IND vs AUS: మోత మోగిన మొహాలీ.. దంచికొట్టిన టీమిండియా.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం

By Srinivas MFirst Published Sep 20, 2022, 8:47 PM IST
Highlights

IND vs AUS T20I: భారత్ లో టీ20 అంటేనే రెచ్చిపోయి ఆడే టీమిండియా ఆటగాళ్లు మరోసారి అదే తరహా ప్రదర్శనతో రెచ్చిపోయారు.  ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో మోత మోగించారు.  
 

భారత క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 మజాను పంచుతూ  టీమిండియా బ్యాటర్లు మొహాలీలో సిక్సర్లు, ఫోర్లతో స్టేడియంలో మోత మోగించారు. ఓపెనర్ కెఎల్ రాహుల్ (35 బంతుల్లో 55, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తనకు అచ్చొచ్చిన మొహాలీ స్టేడియంలో రెచ్చిపోయి ఆడగా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 46, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తనదైన ఆటతో అలరించాడు. ఈ ఇద్దరికీ తోడు  ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చివర్లో వీర విహారం చేయడంతో నిర్ణీత  20 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలవాలంటే 120 బంతుల్లో 209 పరుగులు చేయాల్సి ఉంది. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్ కు శుభారంభం దక్కలేదు. పాట్ కమిన్స్ వేసిన  ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ కొట్టిన  రోహత్.. అదే ఊపులో మరో భారీ షాట్ ఆడాడు. జోష్ హెజిల్వుడ్ వేసిన  మూడో ఓవర్ నాలుగో బంతి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాలని చూశాడు. కానీ బంతి నేరుగా వెళ్లి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ ఎల్లిస్ చేతుల్లో పడింది. 

హిట్ మ్యాన్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా రోహిత్ నే అనుసరించాడు. 7 బంతుల్లో 2 పరుగులు చేసిన  కోహ్లీ..  నాథన్ ఎల్లిస్ వేసిన  ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో కామెరూన్ గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

కానీ అప్పటికే క్రీజులో కుదురుకున్న  కెఎల్ రాహుల్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ లు భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. ఇద్దరూ కలిసి ఫోర్లు, సిక్సర్లతో మొహాలీ లో మోత మోగించారు. క్రీజులోకి వస్తూనే కమిన్స్ వేసిన  ఆరో ఓవర్లో  4,6 తో పరుగుల వేట మొదలుపెట్టాడు సూర్య. మరోవైపు రాహుల్ కూడా ఎక్కడా తగ్గలేదు. గ్రీన్ వేసిన  8వ ఓవర్లో 6,4 తో స్కోరు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలోనే రాహుల్.. పదకొండో ఓవర్లో ఆఖరు బంతికి సింగిల్ తీసి 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ 

హెజిల్వుడ్ వేసిన  12వ ఓవర్లో సూర్య సిక్సర్ కొట్టి రాహుల్ కు స్ట్రైక్ ఇచ్చాడు.   నాలుగో బంతికి ఫోర్ కొట్టిన రాహుల్.. ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి  ఔట్ అయ్యాడు. దీంతో 68 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ నిష్క్రమించినా సూర్య ప్రతాపం ఆగలేదు. ఆడమ్ జంపా వేసిన 13వ ఓవర్లో సూర్య బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదాడు. హాఫ్ సెంచరీ దిశగా కదులుతున్న సూర్యను కామెరూన్ గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. 

రాహుల్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యాకూడా ధాటిగానే ఆడటంతో టీమిండియా స్కోరు బ్రేకుల్లేకుండా దూసుకుపోయింది. సూర్య ఔటయ్యాక వచ్చిన అక్షర్ పటేల్ (6) నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో గ్రీన్ కు క్యాచ్ ఇచ్చాడు. ఫినిషర్ గా వచ్చిన దినేశ్ కార్తీక్ (6) కూడా ఎల్బీగా వెనుదిరిగాడు. 

కానీ పాండ్యా మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.  కమిన్స్ వేసిన  18వ ఓవర్లో 6, 4 కొట్టిన అతడు.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో రెండు బౌండరీలు బాదాడు. 19వ ఓవర్లో ఫోర్ ద్వారా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి ఓవర్ వేసిన గ్రీన్ బౌలింగ్ లో మూడు భారీ సిక్సర్లు కొట్టి టీమిండియా స్కోరును 200 దాటించాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా..  హెజిల్వుడ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. గ్రీన్ కు ఒక వికెట్ దక్కింది. 
 

click me!