టికెట్లున్నా సీట్లు లేవు.. ఉప్పల్‌లో తిప్పలకు కారణమెవరు..? తప్పెవరిది.. పాపమెవరికి..?

By Srinivas MFirst Published Sep 27, 2022, 1:45 PM IST
Highlights

IND vs AUS 3rd T20I: ఇండియా--ఆస్ట్రేలియా మధ్య  ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.  అయితే మ్యాచ్ నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మూడేండ్ల తర్వాత భాగ్యనగరంలో  నిర్వహించిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్.. ఉప్పల్‌లో రెండ్రోజుల క్రితం ‘ఘనంగా’ ముగిసింది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. కానీ మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఈ మ్యాచ్ టికెట్ల వ్యవహారం నుంచి  ఆట ముగిసి రోహిత్ శర్మ పాత్రికేయుల సమావేశం దాకా హెచ్‌సీఏ అనుకరించిన వైఖరి వివాదాస్పదమైంది. ఆన్‌లైన్‌లో వేలకు వేలు పోసి  టికెట్లు కొన్న ప్రేక్షకులు తీరా స్టేడియానికి వెళ్లి సీట్లలో కూర్చుందామంటే  ‘ఈ కుర్చీ నీది కాదు. నీ టికెట్ మీద సీట్ నెంబర్ రాసి ఉందా.  ఇక్కడ్నుంచి వెళ్లు..’ అని అభిమానులను వెళ్లగొట్టిన ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. 

ఈ మ్యాచ్‌ కోసం  టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ప్రముఖ యాప్ ‘పేటీఎమ్ ఇన్‌సైడర్’తో  హెచ్‌సీఏ ఒప్పందం కుదుర్చుకుంది.  నగరానికి చెందిన ఓ క్రికెట్ అభిమాని.. తన స్నేహితులతో కలిసి మ్యాచ్ చూసేందుకు గాను నాలుగు వీఐపీ టికెట్లను (ఒక్కో టికెట్ ధర రూ. 9 వేలు) బుక్ చేశాడు. జింఖానాలో తోపులాటలు,  పోలీసులు లాఠీ దెబ్బలు వంటి నానా తంటాలు పడి టికెట్ (ఫిజికల్ టికెట్) సంపాదించాడు. 

అయితే జింఖానాలో జారీ చేసిన టికెట్ మీద సీట్ నెంబర్ లేదు. నార్త్ ఈస్ట్ పెవిలియన్ ఎండ్ వద్ద సదరు వ్యక్తికి టికెట్ బుక్ అయింది. అయితే సీట్ నెంబర్ గురించి అంతగా అవగాహన లేని ఆ నలుగురు..   ఆదివారం  ట్రాఫిక్ తిప్పలను దాటుకుని ఉప్పల్ కు వెళ్లారు. సెక్యూరిటీ వద్ద  క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో లోపలికి వెళ్లారు. వెళ్లి సీట్లలో అలా కూర్చోన్నారో లేదో అదే సీట్ల వద్దకు మరో నలుగురు  వచ్చి ‘ఇవి మావి కదా.. సీట్ నెంబర్లు కూడా ఉన్నాయి. మీరెలా కూర్చుంటారు..’ అనడంతో చేసేదేమీ లేక.. ఇంటికి వెళ్లడానికి మనసొప్పక నిల్చుండే మ్యాచ్ ను  చూశారు.  

లోపమెక్కడ..? 

ఇది ఒక్క నలుగురు అభిమానుల వేదనే కాదు. ఉప్పల్ లో చాలా మంది పరిస్థితి ఇదే విధంగా ఉందని తెలుస్తున్నది. మరి ఈ వ్యవహారంలో తప్పెవరిది..? పేటీఎం ఇన్‌సైడర్.. టికెట్ల మీద సీట్ నెంబర్ల మీద ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. 150 రూపాయలు పెట్టి  సినిమా చూస్తేనే  అది ఏ వరుస, ఎన్నో సీట్ నెంబర్ అని  లెక్కా పత్రం ఉంటాయి. అలాంటిది వేలకు వేలు పోసి కొన్న టికెట్ల మీద సీట్ నెంబర్లు ఎందుకు లేవు..? ఈ లోపంలో పాపాలు ఎవరివి..?  సదరు యాప్ తో హెచ్‌సీఏ కుమ్మక్కయిందా..? అలా కాకుంటే యాప్ లో బుక్ చేసుకున్న టికెట్ల సంగతి తెలిసి కూడా ఇతరులకు సీట్లను ఎలా కేటాయించింది..?  ఇవన్నీ సమాధానం తేలని ప్రశ్నలు. 

