
ఐపీఎల్ లో గంటకు 150 కిలోమీటర్ల కు మించిన వేగంతో ఆకట్టుకునే బౌలింగ్ ప్రదర్శనలతో రాణిస్తున్న యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పై పాకిస్తాన్ స్పీడ్స్టర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ తన రికార్డు (అత్యంత వేగమైన బంతి గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో) ను బద్దలుకొడితే చూడాలని ఉందని వ్యాఖ్యానించాడు. ఉమ్రాన్ భారత జట్టు తరఫున ఆడాలని, సుదీర్ఘకాలం అతడు క్రికెట్ కు సేవలందించాలని ఆకాంక్షించాడు. శనివారం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా అక్తర్.. ఉమ్రాన్ బౌలింగ్, తన రికార్డులపై స్పందించాడు.
అక్తర్ మాట్లాడుతూ... ‘అతడు (ఉమ్రాన్) చాలా కాలం పాటు క్రికెట్ లో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. కొద్దిరోజుల క్రితం నాకు అత్యంత వేగవంతమైన బాల్ విసిరి 20 ఏండ్లయిందని, ఆ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెట్టారు. ఈ 2 దశాబ్దాలలో ఎవరూ ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయారని కూడా వాళ్లు నాతో అన్నారు...
అయితే వాళ్లతో నేను.. రికార్డులన్నాక చెరిపేయడానికి ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారు. ఒకవేళ ఆ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అయితే నేను చాలా హ్యాపీ గా ఫీలవుతాను. కానీ అతడు అందుకోసం తన కెరీర్ లో గాయాలేమీ కాకుండా చూసుకోవాలి. గాయాలు కాకుండా సుదీర్ఘ కాలం క్రికెట్ కు సేవలందించాలి..’ అని తెలిపాడు.
అంతేగాక.. ‘ఉమ్రాన్ ప్రపంచ వేదికలపై తన ప్రతిభ చూపించాలి. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో నిలకడగా గంటకు 150 కి.మీ. కంటే వేగంతో బంతులు విసిరే బౌలర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఉమ్రాన్ మాత్రం నిలకడగా అతడి వేగాన్ని కొనసాగిస్తున్నాడు. నా రికార్డును బద్దలుకొట్టే క్రమంలో అతడు గాయపడకుండా ఉండి సుదీర్ఘ కెరీర్ కొనసాగించాలి..’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు.
ప్రపంచ క్రికెట్ లో అత్యధిక వేగవంతమైన డెలివరీ విసిరింది షోయభ్ అక్తర్. 2002లో అక్తర్.. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 161.3 కిలోమీటర్ల వేగంతో ఓ బంతిని విసిరాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఇదే రికార్డు. ఆ తర్వాత షాన్ టైట్ (న్యూజిలాండ్), బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) లు 160 కి.మీ. వేగంతో బాల్స్ వేశారు. ఇక ఐపీఎల్ లో గంటకు 157.71 కి.మీ. వేగంతో బంతి విసిరిన షాన్ టైట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉమ్రాన్ మాలిక్ (గంటకు 157 కి.మీ) రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవలే ఉమ్రాన్ కూడా స్పందిస్తూ.. తన తర్వాత లక్ష్యం అక్తర్ రికార్డును బ్రేక్ చేయడమే అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.