T20 World Cup: భారత ఆటగాళ్ల వైఫల్యానికి ప్రధాన కారణమదే.. టీమిండియా బ్యాటర్లపై సునీల్ గావస్కర్ కామెంట్స్

Published : Nov 09, 2021, 03:30 PM IST
T20 World Cup: భారత ఆటగాళ్ల వైఫల్యానికి ప్రధాన కారణమదే.. టీమిండియా బ్యాటర్లపై సునీల్ గావస్కర్ కామెంట్స్

సారాంశం

Sunil Gavaskar: టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఘోర వైఫల్యం అనంతరం జట్టులో మార్పులు చేయాలని విమర్శలు వస్తున్నాయి. అయితే అలాంటి అవసరం లేదని గావస్కర్ అన్నాడు. మార్చాల్సింది జట్టును కాదని,  ఆటగాళ్ల దృక్పథమని సూచించాడు.

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భారత్  ప్రయాణం నిన్నటితో ముగిసింది. నమీబియాతో మ్యాచ్ ఆడిన టీమిండియా.. విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి రెండు మ్యాచులలో ఓడిన ఇండియా.. తర్వాత మూడు మ్యాచులలో గెలిచినా సెమీస్ చేరలేదు. పాకిస్థాన్, న్యూజిలాండ్ పై భారత  బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అయితే ఈ వైఫల్యానికి టాస్, తీరిక లేని క్రికెట్ కారణమని టీమిండియాకు చెందిన పలువురు ఆటగాళ్లతో పాటు శిక్షక బృందం సభ్యులు కూడా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని  భారత సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయమై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.  టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్ లో ఎందుకు విఫలమయ్యారో వివరించాడు. 

టీమిండియా వైఫల్యం అనంతరం జట్టులో మార్పులు చేయాలని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అలాంటి అవసరం లేదని గావస్కర్ అన్నాడు. మార్చాల్సింది జట్టును కాదని,  ఆటగాళ్ల దృక్పథమని సూచించాడు.  గావస్కర్ మాట్లాడుతూ..‘జట్టులో మార్పులు చేయాల్సిన పన్లేదు. టోర్నీలో ఇండియా అన్ని మ్యాచులు ఓడిపోలేదు. మొదటి రెండు (పాకిస్థాన్, న్యూజిలాండ్) మ్యాచులలో బ్యాటర్లు స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. అదే ఇప్పుడు భారత్ నిష్క్రమణకు దారితీసింది. ఈ దృక్పథం మారాల్సిన అవసరమున్నది’ అని అన్నాడు. 

‘అసలు విషయమేమిటంటే.. మొదటి ఆరు ఓవర్లను భారత్ సరిగ్గా వినియోగించుకోవట్లేదు. మొదటి ఆరు ఓవర్లలో 30 యార్డ్ సర్కిల్ వెలుపల ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఐసీసీ ఈవెంట్లలో భారత బ్యాటర్లు దీనిని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఈ కారణంతోనే మనం చాలా బలమైన జట్టుగా ఉన్నా.. మంచి బౌలర్లున్నా విఫలమవుతున్నాం. ఒకవేళ మంచి స్కోరు లేనప్పుడు వాళ్లు (బౌలర్లు) మాత్రం ఏం చేయగలరు...? ఆటగాళ్ల దృక్పథంలో కచ్చితంగా మార్పులు రావాల్సిన అవసరమున్నది’ అని తెలిపాడు.

తొలి రెండు మ్యాచ్ లలో టాస్, మంచు గానీ భారత ఓటమికి కారణం కాదని గావస్కర్ అన్నాడు. అలా అయితే మిగిలిన మూడు మ్యచులలో వాళ్లు చెలరేగి ఎలా ఆడుతారని ప్రశ్నించాడు. బ్యాటర్లు కొన్ని ఎక్కువ  పరుగులు చేసుంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని చెప్పాడు. ఇక భారత జట్టులో ఫీల్డింగ్ లోపాలను కూడా లిటిల్ మాస్టర్ ఎత్తి చూపాడు. ఫీల్డింగ్ విషయంలో భారత్.. న్యూజిలాండ్ ను చూసి నేర్చుకోవాలని సూచించాడు. 

‘ఒక జట్టు విజయంలో బ్యాటర్లు, బౌలర్లతో పాటు ఫీల్డర్ల కృషి కూడా ఉంటుంది. న్యూజిలాండ్ జట్టును చూడండి. ఆ జట్టులో ఫీల్డర్లు బంతులను  ఆపడం.. క్యాచ్ లు పట్టడం.. బౌండరీ లైన్ వద్ద సిక్సర్లను ఆపే విధానం.. ఇవన్నీ చూస్తే ముచ్చటేస్తుంది. ఒకవేళ పిచ్ సహకరించకపోయినా.. మంచి బౌలింగ్ తో దాడి చేస్తూ అటాకింగ్ ఫీల్డింగ్ ఉంటే అది కచ్చితంగా మ్యాచ్ గమనాన్ని మర్చేస్తుంది.  ఇదే విషయంలో భారత జట్టును పరిశీలిస్తే.. మనకు ముగ్గురు, నలుగురు కంటే ఎక్కువ మంది ఉత్తమ ఫీల్డర్లు కనిపించడం లేదు. మిగతా వారిపై పరుగులు ఆపడానికి గానీ, బౌండరీ లైన్ వద్ద ఫోర్లు వెళ్లకుండా నియంత్రించేంత స్థాయిలో వేరే వాళ్లు లేరు..’ అని చెప్పాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?