రేట్లు డబుల్.. సమస్యలు కామన్..  

ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి మ్యాచ్ చూసే వారికి టికెట్ల ధర రూ. 1,500 (ఒక్కో టికెట్ కు) గా ఉంది. నార్త్ పెవిలియన్, నార్త్ ఈస్ట్ పెవిలియన్, సౌత్ ఈస్ట్ పెవిలియన్ స్టాండ్స్ వద్ద ఒక్కో టికెట్ ధరలు వరుసగా రూ. 7,500గా ఉన్నాయి. కానీ  ఫస్ట్ ఫ్లోర్ టికెట్ ధరలు (రూ. 1,500)  ఆన్ లైన్ బ్లాక్ మార్కెట్ లో ఏకంగా రూ.  10వేల వరకు, నార్త్ పెవిలియన్ ధరలు రూ. 15 వేల నుంచి రూ. 30 వేల దాకా అమ్మినట్టు సమాచారం. ఇంత పెట్టి స్టేడియానికి వెళ్లినా తిప్పలు తప్పలేదు.

రాజకీయ పార్టీ నాయకులకు అప్పనంగా టికెట్లు 

జింఖానాలో  టికెట్ల కోసం ప్రేక్షకులు ఓ చిన్నపాటి యుద్ధమే చేశారు.మూడేండ్ల తర్వాత ఉప్పల్ లో మ్యాచ్ జరుగుతుండటంతో  అభిమానులంతా.. తమ అభిమాన క్రికెటర్లను చూడాలని ప్రాణాలకు తెగించి మరీ  టికెట్లను  సొంతం చేసుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. జింఖానాలో టికెట్ల తొక్కిసలాట కామనే అన్న  హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్..  వివిధ రాజకీయ పార్టీలకు చెందిన చోటా మోటా నాయకులకు కూడా అప్పనంగా టికెట్లను పంపించారని  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు ఆరు వేల  టికెట్లను కాంప్లిమెంటరీ పాస్ ల కింద క్లబ్ లకు, చోటా మోటా రాజకీయ నాయకులకు పంపిణీ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

అజార్ 'మందు విందు'.. 

రోమ్ నగరం కాలిపోతుంటే ఆ రాజ్యాధినేత ఫిడేల్ వాయించినట్టుగా ఉంది హెచ్‌సీఏ అధ్యక్షుడు  మహ్మద్ అజారుద్దీన్ వైఖరి. టికెట్ల కోసం పది రోజులుగా అభిమానులు ఆన్‌లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా తిప్పలు పడుతున్నా.. జింఖానాలో తొక్కిసలాట జరిగినా పట్టించుకోని ఆయన సరిగ్గా ఉప్పల్ మ్యాచ్ కు ముందు.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో హెచ్‌సీఏ క్లబ్ మెంబర్స్‌‌కు ‘మందు పార్టీ’ ఇచ్చాడు. ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికలలో కూడా మళ్లీ అధ్యక్ష పీఠమెక్కడానికి  ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందులో భాగంగానే  హెచ్‌సీఏ కార్యదర్శులకు  ఏకంగా రూ. 30 లక్షలు ఖర్చు చేసి మందు పార్టీ ఏర్పాటు చేశాడు.ఆహ్వన పత్రికలు పంపి మరీ  మందు పార్టీకి రావాలని క్లబ్ మెంబర్స్ ను కోరాడు.

హెచ్‌సీఏ ను భ్రష్టు పట్టించాడని ఇప్పటికే అజార్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆయన  క్లబ్ మెంబర్స్ ను బుట్టలో వేసుకోవడానికి మళ్లీ తాయిలాలకు తెరలేపారు. టికెట్ల వ్యవహారంలో కూడా అజార్ పాత్ర సుస్పష్టమనేది తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.  

click me!