
‘అప్పుడు జరిగింది ముమ్మాటికీ తప్పే. నేను తప్పు చేశాను. నావల్ల నా టీమ్ మేట్ ఇబ్బందికి గురయ్యాడు. అది నాకు సిగ్గుగా అనిపించింది...’ అని పశ్చత్తాప్పడుతున్నాడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. 2008 ఐపీఎల్ సందర్భంగా హర్భజన్.. శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఈ కారణంగా భజ్జీ ఆ సీజన్ మొత్తం నిషేధానికి గురయ్యాడు. అంతేగాక భారత జట్టు కూడా అతడిపై 5 వన్డేల నిషేధం విధించింది. తాజాగా దీనిపై భజ్జీ.. శ్రీశాంత్ సమక్షంలో తన తప్పు ఒప్పుకున్నాడు.
ఓ ఆన్ లైన్ కాన్ఫరెన్స్ లో భజ్జీ, శ్రీశాంత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భజ్జీ మాట్లాడుతూ.. ‘అలా జరిగి ఉండాల్సింది కాదు. నేను తప్పుచేశాను. నావల్ల నా సహచర ఆటగాడు ఇబ్బందికి గురయ్యాడు. దానికి నేను కూడా చాలా సిగ్గుపడ్డాను. నా జీవితంలో ఏదైనా తప్పును సరిదిద్దుకోవాల్సి వస్తే అది కచ్చితంగా ఇదే...
ఆ రోజు ఫీల్డ్ లో నేను శ్రీశాంత్ తో అలా వ్యవహరించి ఉండకూడదు. అసలు ఆ ఘటన జరిగుండకూడదు. దాని గురించి ఆలోచించినప్పుడల్లా నాకు ఏదో వెలితిగా అనిపిస్తుంది. నేను అలా చేసి ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా అని ఫీల్ అవుతాను..’ అని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
2008 లో ఏం జరిగింది...?
2008 లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ - పంజాబ్ కింగ్స్ ఎలెవన్ (ఇప్పుడు పంజాబ్ కింగ్స్) మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీశాంత్ మీద అకారణంగా చేయి వేసుకున్నాడు భజ్జీ. దీంతో మ్యాచ్ అనంతరం అతడు ఏడుస్తూ కనిపించాడు.
2008 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్.. 14 మ్యాచులలో ఏడు మ్యాచులే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఐదో స్థానంలో నిలిచింది. ఇక పంజాబ్.. 14 మ్యాచులకు గాను 10 మ్యాచుల్లో నెగ్గి ప్లేఆఫ్స్ చేరింది. కానీ ఆ సీజన్ లో రాజస్తాన్ కప్ నెగ్గింది.
కాగా, కొద్దికాలానికి భజ్జీ-శ్రీశాంత్ ఇద్దరూ తమ మధ్య ఉన్న విబేధాలు పరిష్కరించుకున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ లో ఈ ఇద్దరూ కలిసి ఆడారు. భజ్జీ, శ్రీశాంత్ లు కొద్దికాలం క్రితమే అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పారు. భజ్జీ ప్రస్తుతం ఆప్ తరఫున రాజ్యసభకు వెళ్లి రాజకీయాల్లో ఉండగా శ్రీశాంత్ సినిమాల్లో ట్రై చేస్తున్నాడు.