
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అదిరిపోయే సలహా ఇచ్చాడు. ఫామ్ శాశ్వతం కాదని, క్లాస్ మాత్రమే ఆటగాడి ప్రతిభకు కొలమానమని చెప్పిన వార్నర్ భాయ్.. అతడు మరో ఇద్దరు పిల్లల్ని కలిగి ఉండాలని సూచించాడు. వారి నుంచి అనంతమైన ప్రేమను పొందాలని, తద్వారా ఫామ్ దానంతట అదే వస్తుందని ఫన్నీగా సూచించాడు. స్పోర్ట్స్ యారి కి వ్యవస్థాపకుడు సుశాంత్ మెహతా తో ఇంటర్వ్యూ సందర్భంగా వార్నర్.. కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ లో కోహ్లి ఫామ్ పై వస్తున్న విమర్శలపై మీ స్పందనేమిటి..? అతడికి మీరు ఏమైనా సూచనలిస్తారా..? అన్న ప్రశ్నకు వార్నర్ మాట్లాడుతూ.. ‘ఏమీ లేదు. మరో ఇద్దరు పిల్లల్ని కలిగి ఉండి.. వారి ప్రేమను ఆస్వాదించండి..’ అని ఫన్నీగా సమాధానమిచ్చాడు.
అంతేగాక వార్నర్ స్పందిస్తూ.. ‘ఫామ్ అనేది టెంపరరీ క్లాస్ ఎప్పటికీ శాశ్వతం. మనం దానిని కోల్పోకూడదు. ప్రపంచంలోని ఏ ఆటగాడికైనా తమ కెరీర్ లో ఇలాంటి ఒక దశ ఎదురవుతుంది. మీరు ఎంత గొప్ప ఆటగాడైనా కావొచ్చు.. ఈ దశను దాటాల్సిందే. ఈ ఎత్తు పల్లాలు చూడాల్సిందే. అయితే మీరు ఎక్కిన మెట్లను మళ్లీ రావడానికి మీరు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కోహ్లి బేసిక్స్ కు కట్టుబడి ఉంటే చాలు. ఫామ్ అనేది పెద్ద విషయం కాదు..’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విరాట్-అనుష్కల కు గతేడాది వామిక పుట్టింది. ఇటీవలే వామిక మొదటి పుట్టినరోజును కూడా జరుపుకుంది. ఇక వార్నర్-కాండీస్ లకు ముగ్గురు ఆడపిల్లలే. పిల్లలంటే వార్నర్ కు చాలా ఇష్టం. తాను చేసే టిక్ టాక్ వీడియోలలో ఎక్కువ భాగం తన పిల్లలతోనే చేస్తుంటాడు వార్నర్. మ్యాచులు లేకుంటే వార్నర్ కు తన కూతుళ్లతోనే టైమ్ పాస్.
ఐపీఎల్ 2022లో పది మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లి.. రెండు గోల్డెన్ డక్ లతో సహా 186 పరుగుల చేశాడు. ఇటీవలే ఆర్సీబీ ఆడిన ఆఖరి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై హాఫ్ సెంచరీతో మెరిశాడు. బుధవారం ఆర్సీబీ.. చెన్నై సూపర్ కింగ్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లి ఎలా ఆడతాడనేదానిపై అందరి కళ్లూ ఉన్నాయి.
ఇదిలాఉండగా వరుసగా విఫలమవుతున్న కోహ్లికి తన మాజీ సహచర ఆటగాడు (ఆర్సీబీలో) మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కీలక సలహాలు ఇచ్చాడు. ఒక బ్యాటర్ గా కోహ్లి చెత్త ఫామ్ నుంచి మరో ఒకటి లేదంటే రెండు మ్యాచుల దూరంలోనే ఉన్నాడని అన్నాడు. రాత్రికి రాత్రే కోహ్లి చెత్త ఆటగాడు అయిపోడని, అతడి ప్రతిభ ను ప్రస్తుత ఫామ్ తో పోల్చలేమని చెప్పాడు. కోహ్లి మైండ్ లోకి దిగేప్పుడు ఫ్రెష్ మైండ్ తో బ్యాటింగ్ చేయాలని సూచించాడు.