T20 World Cup: వాళ్లదీ వైరమే.. కానీ మనలా కాదు..! కివీస్-ఆసీస్ ఫైనల్ ముందు గంభీర్ సంచలన వ్యాఖ్యలు

Published : Nov 14, 2021, 04:23 PM IST
T20 World Cup: వాళ్లదీ వైరమే.. కానీ మనలా కాదు..! కివీస్-ఆసీస్ ఫైనల్ ముందు గంభీర్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Australia Vs New Zealand: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు  ముందు భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్-కివీస్ కూడా ఇరుగు పొరుగు దేశాలే అయినా.. ఆ  రెండు దేశాల ప్రజలు ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్నా అది భారత్-పాకిస్థాన్ వైరమంత అయితే కాదని అని అభిప్రాయపడ్డాడు. 

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య నేటి సాయంత్రం పొట్టి ప్రపంచకప్ మహా సంగ్రామం జరుగనున్నది. తొలి టీ20 ప్రపంచకప్ ను ముద్దాడాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఫైనల్ లో ఏ జట్టు గెలుస్తుందనే విషయమై ఇప్పటికే క్రీడా పండితులు విశ్లేషణలు చేస్తున్నా ఆఖరు బంతి పడేదాకా విజయం  ఎవరిదో చెప్పడం కష్టం.  అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్-కివీస్ కూడా ఇరుగు పొరుగు దేశాలే అయినా.. ఆ  రెండు దేశాల ప్రజలు ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్నా అది భారత్-పాకిస్థాన్ వైరమంత అయితే కాదని అన్నాడు. క్రికెట్ అనేది వాళ్లకు ఒక ఆట మాత్రమే అని కానీ మన (ఇండియా, పాకిస్థాన్) కు అలా కాదని పేర్కొన్నాడు. ఈ మేరకు గంభీర్ తన బ్లాగ్ లో పలు ఆసక్తికర అభిప్రాయాలను వెలిబుచ్చాడు. 

గంభీర్ స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య క్రికెటింగ్ వైరాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇండియా-పాకిస్తాన్ ల మాదిరే అవి కూడా ఇరుగు పొరుగు దేశాలు.  ఒకరి చేతిలో ఒకరు ఓడిపోవడాన్ని ఆ జట్లు అస్సలు ఇష్టపడవు. కానీ వాళ్ల మధ్య వైరం భారత్-పాక్ అంత తీవ్రమైనదైతే కాదు. ఒక్క క్రికెట్ లోనే గాక రగ్బీ, నెట్ బాల్ లో కూడా ఆసీస్-కివీస్ లు పోటీ పడుతాయి. 

భారత్-పాక్ మధ్య ఉన్నంత శత్రుత్వం  ఆసీస్-కివీస్ మధ్య ఏ విధంగానూ లేదు. ఎందుకని మీరు ఆలోచిస్తున్నారా..? ఎందుకంటే ఆటను అడ్డం పెట్టుకుని అక్కడ అడ్వర్టైజింగ్ సంస్థలు వ్యాపారం చేయడం లేదు. ఇక్కడ ఆర్థికమే ప్రధానాంశం. ఇక ఇండియా-పాక్ మధ్య క్రికెటింగ్ వైరం ఇప్పటిది కాదు. 1947 నుంచి అది కొనసాగుతూనే ఉంది. ఒక్కోసారి ఇది ఒక పరిశ్రమ వంటిదని నేను భావిస్తున్నాను. దీనిని తగ్గించడానికి ఎవరూ భావించడం లేదు. ఎందుకంటే ఇది భారీ ఆదాయాన్ని  సమకూరుస్తున్నది.

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల  ఉమ్మడి జనాభా సుమారు 3 కోట్లు. మన దగ్గరేమో భారత్ లో  దాదాపు 140 కోట్లకు పైగా ఉంటే పాక్ లో 22 కోట్లు. ఇరు దేశాల్లో కనీసం 10 శాతం మంది క్రికెట్ చర్చల్లో పాల్గొన్నా.. ఆసీస్, కివీస్ ల జనాభా కంటే అయిదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.  ఇక మన రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయి. అంటే నా ఉద్దేశం ఆసీస్, కివీస్ లో క్రికెట్ చూసే జనాలను మనసు లేదని కాదు. కానీ భారతీయులకు ఉద్వేగం ఎక్కువ. మనం ఓటమిని జీర్ణించుకోలేం. కానీ ఆసీస్ లో అలా కాదు. వాళ్లు ఆటను ఆట వరకే చూస్తారు. బ్యాడ్ లక్ అని.. భాగా ప్రయత్నించారు అని సర్ది చెప్పుకుంటారు. గెలిచినా ఓడినా వారి జీవితం ఎప్పటిలాగే ఉంటుంది. నాకు కొంతమంది మిత్రులు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఈ ఫైనల్ కోసం రాత్రంతా వేచి ఉండాలా..? అనేది వాళ్లకున్న బాధ. అంతేతప్ప వాళ్లు  మ్యాచ్ ఫలితం గురించి పెద్దగా ఆలోచించరు. 

ఇక ఆదివారం జరిగే మ్యాచ్ లో  అయితే నేను న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్నా. కొద్దిరోజులుగా వాళ్లు చాలా మంచి క్రికెట్ ఆడుతున్నారు..’అని గంభీర్ ముగించాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !
IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !