నేను ఇక క్రికెట్ ఆడలేనేమో : ఆర్సీబీతో పాటు ఆస్ట్రేలియాకు షాకిచ్చిన ఆల్ రౌండర్

By Srinivas MFirst Published Jan 13, 2023, 4:31 PM IST
Highlights

BBL: గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత  మ్యాక్స్‌వెల్ తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి  అక్కడ గాయపడ్డాడు.  ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ కు రెండు నెలల క్రితం  కాలికి దెబ్బ తాకడంతో  అతడు ఆస్పత్రి పాలయ్యాడు. తాజాగా అతడు తన సోషల్ మీడియా ఖాతాల  వేదికగా షేర్ చేసిన వీడియోలో  షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తాను ఇక క్రికెట్ ఆడలేనేమో అని అనుకున్నానని, ఈ రెండు నెలలు చాలా భారంగా గడిచాయని  తెలిపాడు. 

బిగ్ బాష్ లీగ్ లో భాగంగా  రెండ్రోజుల క్రితం అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య ముగిసిన  మ్యాచ్ లో తన సహచర ఆటగాడు బ్రాడ్ హడిన్ తో కలిసి  కామెంట్రీ చెప్పడానికి వచ్చిన  మ్యాక్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ.. ‘నా కాలుకు దెబ్బ తాకి నేను  సుమారు పది రోజుల పాటు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది.  మొదటి  వారం రోజుల పాటైతే నాకు చాలా కష్టంగా అనిపించింది.  గాయంతో నా కాలు  బెలూన్ లా ఉబ్బింది.  అప్పుడు నేను ఇక క్రికెట్ ఆడలేనేమో.. అని భావించా.  కానీ తర్వాత వారం  ఇంటికెళ్లా. కానీ అక్కడ నాకు సేవ చేయడానికి నర్సులు గానీ  ఇతర సిబ్బంది గానీ ఎవరూ లేరు. అయితే  అప్పుడు నా కాలు చాలా నొప్పిగా ఉండేది. అప్పుడు నేను నరకం అనుభవించా. నా లైఫ్ లో   అంత నొప్పిని ఎప్పుడూ భరించలేదు...’అని చెప్పుకొచ్చాడు. 

గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత  మ్యాక్స్‌వెల్ తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి  అక్కడ గాయపడ్డాడు.  ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మెల్‌బోర్న్ స్టార్స్   కూడా ట్విటర్ లో   అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మ్యాచ్ చూస్తున్నప్పటి వీడియోను షేర్ చేసింది.  

కాగా ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని, ఎవరి సహాయం లేకుండా నడవగలుగుతున్నానని  మ్యాక్సీ చెప్పాడు. తాను కోలుకోవడానికి చాలా నిద్రలేని రాత్రులు గడిపానని, రాత్రిళ్లు తన పాదాల చుట్టూ నొప్పిని భరించేందుకు ఐస్ బ్యాగ్స్ పెట్టుకుని పడుకునేవాడినని వివరించాడు. ప్రస్తుతానికి తాను  షూ కూడా వేసుకోగలుగుతున్నానని, త్వరలోనే మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెడతానని చెప్పాడు.  ఇదిలాఉండగా  మ్యాక్స్వెల్ త్వరలో భారత్ తో జరుగబోయే వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి.  

 

. following our WBBL win from his hospital bed! 💚 pic.twitter.com/EICCLhZtBM

— Melbourne Stars (@StarsBBL)

భారత్ తో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు గాను ఆస్ట్రేలియా క్రికెట్  జట్టు ఫిబ్రవరి లో ఇండియాకు రానుంది.  ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకూ ఈ  పర్యటన సాగుతోంది. 2004 తర్వాత భారత్ లో టెస్టు సిరీస్ గెలవని ఆసీస్.. ఈసారి ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తున్నది. 

click me!