T20 World cup: గప్తిల్ వీరవిహారం.. కాస్తలో సెంచరీ మిస్.. స్కాట్లాండ్ ఎదుట భారీ లక్ష్యం

By team teluguFirst Published Nov 3, 2021, 5:21 PM IST
Highlights

NZ vs SCO: టాస్ గెలిచిన స్కాట్లాండ్.. కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ వీరవిహారం చేశాడు.

టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో  భాగంగా గ్రూప్-2లో నేడు న్యూజిలాండ్-స్కాట్లాండ్ (Nezealand vs Scotland) తలపడుతున్నాయి.  ఈ టోర్నీలో ఇప్పటివరకు  ఆడిన రెండు మ్యాచుల్లో.. (పాకిస్థాన్, భారత్ తో) ఒకదాన్లో గెలిచి ఒకదాన్లో పరాజయం పాలైన న్యూజిలాండ్ (Newzealand).. పసికూనలపై గెలిచి సెమీస్ బెర్త్ కు ముందంజ వేయాలని భావిస్తున్నది. కాగా  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ (Scotland).. కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (martin guptil) వీరవిహారం చేశాడు. కాస్తలో సెంచరీ మిస్ అయ్యాడు. మరో ఎండ్ లో ఫిలిప్స్ కూడా రాణించాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన  కివీస్ కు ఓపెనర్లు.. గప్తిల్ (56 బంతుల్లో 93.. 6 ఫోర్లు, 7 సిక్సర్లు),  మిచెల్ (11 బంతుల్లో 13)  శుభారంభాన్నే ఇచ్చారు. వీరిద్దరూ తొలి నాలుగు ఓవర్లలోనే 35 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన వీల్.. ఏకంగా 5 వైడ్లు వేశాడు. ఈ ఓవర్లో గప్తిల్ ఫోర్ తో ఖాతా తెరిచాడు. మూడో ఓవర్లో కూడా గప్తిల్.. ఎవాంటస్ బౌలింగ్ లో రెండు ఫోర్లు బాదాడు. కాగా.. ఐదో ఓవర్ వేసిన షరిఫ్.. న్యూజిలాండ్ ను తొలి దెబ్బ తీశాడు. ఆ ఓవర్లో తొలి బంతికి జోరుమీదున్న మిచెల్ ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. 

అదే ఓవర్లో షరిఫ్ మరో మ్యాజిక్ చేశాడు.  మిచెల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (0) డకౌట్ అయ్యాడు.  ఐదో ఓవర్ ఐదో బంతికి మాథ్యూ క్రాస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ ఓవర్లో రెండు వికెట్లు పడి మెయిడిన్ కావడం  ఒక్కటే విశేషం.  అదొక్కటే ఈ ఇన్నింగ్స్ లో స్కాట్లాండ్ కు సంతోషించే విషయం. 

ఆరో ఓవర్ వేసిన ఎవాంటస్ బౌలింగ్ లో గప్తిల్.. ఫోర్, సిక్సర్ కొట్టాడు. కానీ ఏడో ఓవర్లో కీపర్ కాన్వే (1) మార్క్ వాట్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (37 బంతుల్లో 33.. 3 ఫోర్లు) గప్తిల్ కు అండగా నిలిచాడు. ఆ క్రమంలో కివీస్ స్కోరు కాస్త నెమ్మదించింది.  కానీ  పదో ఓవర్ తర్వాత గప్తిల్ బాదుడు షురూ అయింది. 13 వ ఓవర్లో  క్రిస్ గ్రేవ్స్ వేసిన రెండో బంతిని సిక్సర్ తరలించిన అతడు.. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20 లలో ఇది అతడికి 18వ హాఫ్ సెంచరీ. 14 ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 110-3. 

ఇక అప్పట్నుంచి గప్తిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. దొరికిన బంతిని దొరికనట్టు స్టాండ్స్ లోకి పంపాడు. వీల్ వేసిన 14వ ఓవర్లో ఒకటి.. షరీఫ్ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లు.. 17వ ఓవు్లో మరో సిక్సర్ బాది సెంచరీకి చేరువయ్యాడు. 

 

Martin Guptill walks off the field with the second highest score hit by a New Zealand batter in a mens's T20 World Cup.

A superb effort. pic.twitter.com/wpiUZjJ9YJ

— Wisden (@WisdenCricket)

కానీ అప్పటికే అలసిపోయిన గప్తిల్.. 90లలోకి వచ్చిన తర్వాత కాస్త నెమ్మదించాడు. ఇదే క్రమంలో వీల్ వేసిన 18 వ ఓవర్లో ఫిలిప్స్.. క్రిస్ గ్రీవ్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే.. సెంచరీకి చేరువలో ఉన్న గప్తిల్ భారీ షాట్ ఆడి  బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్లాయిడ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో అతడి ధనాధన్ ఇన్నింగ్స్ కు తెరపడింది. 

గప్తిల్, ఫిలిప్స్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన  జిమ్మీ నీషమ్ (10*), మిచెల్ సాంట్నర్ (2*)  ఆఖర్లో మెరుపులు మెరిపించడంలో విఫలమయ్యారు. ఫలితంగా న్యూజిలాండ్.. స్కాట్లాండ్ ఎదుట 173 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. 

నమీబియా బౌలర్లలో షరీఫ్, మార్క్ వాట్ రాణించారు. ముఖ్యంగా వాట్.. 4 ఓవర్లు వేసి 13 పరుగులే ఇచ్చి  ఒక వికెట్ పడగొట్టగా షరీఫ్ అన్నే ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక వీల్ 2 వికెట్లు తీసినా.. భారీగా పరుగులిచ్చుకున్నాడు. ఎవాన్స్ బౌలింగ్  లో గప్తిల్ కసితీరా బాదాడు. 

click me!