
ఆర్సీబీ అనే పేరులోనే దరిద్రం ఉందో, లేక ఆ టీమ్‌నే బ్యాడ్‌లక్ పట్టి పీడిస్తుందో తెలీదు కానీ అటు ఐపీఎల్‌లో, ఇటు డబ్ల్యూపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుది ఒకే కథ. 15 సీజన్లుగా ఆర్‌సీబీ టైటిల్ గెలవడానికి అష్టకష్టాలు పడుతుంటే, మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఉమెన్స్ ఆర్‌సీబీ... వరుసగా ఐదు పరాజయాలతో లీగ్‌ని ప్రారంభించింది...
స్మృతి మంధాన, ఎలీసా పెర్రీ, సోఫి డివైన్, హేథర్ నైట్, రిచా ఘోష్, రేణుకా ఠాకూర్ సింగ్, మేఘన్ స్కాట్... ఇలా స్టార్ ప్లేయర్లు పుష్కలంగా ఉన్నా... ఉమెన్స్ ఆర్‌సీబీకి తొలి 5 మ్యాచుల్లో ఒక్క విజయం అందించలేకపోయారు. వరుస పరాజయాలతో ఇప్పటికే నాకౌట్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసుకుంది ఆర్‌సీబీ...
గుడ్డి దీపంలా నిమురునిమురమంటున్న అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఉమెన్స్ ఆర్‌సీబీ, యూపీ వారియర్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. యూపీ వారియర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ, రెండో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో లీగ్‌లో మొట్టమొదటి విజయాన్ని చవి చూసింది...
ఈ విజయానికి క్రెడిట్ విరాట్ కోహ్లీ ఖాతాలో వేసేసింది ఆర్‌సీబీ మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన. ‘విరాట్ కోహ్లీ భయ్యా సలహాలు మాకెంతో ఉపయోగపడ్డాయి. వరుస పరాజయాలతో కృంగిపోయిన మమ్మల్ని ఆయన తన మాటలతో స్ఫూర్తినింపారు.. మా టీమ్‌తో చాలాసేపు మాట్లాడారు.. నేను నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు...
పరుగులు చేయలేకపోవడం, మ్యాచులు వరుసగా ఓడిపోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్రమైన మానసిక వేదనను అనుభవించా.. నా క్రికెట్ కెరీర్‌లో ఇలాంటి ఫేజ్ ఎదుర్కోవడం మొదటిసారి. ఇది నన్ను మెంటల్‌గా, ఎమోషనల్‌గా దెబ్బ తీసింది..
జీవితంలో ప్రతీ విషయాన్ని జీర్ణించుకోవడం, వాస్తవాన్ని గ్రహించి నిలబడడం ముఖ్యమని విరాట్ భయ్యా వివరించాడు. ఆ మాటలు నన్ను కాస్త శాంతపరిచాయి...’ అంటూ చెప్పుకొచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ తొలి విజయాన్ని అందుకున్నా ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన డకౌట్ కావడం విశేషం. 3 బంతులు ఆడిన స్మృతి మంధాన, దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది..
21 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన ఆర్‌సీబీ ప్లేయర్ హేథర్ నైట్ కూడా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడింది. ‘ఈ రోజు మధ్యహ్నం విరాట్ కోహ్లీ టీమ్ రూమ్‌కి వచ్చారు. ఆయన ఎంతో ప్రశాంతంగా మాతో మాట్లాడారు. మీరు అడిగిన ప్రతీ చిన్న విషయాన్ని ఓపిగ్గా వివరించారు. విరాట్ మాట్లాడిన మాటలు మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచాయి...’ అంటూ చెప్పుకొచ్చింది హేథర్ నైట్...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో తలబడనుంది. ఆ తర్వాతి ఆఖరి మ్యాచ్‌లో ఇప్పటిదాకా అపజయం ఎరుగని ముంబై ఇండియన్స్‌తో తలబడుతుంది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఆర్‌సీబీ ఈ రెండు మ్యాచుల్లోనూ గెలిచి తీరాల్సిందే..
ప్రస్తుతం ఆర్‌సీబీ, ఒకే ఒక్క విజయంతో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ ఆఖరి ప్లేస్‌లో ఉంది. గుజరాత్‌ని ఆర్‌సీబీ ఓడిస్తే, టాప్ 3లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే టాప్ 3లో ఉన్న యూపీ వారియర్స్, మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు ఓడిపోతే... ఆర్‌సీబీకి అవకాశాలు ఉంటాయి...
టాప్ 3లో ఉన్న మూడు టీమ్స్ ప్లేఆఫ్స్‌కి వెళతాయి. టాప్ 1లో ఉన్న జట్టు, నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడతాయి. అందులో గెలిచిన జట్టు, టాప్‌లో ఉన్న టీమ్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది..