బుద్దొచ్చింది.. ఇకనుంచి క్రీజ్ దాటను..: లార్డ్స్ వన్డేలో రనౌట్‌పై స్పందించిన చార్లీ డీన్

By Srinivas MFirst Published Sep 27, 2022, 2:36 PM IST
Highlights

Deepti Sharma Run Out Row: దీప్తి శర్మ ‘రనౌట్’ బాధితురాలిగా ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్ ఈ వ్యవహారంపై తన ఇన్స్టా ఖాతాలో స్పందించింది. ఇకనుంచైనా  బుద్దిగా ఉంటానని.. 
 

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య  ఇటీవలే ముగిసిన మూడో వన్డేలో  ఆతిథ్య జట్టును గెలుపుటంచుల దాకా చేర్చిన  ఆ జట్టు ప్లేయర్ చార్లీ డీన్ ను టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ ‘రనౌట్’తో దెబ్బకొట్టింది. ఈ రనౌట్ వ్యవహారంపై గత మూడు రోజులుగా చర్చ నడుస్తున్నది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఇంగ్లాండ్ సన్నాయి నొక్కులు నొక్కుతుండగా.. ‘చట్టాల్లో ఉన్నదే మేం చేశాం..’అని టీమిండియా సమర్థించుకుంటున్నది. ఈ నేపథ్యంలో  రనౌట్ బాధితురాలు చార్లీ డీన్ తొలిసారిగా స్పందించింది. 

తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో ఇండియా-ఇంగ్లాండ్ మూడో వన్డేకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ఈ వేసవి ఆసక్తికరంగా ముగిసింది. లార్డ్స్ లో ఇంగ్లాండ్ కు ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరవం.  ఇకనుంచైనా నేను క్రీజ్ లోనే ఉండేందుకు ప్రయత్నిస్తా..’ అని రాసుకొచ్చింది.  

ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 170 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  అప్పటికే టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో  చివరి వరుస బ్యాటర్లతో డీన్  (80 బంతుల్లో 47, 5 ఫోర్లు) ఇంగ్లాండ్ ను విజయానికి  చేరువ చేసింది. 44వ ఓవర్ ను వేయాల్సిందిగా హర్మన్‌ప్రీత్ కౌర్.. దీప్తి శర్మకు బంతినిచ్చింది. ఆ ఓవర్ల మూడో బంతిని వేయబోయిన దీప్తి.. డీన్  నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి చాలా ముందుకు జరగడాన్ని గ్రహించింది. దీంతో వెంటనే బంతిని విసరడం ఆపి   వికెట్లను గిరాటేసింది. అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశారు. రివ్యూలో దీప్తి.. బౌలింగ్ యాక్షన్ ను పూర్తి చేసిన తర్వాతే వికెట్లను పడగొట్టినట్టు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించాడు.   

 

ఇదే విషయమై దీప్తి శర్మ కూడా  సోమవారం స్పందించిన విషయం తెలిసిందే.  అది (రనౌట్) తమ ప్రణాళికలో భాగమేనని.. అప్పటికే చార్లీని రెండు సార్లు హెచ్చరించినా ఆమె వినకపోవడంతోనే తాము అలా చేశామని  తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇది మా ప్లాన్ లో ఓ భాగమే. ఎందుకంటే ఆమె (చార్లీ) అప్పటికే రెండు సార్లు క్రీజు దాటి ముందుకు వెళ్లింది. అదే విషయమై మేము అంపైర్ కు కూడా ఫిర్యాదు చేశాం.  కానీ ఆమె మళ్లీ అదే చేసింది. మేము నిబంధనల ప్రకారమే ఇలా చేశాం..’ అని చెప్పుకొచ్చింది. 

 

. opens up on the Charlotte Dean run out, says had already warned her!
pic.twitter.com/3YwWwvZ1e4

— RevSportz (@RevSportz)

దీప్తికి టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ అండగా నిలిచింది. ‘మ్యాచ్ లో  మేం చేసిందేమీ నేరం కాదు. అది ఆటలో భాగం. ఐసీసీ నిబంధన కూడా ఉంది. వాస్తవానికి  దీప్తి చేసిన ఆ రనౌట్ గురించి నేను గర్విస్తున్నా. అంత ఉత్కంఠ సమయంలో కూడా  నాన్ స్ట్రైకర్ ఎండ్ వద్ద ఓ బ్యాటర్ క్రీజ్ దాటుతున్నారని చూడటానికి ఆటపై చాలా అవగాహన ఉండాలి.  అందులో తప్పేమీ లేదుకదా..’ అని తెలిపింది. 

click me!