ICC: పాకిస్థాన్ కు బిగ్ డే.. నాలుగు దేశాల టీ20 సిరీస్ పై ఐసీసీ కీలక సమావేశం.. వేచి చూసే ధోరణిలో బీసీసీఐ

Published : Apr 10, 2022, 01:31 PM IST
ICC: పాకిస్థాన్ కు బిగ్ డే..  నాలుగు దేశాల టీ20 సిరీస్ పై ఐసీసీ కీలక సమావేశం.. వేచి చూసే ధోరణిలో బీసీసీఐ

సారాంశం

4 Nation Super Series proposal: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా డ్రీమ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా.. లేక  ఆదిలోనే ముగుస్తుందా..? అనేది  ఆదివారం తేలనుంది. దుబాయ్ లో సమావేశాలు నిర్వహిస్తున్న  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)  నేడు దీనిపై చర్చ జరుపనున్నది. 

పీసీబీ కోట్లాది ఆశలు పెట్టుకున్న నాలుగు దేశాల టీ20 సిరీస్ ప్రతిపాదన భవితవ్యం నేడు తేలనున్నది. గత రెండ్రోజులుగా దుబాయ్ వేదికగా  సమావేశాలు నిర్వహిస్తున్న ఐసీసీ..  ఆదివారం ఈ విషయంపై పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా  ఇవ్వబోయే  పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఆలకించనుంది. ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ లతో ప్రతి ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మాసాలలో టీ 20 సిరీస్ (క్వాడ్రాంగ్యులర్)  నిర్వహించాలని ఈ ఏడాది మొదట్లో రమీజ్ రాజా ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ఆయా బోర్డు అధికారుల (బీసీసీఐతో ఇంకా సమావేశమవలేదు)తో సంప్రదింపులు జరిపిన  రమీజ్ రాజా.. నేడు దీనిపై  ఐసీసీ పాలకమండలిని ఏ మేరకు ఆకట్టుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ టీ20 సిరీస్  నిర్వహణ, తద్వారా వచ్చే లాభాలు తదితర అంశాల గురించి రమీజ్ రాజా.. ఐసీసీకి వివరించనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లు దీనిపై  సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి.  అయితే బీసీసీఐ మాత్రం.. గతంలో ఈ ప్రతిపాదనను పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం న్యూట్రల్ గా ఉండాలని భావిస్తున్నది. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంభించనున్నట్టు సమాచారం. 

ఒకవేళ  రమీజ్ రాజా  తన ప్రతిపాదనతో ఐసీసీని ఒప్పిస్తే అతడు త్వరలోనే  బీసీసీఐ పెద్దలతో కూడా సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది.  ఇదిలాఉండగా.. ఐసీసీ కూడా ఈ ప్రతిపాదనపై సంతృప్తిగానే ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.  అయితే భారత్-పాకిస్తాన్ లు కలిసి ఆడతాయా...? అందుకు భారత ప్రభుత్వం ఒప్పుకుంటుందా..? అన్నదే ఇప్పుడు  సమాధానం దొరకని ప్రశ్న.  రెండు దేశాల మధ్య ఏర్పడిన రాజకీయ, సరిహద్దు వివాదాల కారణంగా  భారత్-పాక్ లు సుమారు దశాబ్దకాలంగా  ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. ఏదో ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ లో మినహా పక్కపక్కనే ఉన్నా రెండు దేశాలు కలిసి ఆడింది లేదు. 

 

ఇక నాలుగు దేశాల సిరీస్ తో  పాటు ఐసీసీ కొత్త చైర్మన్,  మహిళల టెస్టులు, ఆసియా కప్ కు వేదికలు.. వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. మహిళల టెస్టుల సంఖ్యను పెంచాలని చాలా కాలం నుంచి  వాదనలు వినిపిస్తున్నా ఐసీసీ మాత్రం ఈ విషయంలో చూసీ చూడనట్టే వ్యవహరిస్తున్నది.  అయితే  ఇకనుంచి వీటిని పెంచాలని నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. 

 

 ఐసీసీ కి కొత్త చైర్మెన్ ( ప్రస్తుత చైర్మెన్ గ్రెగ్ బార్క్లే పదవీ కాలం నవంబర్ తో ముగియనుంది)  పదవి కోసం  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, జై షా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.  నేటి ఐసీసీ సమావేశం తర్వాత కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశముంది. 
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు