
టీమిండియాకు కొత్త కిట్ స్పాన్సర్ రాబోతుంది. త్వరలోనే భారత జట్టుకు ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్ గూడింగ్ (క్రీడా సంబంధిత వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ) కంపెనీ ‘అడిడాస్’తో జతకట్టనుంది. 2020 నుంచి 2023 వరకూ భారత జట్టుకు కిట్ స్పాన్సర్ గా వ్యవహరించిన ‘ఎంపీఎల్ స్పోర్ట్స్’ అర్థాంతరంగా (డీల్ 2023 డిసెంబర్ వరకూ ఉంది) తప్పుకోవడంతో ప్రస్తుతం కెవాల్ కిరణ్ (కిల్లర్ జీన్స్) తాత్కాలిక కిట్ స్పాన్సర్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే భారత క్రికెటర్ల జెర్సీలపై అడిడాస్ లోగో మెరవనుంది.
ఈ మేరకు ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అడిడాస్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయని, వచ్చే నెలలో ఈ డీల్ సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం... 2023 నుంచి 2028 వరకు (ఐదేండ్ల పాటు) టీమిండియా కిట్ స్పాన్సర్ గా అడిడాస్ వ్యవహరించనుంది. ఒక్కో మ్యాచ్ కు రూ. 65 లక్షలు చెల్లించేందుకు అడిడాస్ అంగీకరించింది. ఈ లెక్కన ప్రతీ ఏడాది సుమారు రూ. 70 కోట్లు (ఐదేండ్లకు రూ. 350 కోట్లు) చెల్లించేందుకు ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరిందని తెలుస్తున్నది.
భారత క్రికెట్ జట్టుకు 2020 నుంచి 2023 వరకు కిట్ స్పాన్పర్ గా ఎంపీఎల్ వ్యవహరించాల్సి ఉండగా ఆ సంస్థ అర్థాంతరంగా తప్పుకుంది. దీంతో బీసీసీఐ కెవిన్ కిరణ్ ను తాత్కాలిక కిట్ స్పాన్సర్ గా నియమించింది. 2020 వరకూ టీమిండియాకు కిట్ స్పాన్సర్ గా నైకీ ఉండేది. ఇప్పుడు మరో దిగ్గజ స్పోర్ట్స్ గూడింగ్ కంపెనీ భారత జట్టుతో జతకడుతుండటం గమనార్హం.
ఫ్యాన్స్ ఖుషీ..
2022లో ఫిఫా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టుకు అడిడాస్ కిట్ స్పాన్సర్ గా ఉంది. ఇప్పుడు అడిడాస్ టీమిండియాకు స్పాన్సర్ గా ఉండనుండటంతో భారత్ కూడా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
దిల్ రాజు మేనియా..
‘డాన్స్ వేనుమా డాన్స్ ఇరుక్కు.. ఫైట్ వేనుమా ఫైట్ ఇరుక్కు.. ఎమోషన్ వేనుమా అదీ ఇరుక్కు...’ అంటూ తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘వారిసు’ (వారసుడు) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అదే ఫంక్షన్ లో ఆయన.. విజయ్ గురించి పొగుడుతూ.. ‘అదిదా సార్..’అనే డైలాగ్ కూడా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వచ్చీ రాని తమిళంలో ఆయన చెప్పిన ‘అదిదా సార్’ కాస్తా ‘అదిదాస్ సార్’అయిపోయింది. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు దిల్ రాజు ఏ ఆడియో ఫంక్షన్ లో కనిపించినా ఆయనను ‘అదిదాస్ సార్’అంటూ ట్రోల్ చేయడం ఇప్పటికీ సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు ఏకంగా అడిడాస్ టీమిండియాకు స్పాన్సర్ గా వ్యవహరిస్తుండటంతో ఇదంతా దిల్ రాజు చలవే అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. గతంలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కూడా వన్డేలలో సిరాజ్ వరల్డ్ నెంబర్ బౌలర్ గా అవతరించడంతో అతడిని ప్రశంసిస్తూ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే.