జులన్ గోస్వామికి అరుదైన గౌరవం ఇచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్... కన్నీళ్లు పెట్టుకున్న టీమిండియా కెప్టెన్...

By Chinthakindhi RamuFirst Published Sep 24, 2022, 4:29 PM IST
Highlights

లార్డ్స్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న జులన్ గోస్వామి... ఎమోషనల్ అయిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, టీమ్ సభ్యులు... 

భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి వన్డే జులన్ గోస్వామికి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న జులన్ గోస్వామికి అరుదైన గౌరవం కల్పించింది భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్...

ఇంగ్లాండ్‌తో మూడో వన్డే ఆరంభానికి ముందు టాస్ సమయంలో తనతో పాటు జులన్ గోస్వామిని వెంట తీసుకెళ్లిన హర్మన్‌ప్రీత్ కౌర్, ఆమెనే టాస్ చెప్పాల్సిందిగా కోరింది. అయితే జులన్ గోస్వామి టాస్ ఓడిపోవడం, భారత జట్టు బ్యాటింగ్‌కి దిగడం జరిగిపోయాయి. అయితే ఇప్పటికే మొదటి వన్డేల్లో గెలిచిన భారత జట్టు, 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది...

దీంతో ఆఖరి వన్డే కేవలం నామమాత్రపు వన్డేగానే మారింది. అయితే జులన్ గోస్వామికి ఇది చివరి మ్యాచ్ కావడంలో ఎలాగైనా నేటి మ్యాచ్‌లో గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది టీమిండియా. మ్యాచ్ ఆరంభానికి ముందు జులన్ గోస్వామికి ప్రత్యేక జ్ఞాపికను అందించింది భారత క్రికెట్ బోర్డు..

Harmanpreet Kaur in tears for Jhulan Goswami's last match | pic.twitter.com/I8no7MhBSq

— Jhulan GOATswami (@Alyssa_Healy77)

టీమ్ మీటింగ్ సమయంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్లు తమతో కలిసి ఆడి, మార్గనిర్దేశం చేసిన జులన్ గోస్వామి... ఇకపై తమతో ఆడదనే విషయాన్ని తట్టుకోలేక కెప్టెన్‌తో పాటు భారత మహిళా జట్టులోని చాలా ప్లేయర్లు ఎమోషనల్ అయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ని కౌగిలించుకుని ఓదార్చింది జులన్ గోస్వామి...


టీమిండియా తరుపున 12 టెస్టులు, 203 వన్డేలు, 68 టీ20 మ్యాచులు ఆడిన జులన్ గోస్వామి... ఓవరాల్‌గా 353 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. అంతర్జాతయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్‌గా ఉన్న జులన్ గోస్వామి, వన్డేల్లో 250+ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్, ప్రస్తుతానికి ఏకైక బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది...

వుమెన్స్ వరల్డ్ కప్ టోర్నీల్లో 43 వికెట్లు తీసిన జులన్ గోస్వామి, తన అంతర్జాతీయ కెరీర్‌లో 2260+ఓవర్లు బౌలింగ్ చేసి అత్యధిక బంతులు వేసిన మహిళా బౌలర్‌గానూ నిలిచింది.. 20 ఏళ్ల 261 రోజుల పాటు వన్డేల్లో కొనసాగుతూ వస్తున్న జులన్ గోస్వామి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తర్వాత అత్యధిక కాలం ఈ ఫార్మాట్‌లో కొనసాగిన మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. 

జులన్ గోస్వామి స్నేహితురాలు, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలకగా 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద మొట్టమొదటి వన్డే సిరీస్ గెలిచిన ఈ వెటరన్ బౌలర్‌కి ఘనమైన వీడ్కోలు ఇచ్చింది భారత మహిళా క్రికెట్ టీమ్.

click me!