కథ ముగిసింది.. కల చెదిరింది.. కన్నీరే ఇక టీమిండియాకు మిగిలింది.. అఫ్గాన్, భారత్ ఇంటికి.. కివీస్ సెమీస్ కు..

By team teluguFirst Published Nov 7, 2021, 6:42 PM IST
Highlights

New Zealand Vs Afghanistan: ఛాంపియన్ జట్టులా ఆడిన కివీస్.. అఫ్గానిస్థాన్ ను అలవోకగా ఓడించింది. అఫ్గాన్ తో పాటు భారత్ ను కూడా  టోర్నీ నుంచి ఇంటికి పంపించింది. కనీస స్థాయిలో పోరాడుతుందని భావించిన మహ్మద్ నబీ నేతృత్వంలోని అఫ్గాన్.. కీలక పోరులో చేతులెత్తేసింది.

అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్.. అబుదాబిలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన  మ్యాచ్ లో భారత ఆటగాళ్లు ఎవరూ ఆడలేదు. ఇరు జట్లూ మన ప్రత్యర్థులే.  అందులో ఒక జట్టుపై గెలిచాం. మరో జట్టు లీగ్ దశలో ఇండియాను ఓడించింది కూడా. ఇప్పుడే కాదు.. ఐసీసీ టోర్నీలలో మన పాలిట ఆ జట్టుది భస్మాసుర హస్తమే. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా.. ‘ఏమో..  టీ20లలో ఏ జట్టైనా అద్భుతం చేయవచ్చేమో.. అఫ్గానిస్థాన్ కూడా న్యూజిలాండ్ ను ఓడిస్తుందేమో..’ఇదే సగటు భారత అభిమాని ఆశ. 

అఫ్గాన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందని ఆశించని భారత క్రికెట్ ఫ్యాన్ లేడంటే అతిశయోక్తి కాదు. కానీ.. అలాంటిదేమీ జరుగులేదు. అద్భుతాలేమీ నమోదవలేదు. అంతా సాధారణమే. ఛాంపియన్ జట్టులా ఆడిన కివీస్.. అఫ్గాన్ ను అలవోకగా ఓడించింది. అఫ్గాన్ తో పాటు భారత్ ను కూడా  టోర్నీ నుంచి ఇంటికి పంపించింది. కనీస స్థాయిలో పోరాడుతుందని భావించిన మహ్మద్ నబీ నేతృత్వంలోని అఫ్గాన్ జట్టు.. కీలక పోరులో చేతులెత్తేసింది. రెండు దేశాల క్రికెట్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. అఫ్గాన్ కు ఏమో గానీ.. భారత అభిమానులకైతే ఇది గుండె పగిలే వార్తే.

ఇక అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నబీ సేన నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే లక్ష్యాన్ని ఛేదించి కోల్పోయి సెమీస్ కు దూసుకెళ్లింది.  ఛేజింగ్ లో కివీస్ సారథి కేన్ విలియమ్సన్, కాన్వే రాణించారు. 

 

Booking a place in the finals! Kane Williamson 40* and Devon Conway 36* finish things off against Afghanistan in Abu Dhabi. | https://t.co/5hlORtSdCL pic.twitter.com/rJjAR4ZCfX

— BLACKCAPS (@BLACKCAPS)

అఫ్గాన్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ కు శుభారంభం దక్కింది. ఆ జట్టు ఓపెనర్లు మిచెల్ (12 బంతుల్లో 17.. 3 ఫోర్లు), గప్తిల్ (23 బంతుల్లో 28.. 4 ఫోర్లు) రాణించారు. దూకుడుగా ఆడిన మిచెల్ ను నాలుగో ఓవర్లో ముజీబ్ ఔట్ చేశాడు. కానీ ఆ తర్వాత  గప్తిల్ జోరు కొనసాగించాడు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న గప్తిల్ ను రషీద్ ఖాన్ బౌల్డ్ చేశాడు. ఇది అతడికి టీ20లలో 400 వ వికెట్ కావడం గమనార్హం.  పది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 61-2 గా ఉంది. 

మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విలియమ్సన్.. (42 బంతుల్లో 40.. 3 ఫోర్లు) చివరిదాకా క్రీజులో నిలిచాడు. నిలకడైన ఆటతీరుతో కివీస్ ను విజయతీరాలకు చేర్చాడు. అతడికి కీపర్ కాన్వే (32 బంతుల్లో 36.. 4 ఫోర్లు) జతకలిశాడు. ఇద్దరూ వికెట్ల మధ్య పరిగెత్తుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ న్యూజిలాండ్ ను లక్ష్యం దిశగా నడిపించారు. 

 

So assuming Pakistan will beat Scotland,
SF 1 ENG v NZ, Abu Dhabi
SF 2 PAK v AUS,

— Zohaib Hussain (@zeehu)

అఫ్గానిస్థాన్ బౌలర్లలో  ముజీబ్, రషీద్ ఖాన్ కు చెరో వికెట్ దక్కింది. నబీ, హమీద్ హసన్ పొదుపుగా బౌలింగ్ చేసినా జట్టును గెలిపించుకునే ప్రదర్శనైతే కాదు.  న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కు ప్లేయర్ ఆఫ్  ది మ్యాచ్ దక్కింది. తొలి సెమీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు.. ఈనెల 10న ఇంగ్లాండ్ ను ఢీకొనబోతున్నది. ఇక ఇండియా-నమీబియా మ్యాచ్ నామమాత్రమే. మన యోధులు రికార్డులు మెరుగుపరుచుకోవడానికే పరిమితం కానుంది. 

click me!