
టీమిండియాకు దొరికిన అతి కొద్ది మంది నాణ్యమైన స్పిన్నర్లలో హర్భజన్ సింగ్ పేరు తప్పకుండా ఉంటుంది. తన అంతర్జాతీయ కెరీర్ లో ఓటమి అంచున ఉన్న భారత్ కు తన స్పిన్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన హర్భజన్ సింగ్.. పాకిస్తాన్ కు బౌలింగ్ వేయమంటే భయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. 2011 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ లు మొహాలీలో రెండో సెమీస్ ఆడాయి. ఆ మ్యాచులో పాక్ బ్యాటర్లకు బౌలింగ్ చేయడానికి ఎంఎస్ ధోని తనను పిలిచినప్పుడు తన చేతులతో పాటు బాడీ కూడా షివరింగ్ అయిందని భజ్జీ చెప్పుకొచ్చాడు.
ఇటీవలే ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న భజ్జీ మాట్లాడుతూ... ‘2011 లో భారత్ పాక్ తో సెమీస్ ఆడింది. మొహాలీలో జరిగిన ఆ మ్యాచులో సెకండ్ స్పెల్ బౌలింగ్ చేయాలని ధోని నాకు బంతినిచ్చాడు. అయితే ఆ సమయంలో నా చేతులు కాస్త వణికాయి. ఒళ్లంతా ఏదో షివరింగ్ అయినట్టు అనిపించింది.
ఎందుకంటే లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ అప్పటికే పటిష్ట స్థితిలో నిలిచింది. నేను బౌలింగ్ కు వచ్చేటప్పటికీ పాక్ 142-4 తో పటిష్టంగా ఉంది. అయితే డ్రింక్స్ సమయంలో ధోని నాకు బంతినిచ్చినప్పుడు నాకు చేతులు వణికాయి. కానీ దానిని సహచర ఆటగాళ్ల ముందు తెలియనీయలేదు. కాస్త భయంతోనే బౌలింగ్ చేసిన నేను తొలి బంతికే వికెట్ తీసుకున్నాను. అప్పుడు నా భయమంతా పోయింది. కొండంత ఆత్మ విశ్వాసం వచ్చింది. ఆ వికెట్ తీయగానే నేను ఎగిరి గంతేశాను. ఇక అనంతరం పూర్తి విశ్వాసంతో బౌలింగ్ చేసి భారత విజయంలో భాగమయ్యాను..’ అని తెలిపాడు.
ఇక మొహాలీ వన్డే విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ (85), వీరేంద్ర సెహ్వాగ్ (38), సురేశ్ రైనా (36) లు రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోరు చేయలేకపోయారు. వహాబ్ రియాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు.
కాగా.. 261 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. జహీర్ ఖాన్, అశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. పాక్ తరఫున మిస్బా ఉల్ హక్ (56) ఒక్కడే రాణించాడు. ఈ మ్యాచులో భజ్జీ... ఉమ్రాన్ అక్మల్ తో పాటు షాహీద్ అఫ్రిది ల వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.