నెలాఖరు నుంచి ఐసీసీ వన్డే సూపర్ లీగ్, క్రికెట్ రూల్స్ లో మార్పులివే...

By Sreeharsha GopaganiFirst Published Jul 28, 2020, 11:19 AM IST
Highlights

వన్డే సూపర్‌ లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన 8 జట్లు వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగతా ఐదు జట్లు వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌లో తలపడాల్సి ఉంటుంది.

వన్డే సూపర్‌ లీగ్‌కు  శ్రీకారం  చుట్టింది ఐసీసీ.  కరోనా‌ మహమ్మారి కారణంగా ఆలస్యమైన లీగ్‌ జులై 30తో ఆరంభం కానుంది. ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ వన్డే సిరీస్‌తో తొలి ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌ మొదలవుతోంది. 

2023 వన్డే వరల్డ్‌కప్‌కు ఇది అర్హత టోర్నీగా ఉండనుంది. ఆతిథ్య భారత్‌ సహా ఏడు అగ్ర జట్లు ఇందులో భాగం కానున్నాయి. టాప్‌-12 వన్డే జట్లతో పాటు నెదర్లాండ్స్‌ ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌లో పోటీపడనున్నాయి. 

మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లను ప్రతి జట్టూ నాలుగు ఇంటా, నాలుగు బయట ఆడాల్సి ఉంటుంది. వన్డే సూపర్‌ లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన 8 జట్లు వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగతా ఐదు జట్లు వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌లో తలపడాల్సి ఉంటుంది. ఇందులో నుంచి రెండు జట్లు వరల్డ్‌కప్‌కు చేరుకుంటాయి

2023 వన్డే వరల్డ్‌కప్‌ 10 జట్లతో జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రతి విజయానికి పది పాయింట్లు లభిస్తాయి. ఫలితం తేలకున్నా, రద్దుగా ముగిసినా, టై అయినా ఐదు పాయింట్లు కేటాయిస్తారు. 

ఇక ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌లో నో బాల్స్‌ను ఫీల్డ్‌ అంపైర్ల స్థానంలో టీవీ అంపైర్లు ప్రకటిస్తారు. ఇక నుంచి ప్రతి బంతినీ పరీక్షించనున్న టీవీ అంపైర్‌ నో బాల్‌పై తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడు. స్లో ఓవర్‌రేట్‌కు జరిమానా నిర్ణయాన్ని సైతం ఇకనుంచి టీవీ అంపైర్లే తీసుకోనున్నారు. ఈ నిబంధనలు జులై 30న ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ వన్డే మ్యాచ్‌తో అమల్లోకి రానున్నాయి.

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్‌ జట్టును సోమవారం ప్రకటించారు. వెస్టిండీస్‌తో విజ్డెన్‌ సిరీస్‌లో ఆడుతున్న స్టార్‌ క్రికెటర్లను ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. బెన్‌ స్టోక్స్‌, జోరూట్‌, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌వుడ్‌, జోస్‌ బట్లర్‌లను సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. టెస్టు సిరీస్‌ అనంతరం విశ్రాంతి కారణం చెప్పినా.. ఐర్లాండ్‌తో సిరీస్‌లో స్టార్‌ ఆటగాళ్లను ప్రయోగించేందుకు ఇంగ్లాండ్‌ సుముఖంగా ఉన్నట్టు లేదు. 

పాకిస్థాన్‌తో సైతం ఇంగ్లాండ్‌ టెస్టు సవాల్‌కు సిద్ధం కానున్న సంగతి తెలిసిందే. ఇయాన్‌ మోర్గాన్‌ నాయకత్వంలోని వన్డే జట్టులో మోయిన్‌ అలీ, జానీ బెయిర్‌స్టో, టామ్‌ బాంటన్‌, శామ్‌ బిల్లింగ్స్‌, టామ్‌ కరణ్‌, లియాం డాసన్‌, జో డెన్లీ, ఆదిల్‌ రషీద్‌, సకీబ్‌ మహ్మద్‌, జేసన్‌ రారు, రీసీ టాప్లీ, జేమ్స్‌ విన్సె, డెవిడ్‌ విల్లేలు ఉన్నారు.

click me!