
పాకిస్తాన్ క్రికెట్‌లో వివాదాలు కొత్తేమీ కాదు. మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్స్, డ్రగ్స్, ఆటగాళ్ల అతి ప్రవర్తన... ఇలా చాలాసార్లు పాక్ క్రికెట్ బోర్డు వార్తల్లో నిలిచింది. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్, ఏకంగా తనకు స్లో పాయిజిన్ ఇచ్చి, చంపేయాలని ప్రయత్నించినట్టు సంచలన వ్యాఖ్యలు చేశాడు...
1999లో పాక్ టీమ్ తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఇమ్రాన్ నజీర్, 8 టెస్టులు, 79 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో 427 పరుగులు చేసిన నజీర్, వన్డేల్లో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 1895 పరుగులు చేశాడు. 25 టీ20 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో 500 పరుగులు చేశాడు..
2009లో ఆఖరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఇమ్రాన్ నజీర్, 2012లో శ్రీలంకపై ఆఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. 2012 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి పూర్తిగా దూరమైన ఇమ్రాన్ నజీర్, 2018 వరకూ పాక్ సూపర్ లీగ్‌లో, అబుదాబీ టీ20 ట్రోఫీ లీగ్‌లలో ఆడాడు...
కెరీర్ ఆరంభంలో మంచి ఓపెనింగ్ బ్యాటర్‌గా అదరగొట్టిన ఇమ్రాన్ నజీర్, ఆ తర్వాత గాయాలతో క్రికెట్‌కి దూరమయ్యాడు. ఒకానొక దశలో తన చేతులు పూర్తిగా వడి తిరిగిపోవడంతో కనీసం చేతి వేళ్లు కూడా వంచలేని దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని తాజాగా బయటపెట్టాడు ఇమ్రాన్ నజీర్...
‘కొద్ది రోజుల క్రితం నాకు చికిత్స జరిగింది. ఎంఆర్‌స్కాన్‌తో పాటు మిగిలిన రిపోర్టుల్లో నాపై విష ప్రయోగం జరిగినట్టు తేలింది. మెర్కూరీ స్లో పాయిజిన్ ఇచ్చారు. ఇది నా కండరాలకు, మణికట్టుకి చేరి, వాటిని పూర్తిగా పనికి రాకుండా చేస్తుంది.. 8-10 ఏళ్లు నా జాయింట్స్ అన్నింటికీ చికిత్స చేయాలి...
నా కీళ్లు మొత్తం పూర్తిగా చెడిపోయాయి. దాదాపు 6- 7 ఏళ్లు ఎంతో బాధను అనుభవించాను. ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను. దేవుడిని క్షమించమని వేడుకోవడం తప్ప ఏమీ చేయాలని స్థితిలో ఉన్నాను. ఇప్పటిదాకా నాకు అండగా నిలిచినందుకు థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నా...
నేను ఏం తిన్నానో ఎప్పుడు తిన్నానో తెలీదు. నన్ను కలిసిన చాలా మంది ‘బాగున్నారా?’ అని అడిగినప్పుడల్లా ఏదో సందేహం నన్ను తొలిచి వేస్తూనే ఉంటుంది. ఈ పాయిజిన్ నా శరీరంంలోకి ఎలా వచ్చింది. నేను నా తెలిసి ఎవ్వరికీ చెడు చేయలేదు. నాకు ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు..
నన్ను ఇలా చేసేకంటే చంపేసి ఉంటే బాగుండేది. నేను సంపాదించుకున్నది మొత్తం నా చికిత్సకే ఖర్చు పెట్టాను. చివరికి చికిత్స కోసం డబ్బులు లేకపోతే షాహీద్ ఆఫ్రిదీ నాకు సాయం చేశాడు. ఆపద సమయంలో ఆదుకున్నాడు. ఆఫ్రిదీని కలిసినప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు..
ఆఫ్రిదీ ‘నీకు ఎంత కావాలో తీసుకోండి, నా బ్రదర్ ఆరోగ్యంగా ఉండాలి..’ అని చెప్పాడు. నా కోసం దాదాపు 40- 50 లక్షలు ఖర్చుపెట్టాడు. నన్ను అడగకుండా మేనేజర్‌తోనే మాట్లాడుతూ నాకు డబ్బులు పంపించాడు.. నా డాక్టర్ కూడా ఎంతో కష్టపడి నన్ను బాగు చేశాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్..