T20 World Cup: టీమిండియాతో చేరనున్న హర్షల్, వెంకటేష్ అయ్యర్, అవేశ్ ఖాన్.. నేడో రేపో బీసీసీఐ నిర్ణయం

By team teluguFirst Published Oct 12, 2021, 6:05 PM IST
Highlights

IPL2021: ఐపీఎల్ లో అదరగొడుతున్న యువ ఆటగాళ్లకు లక్కీ ఛాన్స్ దక్కింది. ఇప్పటికే సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రన్ మాలిక్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టుకు నెట్ బౌలర్ గా ఎంపిక కాగా  తాజాగా మరో ముగ్గురిని కూడా ఎంపికచేసినట్లు సమాచారం. 

ఐపీఎల్ లో వివిధ జట్ల తరఫున అద్భుత ఆటతీరు ప్రదర్శిస్తున్న ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ఒకవేళ ఐపీఎల్ ముగిసినా బయో బబుల్ దాటి వెళ్లొద్దని, ఏ క్షణమైనా టీమిండియాతో జాయిన్ కావాల్సి ఉంటుందని వారికి చెప్పినట్లు తెలుస్తున్నది. ఈనెల 17 నుంచి యూఏఈలో మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్ లో భారత్ తరఫున సపోర్టింగ్ ప్లేయర్ల కింద మరో నలుగురిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. 

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన ఉమ్రన్ మాలిక్ ఇప్పటికే టీమిండియా నెట్ బౌలర్ గా ఎంపికయ్యాడు. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ఈ స్పీడ్ స్టార్ త్వరలోనే భారత జట్టు బయోబబుల్ లో ఎంటర్ అవబోతున్నాడు. తాజాగా ఉమ్రన్ తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా  టీమిండియా బయో బబుల్ లోకి వచ్చే  అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: ఉమ్రన్ మాలిక్ కు బంపరాఫర్.. టీమిండియాకు ఎంపిక..!

ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ ముందంజలో ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో పర్పుల్ క్యాప్ బౌలర్ గా ఉన్న హర్షల్.. 32 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అతడితో పాటు ఐపీఎల్ 14లో అత్యధిక వికెట్లు తీసినవారిలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అవేశ్ ఖాన్ కూడా టీమిండియా నెట్ బౌలర్ గా రానున్నట్టు సమాచారం. 

వీరి తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ వెంకటేష్ అయ్యర్ కూడా భారత జట్టుతో చేరనున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఈ సీజన్ లో కోల్కతా తరఫున మెరుపు ఇన్నింగ్స్ లు ఆడిన అయ్యర్ కూడా సపోర్ట్ ప్లేయర్ గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

ఇదిలాఉండగా.. టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మార్పులపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యా.. టోర్నీలో బౌలింగ వేసేది లేనిది ఇప్పటికీ బోర్డు తేల్చడం లేదు. అయితే తుది జట్టును ఐసీసీకి అందజేయడానికి బీసీసీఐకి ఈనెల 15 దాకా అవకాశముంది. అదే రోజు మార్పులు, చేర్పులేమైనా ఉంటే బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. 

click me!