సౌత్ జోన్ కెప్టెన్‌గా హనుమ విహారి, వైస్ కెప్టెన్‌గా మయాంక్... దులీప్ ట్రోఫీలో తిలక్ వర్మ, శ్రీకర్ భరత్‌‌లకు...

Published : Jun 14, 2023, 01:31 PM IST
సౌత్ జోన్ కెప్టెన్‌గా హనుమ విహారి, వైస్ కెప్టెన్‌గా మయాంక్... దులీప్ ట్రోఫీలో తిలక్ వర్మ, శ్రీకర్ భరత్‌‌లకు...

సారాంశం

దులీప్ ట్రోఫీ 2023 టోర్నీలో సౌత్ జోన్ కెప్టెన్‌గా హనుమ విహారికి ఛాన్స్... సాయి సుదర్శన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, శ్రీకర్ భరత్ వంటి కుర్రాళ్లకు అవకాశం... 

అప్పుడెప్పుడో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు హనుమ విహారి. 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్న భారత జట్టుని ఇద్దరూ కలిసి ఆదుకుని, మ్యాచ్‌ని డ్రా చేశారు..

ప్యాట్ కమ్మిన్స్, జోష్ హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ బౌన్సర్లతో విరుచుకుపడుతూ ఈ ఇద్దరినీ గాయపరిచినా... నొప్పిని భరిస్తూనే క్రీజులో అతుక్కుపోయారు. చేతికి గాయమైనా పట్టు వదలకుండా 35 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన హనుమ విహారి పోరాటానికి టీమిండియా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

విదేశాల్లో ఘనమైన రికార్డు ఉన్న హనుమ విహారి, 2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఇదే రకమైన పోరాటం చూపించాడు. ఓటమి అంచుల్లో ఉన్న ఆంధ్రా జట్టును రక్షించేందుకు కుడి చేతికి గాయం కావడంతో ఎడమ చేత్తో బ్యాటింగ్‌కి వచ్చాడు హనుమ విహారి. మధ్యప్రదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బౌన్సర్ దెబ్బకు విహారి, మణికట్టుకి తీవ్ర గాయమైంది. 

ఈ గాయం కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటూ వచ్చిన హనుమ విహారి, జూన్ 28 నుంచి బెంగళూరులో మొదలయ్యే దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్, వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మంగళవారం, గోవాలో సమావేశమైన సౌత్ జోన్ అసోసియేషన్, కెప్టెన్‌గా హనుమ విహారిని ఎంచుకోవడమే కాకుండా టీమ్‌ని ఎంపిక చేసింది.

ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్‌, దులీప్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాయి సుదర్శన్, దేశవాళీ టోర్నీల్లో కూడా అద్భుతమైన ఫామ్‌ని చూపించాడు..

అలాగే తమిళనాడుకి చెందిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ కూడా దులీప్ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలో గాయపడి, టీమ్‌కి దూరమైన సుందర్‌తో పాటు ప్రదోశ్ రంజన్ పాల్, సాయి కిషోర్, శ్రీకర్ భరత్‌లకు సౌత్ జోన్ టీమ్‌లో చోటు దక్కింది..

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన శ్రీకర్ భరత్‌‌తో పాటు ఆంధ్రా వికెట్ కీపర్ రిక్కీ భుయ్ కూడా సౌత్ జోన్ టీమ్‌లో ఆడబోతున్నారు. అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, కేరళ బ్యాటర్ సచిన్ బేబీ, గోవా బ్యాటర్ దర్శన్ మిసాల్‌లకు సౌత్ జోన్ టీమ్‌లో చోటు దక్కింది.. ఈ టోర్నీలో ప్రదర్శన బాగుంటే విండీస్ టూర్ తర్వాత జరిగే సిరీసుల్లో చోటు దక్కించుకోవచ్చు.. 

దులీప్ ట్రోఫీ 2023 టోర్నీకి సౌత్ జోన్ టీమ్ ఇది: హనుమ విహారి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిక్కీ భుయ్, శ్రీకర్ భరత్, ఆర్ సమర్థ్, వాషింగ్టన్ సుందర్, సచిన్ బేబీ, ప్రదోశ్ రంజన్ పాల్, సాయి కిషోర్, వీ కవేరప్ప, విజయ్‌కుమార్ వైశాక్, కేవీ శశికాంత్, దర్శన్ మిసాల్, తిలక్ వర్మ

PREV
click me!

Recommended Stories

తెలుగోడా.. మజాకానా.! టీ20ల్లో తోపు బ్యాటర్‌గా.. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేశాడుగా
Cricket: పాములు, కీట‌కాలు, చీమ‌లు.. వీటివ‌ల్ల కూడా మ్యాచ్‌లు ఆగిపోయాయ‌ని తెలుసా.?