హనుమ విహారీ వెన్నంటే అదృష్టం...గండాలను దాటుకుంటూ సెంచరీ దరికి

By Arun Kumar PFirst Published Sep 1, 2019, 4:06 PM IST
Highlights

వెస్టిండిస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో కూడా టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. తెలుగు క్రికెటర్ హనుమ విహారీ అద్భుత సెంచరీతో  చెలరేగడంతో కోహ్లీసేన మొదటి ఇన్నింగ్స్ లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తోంది.  

తెలుగు క్రికెట్ ప్రియుల ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు హనుమ విహారీ తెరదించాడు. హైదరబాదీ సొగసరి బ్యాట్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ తర్వాత టెస్ట్ క్రికెట్లో సెంచరీ బాదిన తెలుగు క్రికెటర్ గా హనుమ విహారి నిలిచాడు. అద్భుతమైన అతడి ప్రతిభకు అదృష్టం తోడవడంతో ఈ శతకం సాధ్యమయ్యింది. మొదటి టెస్ట్ లో తృటిలో సెంచరీని మిస్సైన విహారీ ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఇలా తన కెరీర్లో మొదటి శతకాన్ని పూర్తిచేసుకుని టీమిండియాకు భారీ ఆదిక్యాన్ని అందించాడు. 

అయితే ఈ మ్యాచ్ లో విహారీ అత్యుత్తమ ఆటకు అదృష్టం అండగా నిలిచింది. కేవలం సున్నా పరుగులకే ఔటయ్యే గండాన్ని విహారీ తప్పించుకుని సెంచరీ సాధించగలిగాడు.  68 పరుగుల వద్ద మరోసారి అతడికి అదృష్టం కలిసొచ్చింది. కార్న్ వాల్ బౌలింగ్ లో అతడిచ్చిన క్యాచ్ ను క్యాంప్ బెల్ నేలపాలుచేశాడు. ఇలా విహారికి రెండో లైఫ్ లభించింది. 

ఇక 79 పరుగుల వద్ద మరోసారి అతడు ఔటయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. విండీస్ కెప్టెన్ హోల్డర్ బౌలింగ్ లో  అతడు ఎల్బీగా ఔటైనట్లు గ్రౌండ్ అంపైర్ ప్రకటించాడు. దీనిపై రివ్యూ కోరగా అంపైర్ నిర్ణయం తప్పని తేలి విహారీ మరోసారి బ్రతికిపోయాడు. ఇలా గండాలన్నింటిని దాటుకుని విహారీ 200 బంతుల్లో 100 పరుగులను పూర్తిచేసుకుని సత్తా చాటాడు. 

మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కూడా విహారీ అద్భుతంగా ఆడాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు తోడుగా నిలిచి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే 93 పరుగలతో సెంచరీకి చేరువైన అతడు తృటిలో సెంచరీని మిస్సయ్యాడు. కానీ రెండో టెస్టులో మాత్రం అన్నీ కలిసిరావడంతో సెంచరీని పూర్తిచేసుకోగలిగాడు. 

రెండో టెస్ట్ లో టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీ సేన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌటవగా విండీస్ కేవలం 87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లోపడింది. ఇలా రెండో రోజుమ కూడా భారత  ఆధిక్యమే కొనసాగింది. ఇలా రెండోరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 329 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలో ఉంది. 

click me!