రవీంద్ర జడేజా తో కాలేదు.. మరి ధోని వారసుడెవరు..? వీరూ సమాధానమిదే..

By Srinivas MFirst Published May 14, 2022, 2:46 PM IST
Highlights

Virender Sehwag About Ruturaj Gaikwad: ఐపీఎల్ లో మరే జట్టుకు లేనంత ఘనత సంపాదించుకున్న చెన్నై సూపర్ కింగ్స్  కు తదుపరి సారథి ఎవరు..?  ఎన్నో ఆశలు పెట్టుకున్న జడేజా విఫలం కావడంతో ధోని  లేని లోటును పూడ్చేదెవరు..? క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. 

ఐపీఎల్ లో నాలుగు సార్లు ఛాంపియన్, ఐదు సార్లు  రన్నరప్, రెండు మినహా మిగతా సీజన్లలో ప్లేఆఫ్స్ కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్  కు ఇప్పుడు మునుపెన్నడూ లేని కష్టం వచ్చింది. ఈ సీజన్ తో ధోని దాదాపు  సారథ్య బాధ్యతల నుంచే గాక మొత్తం ఐపీఎల్ కే గుడ్ బై చెప్పే తరుణం వచ్చింది.  ధోని ఎంతో నమ్మకంతో  తన వారసుడిగా ప్రకటించిన రవీంద్ర జడేజా.. తన వల్ల కాదని  మధ్యలోనే కాడి వదిలేయడంతో తిరిగి ధోనినే వాటిని మోస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ నుంచి దూరమైన సీఎస్కేకు ఇప్పుడు దాని కంటే అతి పెద్ద బాధ తమ తర్వాత  కెప్టెన్ ఎవరు..?  ఈ ప్రశ్నకు  భారత మాజీ  ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సమాధానమిచ్చాడు. 

ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో వీరూ మాట్లాడుతూ.. సీఎస్కే తదుపరి సారథి గా ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పేరును ప్రతిపాదించాడు. ధోని లాగే  రుతురాజ్ కూడా  కామ్ గా ఉంటాడని, మహేంద్రుడిలోని చాలా క్వాలిటీలు గైక్వాడ్ కూ ఉన్నాయని వీరూ అభిప్రాయపడ్డాడు. 

సెహ్వాగ్ స్పందిస్తూ... ‘ధోని వారసుడిగా రుతురాజ్ సరైనోడు.  అతడు మహారాష్ట్ర కు సారథిగా వ్యవహరిస్తున్నాడు.  ధోని వలే రుతురాజ్ కూడా  ఎప్పుడూ కూల్ గా ఉంటాడు. సెంచరీ చేసినప్పుడో లేదా వికెట్ తీసినప్పుడో అతడు.. అరిచి సంబురాలు చేసుకునే టైప్ కాదు. వంద కొట్టినా, జీరోకు ఔటైనా అతడి ముఖంలో  ఎక్స్ప్రెషన్స్ మారవు. ధోని  లో కూడా అంతేకదా.  ఒక కెప్టెన్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ రుతురాజ్ లో ఉన్నాయి...’ అని అన్నాడు. 

అంతేగాక.. ‘ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడికి కెప్టెన్ గా చేసిన అనుభవముంది.  గేమ్ ను కంట్రోల్ చేయగల సత్తా రుతురాజ్ లో ఉంది. చెన్నై తరఫున మరో 3-4 సీజన్లు ఆడితే అతడు ఆ జట్టుకు ధోని తర్వాత  చాలా కాలం పాటు సారథిగా కొనసాగుతాడు. ధోనిని అందరూ గొప్ప కెప్టెన్ గా ఎందుకు కీర్తిస్తారు..? అతడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతడెప్పుడూ  సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. అయితే ఆ నిర్ణయాలు తీసుకునే క్రమంలో అతడికి అదృష్టం కూడా కలిసొస్తుంది. నా అభిప్రాయం  ప్రకారం.. రుతురాజ్ కు ధోనికి ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి.  మరి గైక్వాడ్ కు కూడా ధోని కి ఉన్న   అదృష్టం ఉన్నదా..? అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు.  అయితే ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలే. ధోని తర్వాత అతడి వారసుడెవరన్నది  నిర్ణయించాల్సింది సీఎస్కే యాజమాన్యం..’ అని తెలిపాడు. 

గతేడాది  అత్యద్భుత ఫామ్ లో అత్యధిక పరుగులు సాధించి ఏకంగా ఆరెంజ్ క్యాప్ ఎగురేసుకుపోయిన గైక్వాడ్.. ఈ సీజన్ లో  మాత్రం చతికిలపడుతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్ లో  12 మ్యాచులాడి 313 పరుగులు చేశాడు. అందులో 99 హయ్యస్ట్ స్కోరు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఒక్క పరుగుతో సెంచరీ మిస్ అయ్యాడు. 

click me!