
విజయ్ హాజారే ట్రోఫీ 2021లో ఆంధ్రా జట్టు ఘనవిజయంతో బోణీ కొట్టింది. విదర్భతో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని చేధించి, మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆంధ్రా. టాస్ గెలిచి ఆంధ్రా జట్టు, విదర్భకి బ్యాటింగ్ అప్పగించింది.
కెప్టెన్ ఫియాజ్ ఫజల్‌తో పాటు యష్ రాథోడ్ అద్భుత సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 331 పరుగుల భారీ స్కోరు చేసింది విదర్భ. . ఫజల్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు చేసి అవుట్ కాగా, యష్ రాథోడ్ 113 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 117 పరుగులు చేశాడు.
స్టీఫెన్ మూడు వికెట్లు తీయగా, హనుమ విహారి 7 ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగలిచ్చి ఓ వికెట్ తీశాడు. 332 పరుగుల భారీ టార్గెట్‌ను 49.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది ఆంధ్రా జట్టు. హనుమ విహారి 67 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 65 పరుగులు చేయగా, నితీశ్ రెడ్డి 58 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు.
రిక్కీ భుయ్ 78 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయ శతకం సాధించి, ఆంధ్రాకి విజయాన్ని అందించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కేకి ఎంపికైన హరిశంకర్ రెడ్డి బౌలింగ్‌లో విఫలం కాగా, బ్యాటింగ్‌లో 6 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.