
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని సుమారు రెండు నెలలుగా నిరసనకు దిగుతున్న రెజ్లర్లకు తాను మద్దతు ప్రకటించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పష్టం చేశాడు. శుక్రవారం 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ పేరుతో విడుదలైన ప్రకటనకు తనకూ ఏ సంబంధం లేదని.. ఆ స్టేట్మెంట్ లో తాను సంతకం చేయలేదని స్పష్టం చేశాడు.
రెజ్లర్లకు కపిల్ డెవిల్స్ శుక్రవారం మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కుస్తీ యోధులు తమ పతకాలను గంగా, హరిధ్వార్ లో విసిరేస్తామన్న నిర్ణయంపై కాస్త సంయమనం పాటించాలని కోరుతూ 83 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అయితే ఇందులో రోజర్ బిన్నీ కూడా సంతకం చేసి ఉంటారని.. మీడియాలో ఆయన పేరును హైలైట్ చేస్తూ వార్తలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో బిన్నీ వివరణ ఇచ్చారు. ‘కొన్ని మీడియా రిపోర్టులు నేను ప్రకటన విడుదల చేసినట్టుగా కథనాలు రాస్తున్నాయి. ఈ విషయంలో నేను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. నేను రెజ్లర్లకు మద్దతుగా స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు. ఇతరులు చేసిన దానిపై నేను సంతకం కూడా పెట్టలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి సమర్థవంతమైన అధికారులు కృషి చేస్తున్నారని నేను నమ్ముతున్నా. ఒక మాజీ క్రికెటర్ గా క్రీడలను రాజకీయాలతో కలపకూడదని నేను భావిస్తున్నా..’అని తెలిపారు. అయితే బిన్నీకి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వల్లే ఈ ప్రకటన వెలువరించాడని, ఆయన తన పదవి ఎక్కడ పోతుందోననే భయంతోనే ఇలా చేశాడని నెటిజన్లు వాపోతున్నారు.
కాగా శుక్రవారం 83 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ పేరుతో విడుదలైన ప్రకటనలో.. ‘మా ఛాంపియన్ రెజ్లర్లపై వ్యవహరిస్తున్న దృశ్యాలను చూసి మేం బాధపడ్డాం. తీవ్ర కలవరానికి లోనయ్యాం. వారు ఎంతో శ్రమించి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరేయాలని ఆలోచిస్తున్నందుకు మేము ఆందోళన చెందుతున్నాం. ఆ పతకాలు ఎన్నో ఏండ్ల కృషి, ఎన్నో త్యాగాలు, దృఢ సంకల్పం, కఠోర శ్రమతో వచ్చినవి. అవి వారి సొంతం మాత్రమే కాదు. దేశానికి కూడా గర్వకారణం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని మేం వారిని కోరుతున్నాం..’అని ప్రకటనలో పేర్కొన్నారు.
అదే విధంగా వారి ఆవేదనను కూడా ప్రభుత్వం త్వరగా వినాలని 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కోరింది. వారి సమస్యలను పరిష్కరించాలని తాము ఆశిస్తున్నట్టు ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రకటన తర్వాత దీనిపై ఇకనైనా టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు ఇతర ఫేమస్ క్రికెటర్లు స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు.