పుట్టింది జింబాబ్వేలో.. ఆడింది ఇంగ్లాండ్‌కు.. ఇప్పుడు మళ్లీ స్వదేశానికి ఆడనున్న క్రికెటర్..

By Srinivas MFirst Published Feb 5, 2023, 2:10 PM IST
Highlights

Gary Ballance: క్రీడాకారులు ఒక దేశంలో పుట్టి మరో దేశంలో ఆడటంలో వింతేమీ లేదు.  కానీ  ఓ దేశంలో పుట్టి మరో దేశానికి ఆడి తిరిగి తన స్వదేశానికి వచ్చి ఆడటం మాత్రం కచ్చితంగా   వింతే.. 

ఒక దేశంలో పుట్టి మరో దేశంలో ఆడటంలో వింతేమీ లేదు. అవకాశాలు లేకనో, కుటుంబాలు వలస వెళ్లడం   వలనో  చాలా మంది క్రీడాకారులు  తాము పుట్టిన దేశంలో కాకుండా మరో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుంటారు. అయితే  ఓ దేశంలో పుట్టి మరో దేశానికి ఆడి తిరిగి తన స్వదేశానికి వచ్చి ఆడటం మాత్రం కచ్చితంగా  ఆసక్తికరాంశమే.  తాజాగా ఓ క్రికెటర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.  అతడి పేరు  గ్యారీ బ్యాలెన్స్. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్. 

గ్యారీ బ్యాలెన్స్  పుట్టింది  హరారే (జింబాబ్వే) లో.  బ్యాలెన్స్ తల్లిదంండ్రులు  మోజాంబిక్ లో  పొగాకు క్షేత్రాల్లో పనిచేసేవారు.  అతడి విద్యాబ్యాసం అంతా   అక్కడే సాగింది.  బ్యాలెన్స్ పుట్టి పెరిగింది జింబాబ్వేలోనే అయినా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అతడి తాతలు బ్రిటన్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు.   

ఇంగ్లాండ్ టీమ్ లోకి ఎంట్రీ.. 

2006లో బ్యాలెన్స్  ఇంగ్లాండ్ కు వెళ్లాడు. అక్కడే కౌంటీలు ఆడి   గుర్తింపు తెచ్చుకున్నాడు. కౌంటీలలో మెరవడంతో 2013లో అతడు ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.  2013 నుంచి  2017 వరకు  ఇంగ్లాండ్ తరఫున ఆడాడు. ఆ జట్టు తరఫున 23 టెస్టులు,  18 వన్డేలు ఆడాడు.  పామ్ కోల్పోవడంతో బ్యాలెన్స్ కు జాతీయ జట్టులో అవకాశాలు సన్నగిల్లాయి.  కౌంటీలలో రాణించినా అప్పటికే జట్టులో యువ ఆటగాళ్లు  తమ స్థానాలను పదిలం చేసుకోవడంతో బ్యాలెన్స్ కు   జాతీయ జట్టులో చోటు దక్కలేదు.  దీంతో అతడు తిరిగి జింబాబ్వే బాట పట్టాడు. 

బ్యాక్ టు హోమ్.. 

గతేడాది డిసెంబర్ లో  బ్యాలెన్స్  జింబాబ్వేకు ఆడాడు.  మొదలు అక్కడి దేశవాళీలో ఆడి  ఆ తర్వాత   జాతీయ జట్టుకు  ఎంపికయ్యాడు.  డిసెంబర్ లో ఐర్లాండ్ - జింబాబ్వే మ్యాచ్ లో ఆడాడు.  ఇక ఇప్పుడు   బ్యాలెన్స్ మరో అరుదైన ఘనత సాధించబోతున్నాడు.  ఫిబ్రవరిలో జింబాబ్వే - వెస్టిండీస్ మధ్య  టెస్టు మ్యాచ్ లు జరుగనున్నాయి.   ఈ సిరీస్ కోసం బ్యాలెన్స్ కూడా ఎంపికయ్యాడు.  తద్వారా రెండు దేశాల తరఫున టెస్టు క్రికెట్ ఆడిన పదహారో క్రికెటర్ గా రికార్డులకెక్కనున్నాడు. 

రెండు దేశాల తరఫున  టెస్టులు ఆడిన క్రికెటర్లు : 

- బిల్లీ మిడ్ వింటర్ (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) 
- విలియమ్ లాయిడ్ ముద్రోచ్ (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) 
- జె జె ఫెర్రిస్ (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్)
- సామీ వుడ్స్ (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) 
- ఫ్రాంక్ హీర్న్ (ఇంగ్లాండ్, సౌతాఫ్రికా) 
- అల్బర్ట్ ట్రాట్ (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) 
- ఇఫ్తికార్ అలి ఖాన్ పటౌడి (ఇంగ్లాండ్, ఇండియా) 
- గుల్ మహ్మద్ (ఇండియా, పాకిస్తాన్)
- అబ్దుల్ హఫీజ్ కర్దార్ (ఇండియా, పాకిస్తాన్) 
- అమీర్ ఎలాహి (ఇండియా, పాకిస్తాన్) 
- సమీ గుయిలెన్ (వెస్టిండీస్, న్యూజిలాండ్) 
- జాన్ ట్రాయికోస్ (సౌతాఫ్రికా, జింబాబ్వే)
- కెప్లర్ వెసల్స్ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) 
- బాయ్డ్ రాంకిన్ (ఇంగ్లాండ్, ఐర్లాండ్) 
- గ్యారీ బ్యాలెన్స్ (ఇంగ్లాండ్, జింబాబ్వే)  

click me!