T20 World Cup: ఇదేం పైత్యంరా అయ్యా! మరీ అందులో కూడా బీర్ పోసుకుని తాగుతారా? ఆసీస్ ఆటగాళ్ల సంబురాలపై ట్రోలింగ్

By team teluguFirst Published Nov 15, 2021, 10:58 AM IST
Highlights

Australia Vs New Zealand: తొలి టీ20 వరల్డ్ కప్ నెగ్గిన  ఆసీస్ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. డ్రెస్సింగ్ రూమ్ లో ఆ ఆటగాళ్ల సంబురాలకు పట్టపగ్గాల్లేవు. విజయానందంలో తాము ఏం చేస్తున్నామన్న సోయి కూడా లేకుండా కంగారూలు చేస్తున్న పనులు వింతగా కనిపిస్తున్నాయి.  

చరిత్రలో తొలిసారి టీ20 ప్రపంచకప్ నెగ్గిన Australia ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. అయిదు వన్డే  ప్రపంచకప్ లు నెగ్గినా, టెస్టులో చాలాకాలం పాటు ఆధిపత్యం కొనసాగించినా పొట్టి ప్రపంచకప్ ను దక్కించుకోవడానికి ఆ జట్టు ఏకంగా  రాముడు వనవాసం పోయినంత కాలం వేచి చూడాల్సి వచ్చింది. 2007 లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ ను ఆసీస్.. 14 ఏండ్ల తర్వాత దక్కించుకుంది. జట్టు నిండా ఆల్ రౌండర్లున్నా.. ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్నే మర్చేయగల హిట్టర్లున్నా.. ప్రపంచంలోని అన్ని వేదికలపై ఆడగల సమర్థులున్నా ఆ జట్టుకు మాత్రం పొట్టి ప్రపంచకప్  ఇన్నాళ్లు అందని ద్రాక్షే అయింది. కానీ నిన్న New Zealand తో జరిగిన ఫైనల్లో మాత్రం ఆసీస్ తన అసలు సిసలు ఆటను బయటకు తీసింది. ఛాంపియన్లలా ఆడి తొలి T20 World Cupను సొంతం చేసుకుంది.  దాంతో ఆసీస్ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. 

డ్రెస్సింగ్ రూమ్ లో ఆసీస్ ఆటగాళ్ల  ఆనందానికి అవధుల్లేవు. షాంపియన్ బాటిళ్లు, బీర్లతో  అక్కడి వాతావరణమంతా ఆహ్లాదకరంగా మారింది. కాగా ఆసీస్ ఫైనల్ చేరడానికి ముఖ్య కారకులైన మాథ్యూ వేడ్, మార్కస్ స్టాయినిస్ అయితే వెరైటీ స్టైల్ లో సంబురాలు చేసుకున్నారు.  పాక్ తో జరిగిన సెమీస్ లో ఆ ఇద్దరు ఆటగాళ్లు నిలబడి కంగారూలను ఫైనల్ కు చేర్చిన విషయం తెలిసిందే. 

డ్రెస్సింగ్ రూమ్ లో వీళ్లిద్దరూ వాళ్ల షూ (బూట్లు) విప్పి అందులో  డ్రింక్స్ పోసుకుని తాగారు.  ముందుగా వేడ్.. తన షూ తీసి దాన్లో బీర్ పోసి తాగగా.. ఆ తర్వాత స్టాయినిస్ అతడి దగ్గర్నుంచి షూ లాక్కుని అదే పని చేశాడు.  ఆ తర్వాత ‘సూపర్ టేస్ట్’ అనడం గమనార్హం.

 

How's your Monday going? 😅 pic.twitter.com/Fdaf0rxUiV

— ICC (@ICC)

ఈ వీడియోను ఐసీసీ తన సామాజిక మాధ్యమాల ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఆసీస్ ఆటగాళ్ల అతి సంబురాలపై నెటిజనులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. సుమారు ఆరు గంటల పాటు వేసుకున్న  షూలో బీర్ పోసుకుని తాగడం ఏంట్రా బాబు..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.  మాములుగా కొద్దిసేపు షూ వేసుకుని విప్పేస్తేనే దాన్నుంచి  అదోరకమైన స్మెల్ వస్తుంది.  అలాంటిది  మ్యాచ్ అంతా షూ వేసుకుని  తర్వాత  అందులోనే డ్రింక్ తాగడంపై.. ‘అరేయ్.. ఏంట్రా ఇది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మరికొందరైతే..‘ఎట్టకేలకు మీరు వరల్డ్ కప్ గెలిచారు కదా.. మీ ఇష్టం.. కానీయండి..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చారిత్రక విజయం సాధించిన ఆసీస్ ఆటగాళ్లకు పట్టపగ్గాలు ఉండవని, వాళ్ల నుంచి ఇంకెన్ని ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో అని సోషల్ మీడియాలో నెటిజనులు అంటున్నారు.

కాగా.. నిన్న జరిగిన ఫైనల్స్ లో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 85 పరుగులుతో వీర విధ్వంసం సృష్టించాడు. కానీ న్యూజిలాండ్ బౌలర్లు అతడి కష్టంపై నీళ్లు కుమ్మరించారు. బౌల్ట్ తప్ప ఏ ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఆసీస్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్ వీర విజృంభణతో కంగారూలు తొలి T20 ప్రపంచకప్ ను ముద్దాడారు. 

click me!