది. కానీ ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఇది కేవలం ఆట కాదు.. అంతకుమించి.. అందుకే  ఈ దేశాలలో క్రికెటర్లను అభిమానులు ఆరాదిస్తారు. దేవుళ్లుగా కొలుస్తారు. భారత్ లో సచిన్ టెండూల్కర్ కోట్లాది అభిమానుల ఆరాధ్య దైవం. సచిన్ క్రికెట్ ఆడటం మానేసినా ఆయన మీదున్న అభిమానం మాత్రం ఎప్పటికీ చెరగనిది. పాకిస్థాన్ లో కూడా అంతే.. మనకు కపిల్ దేవ్, గావస్కర్, సచిన్, ధోని, కోహ్లి మాదిరే.. అక్కడా ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, ఇంజమామ్, బాబర్ ఆజమ్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎందరో.. అయితే బాగా ఆడినప్పుడు వేనోళ్ల పొగిడిన ఆ నోళ్లే.. కీలక టోర్నీలలో విఫలమైతే మాత్రం ఆగ్రహాన్ని చూపిస్తాయి.  

క్రికెటర్లను అమితంగా అభిమానించే పాక్ లో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి కారణాలేవైనా ఫైనల్ ఓవర్ లో  కీలక క్యాచ్ వదిలేసిన హసన్ అలీ అక్కడ బలిపశువయ్యాడు.  అతడిపై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే  టోర్నీ ఆసాంతం రాణించి సెమీస్ మెట్టు మీద చతికిలపడటాన్ని పెద్దవాళ్లే కాదు.. చిన్న పిల్లలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్న ఆస్ట్రేలియా-పాకిస్థాన్  సెమీస్ మ్యాచ్ చూసిన ఓ బుడ్డోడు.. పాక్ ఓడిన తర్వాత బోరుమని విలపించాడు. టీవీ వైపునకు వెళ్లి అసహనంతో దానిని పగలగొట్టబోయాడు.  తండ్రి వారించినా వినిపించుకోలేదు. పాక్ ఓటమి పట్ల ఆ బుడ్డోడు తీవ్ర నిరాశకు గురయ్యాడు.

 

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. ఈ వీడియోను తన ఇన్స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశాడు. ఈ మేరకు అక్తర్ స్పందిస్తూ.. ‘మీ జట్టు బాగా ఆడి  ఓటమి పాలైతే ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. అందుకే ఈ ప్రపంచకప్ మాకు చాలా ముఖ్యం..’ అంటూ రాసుకొచ్చాడు. 

 

ఆరేండ్ల కుర్రాడి నుంచి అరవై ఏండ్ల ముసలి దాకా తమ దేశంలో క్రికెట్ ను ఆరాధిస్తారని అక్తర్ తెలిపాడు.కాగా ఈ వీడియో గతేడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడినప్పుడు ఓ ఆంధ్రా పిల్లాడు విలపించిన దానిని గుర్తుకు తెచ్చింది. గతేడాది.. ధోని సారథ్యంలోని సీఎస్కే.. ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా  గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.  దీంతో ఓ బాబు.. ‘మీకేటి తెలుస్తదన్నియా.. మీరెక్కడో ఉంటారు.. మేమటన్నియా..  మేమింటికెళ్లిపోయామన్నియా...’ అంటూ ఏడుస్తున్న వీడియో అప్పట్లో తెగ వైరలైన విషయం తెలిసిందే. 

కాగా సెమీస్ లో ఆసీస్ చేతిలో ఓడిన పాక్.. త్వరలోనే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నది. పాక్ ఆటగాళ్లు దుబాయ్ నుంచి నేరుగా ఢాకా చేరుకుని.. బంగ్లాదేశ్ తో మూడు టీ20 లు, రెండు టెస్టులు ఆడనున్నారు.

click me!