
ఆధునిక క్రికెట్ లో టీమిండియా విజయాలలో కీలక భూమిక పోషిస్తున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోని నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న కోహ్లి.. సుమారు ఏడేండ్ల పాటు భారత జట్టును విజయవంతంగా నడిపించాడు. ఇక కోహ్లి నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా టీమిండియాను విజయాల జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ ఇద్దరికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కోహ్లి-రోహిత్ ల ద్వయంపై తాజాగా బాలీవుడ్ గంగూభాయ్ (అలియా భట్) స్పందించింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గంగూభాయ్ చిత్రంలో లీడ్ రోల్ లో కనిపించిన అలియా భట్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోహిత్-కోహ్లి ద్వయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇద్దరు వెటరన్ ఆటగాళ్లలో ఎవరంటే తనకు ఇష్టమో తెలిపింది.
మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు..? అన్న ప్రశ్నకు అలియా స్పందిస్తూ... ‘ప్రస్తుతమైతే రోహిత్ శర్మ.. ఎప్పటికీ (ఆల్ టైం) విరాట్ కోహ్లి..’ అని లౌక్యంగా సమాధానం చెప్పింది. ఇక ఒకవేళ అలియా ఈ ఇద్దరిలా మారిపోతే ఏం చేస్తుందనే ప్రశ్నకు అలియా తనదైన శైలిలో స్పందించింది.
‘నేనే కోహ్లినైతే కొన్నాళ్లు విరామం తీసుకుంటా.. ఎందుకంటే చాలాకాలంగా అతడు భారత జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు..’ అని తెలిపింది. ‘నేను రోహిత్ నైతే మాత్రం బ్రేక్ తీసుకోను. ఇటీవలే అతడు ఇండియాను అన్ని ఫార్మాట్లలో నడిపించడానికి నియమితుడయ్యాడు. జట్టులో అందరు ఆటగాళ్లు బాగా రాణించడానికి వారిలో స్ఫూర్తిని రగిలిస్తాను..’ అని చెప్పింది.
అయితే డిప్లమేటిక్ ఆన్సర్ ఇచ్చిన అలియా భట్ ట్రోల్స్ కు గురైంది. అలియా వీడియో బైట్ పై ఓ ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ... ‘రోహిత్ ఇప్పుడు.. కోహ్లి ఆల్ టైం అని అలియా ఎలా చెబుతున్నది..? అంటే దాని అర్థం ఏమిటి..? కోహ్లి ఇంకా క్రికెట్ ఆడటం లేదా..?’ అని స్పందించాడు. ఇక మరికొందరు యూజర్లు స్పందిస్తూ.. ‘క్రికెట్ ఎక్స్పర్ట్’.. ‘అర్రె.. అలియా కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవుతుందే..’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో ఓసారి కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న అలియా.. ‘మన రాష్ట్రపతి ఎవరు..?’ అన్న ప్రశ్నకు అలియా ‘పృథ్వీరాజ్ చౌహాన్ (అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి)’ అని సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆమె జనరల్ నాలెడ్జ్ పై ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తిన విషయం తెలిసిందే.