
టీమిండియా అత్యుత్తమ సారథుల్లో ఒకడైన ఎంఎస్ ధోని.. వ్యూహాలు రచించడంలో దిట్ట. మ్యాచుల సందర్భంగా అప్పటికప్పుడే వ్యూహాలను పన్నడంతో పాటు వాటిని కచ్చితంగా అమలు చేయడంలో అతడు అందెవేసిన చేయి. గతంలో టీమిండియా తరఫున ఆడుతున్నప్పుడే గాక ఐపీఎల్ లో వందలాది మ్యాచులలో ధోని వ్యూహ విన్యాసాలు చూశాం. గతంలో నాలుగు సార్లు చెన్నైని ఛాంపియన్ గా నిలిపిన ధోని.. ఇప్పుడు తర్వాతి సీజన్ లో కూడా నెగ్గడం కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు. మ్యాచులన్నీ మహారాష్ట్రలోనే జరుగుతుండటంతో ధోని ఈ వ్యూహ రచన చేశాడు.
ఐపీఎల్-2022 మార్చి 26 నుంచి మహారాష్ట్ర వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్.. వ్యూహం మార్చింది. వచ్చే నెల 2 నుంచి మొదలుకాబోయే ప్రాక్టీస్ సెషన్ ను తన సొంత గ్రౌండ్ చెన్నైలో కాకుండా సూరత్ కు మకాం మార్చింది. సూరత్ లో కొత్తగా నిర్మించిన లాల్భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ ను నిర్వహించనున్నది సీఎస్కే..
సూరత్ లో ఎందుకు..?
ఐపీఎల్ తర్వాత సీజన్ అంతా మహారాష్ట్రలోనే జరుగనున్నది. ముంబై (వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్, జియో స్టేడియం) తో పాటు పూణె లో కూడా మ్యాచులు జరుగుతాయి. అయితే ముంబైలో స్టేడియాలకు ఉపయోగించిన మట్టినే సూరత్ లో కొత్తగా నిర్మించిన లాల్బాయ్ స్టేడియంలోని పిచ్ లపై కూడా ఇదే మట్టిని వాడుతున్నారట. లాల్భాయ్ స్టేడియంలోని పిచ్ లు ముంబై పిచ్ ల మాదిరే ఉంటాయని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ధోని, సీఎస్కే లు తమ జట్టు ప్రాక్టీస్ క్యాంప్ ను సూరత్ కు తరలించనున్నది.
ఇదే విషయమై సూరత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి నైనేయ్ దేశాయ్ స్పందిస్తూ.. ‘ధోని, బ్రావో, జడేజా వంటి జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం ఇక్కడికి రానున్నారు. ఇక్కడి పిచలలో మట్టి కూడా ముంబై మట్టినే పోలి ఉంటుంది. అందుకే వాళ్లు (సీఎస్కే) దీనిని సెలెక్ట్ చేసుకున్నారు’ అని తెలిపాడు.
మార్చి 2 నుంచి ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్న సీఎస్కే.. బయో బబుల్ లో గడపనుంది. ఐపీఎల్-15కు తేదీలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు బయట ఉంటే కరోనా బారినపడటం.. గాయాలు.. ఇతర సమస్యలు లేకుండా బబుల్ లోనే ఉండేలా చెన్నై చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆ జట్టు ఆటగాళ్లందరికీ ఇప్పటికే ఆదేశాలు అందినట్టు సమాచారం. ఐపీఎల్ సీజన్ అంతా మహారాష్ట్రలోనే జరుగుతుండటంతో అది ముంబై ఇండియన్స్ కు లాభిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో చెన్నై.. తన ప్రాక్టీస్ ను సూరత్ కు తరలించింది. ముంబైతో పోటీపడాలంటే అక్కడి పరిస్థితులకు అలవాటుపడటం కూడా వ్యూహంలో భాగమే..
ఐపీఎల్-15 సీజన్ కోసం చెన్నై జట్టు : రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు), ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు), రాబిన్ ఉతప్ప (రూ. 2 కోట్లు), డ్వేన్ బ్రావో (రూ. 4.4 కోట్లు), అంబటి రాయుడు (రూ. 6.75 కోట్లు), దీపక్ చాహర్ (రూ. 14 కోట్లు), కెఎం అసిఫ్ (రూ.20 లక్షలు), తుషార్ దేశ్పాండే (రూ. 20 లక్షలు), శివమ్ దూబే (రూ. 4 కోట్లు), మహేశ్ తీక్షణ (రూ. 70 లక్షలు), రాజవర్ధన్ హంగర్గేకర్ (రూ. 1.5 కోట్లు), సిమర్జిత్ సింగ్ (రూ. 20 లక్షలు), డెవాన్ కాన్వే (రూ. 1 కోటి), డ్వేన్ ప్రిటోరియస్ (రూ. 50 లక్షలు), మిచెల్ సాంట్నర్ (రూ. 1.9 కోట్లు), అడమ్ మిల్నె (రూ. 1.9 కోట్లు), సుభ్రాంషు సేనాపతి (రూ. 20 లక్షలు), ముఖేశ్ చౌదరి (రూ. 20 లక్షలు), ప్రశాంత్ సోలంకి (రూ. 1.2 కోట్లు), ఎన్. జగదీశన్ (రూ. 20 లక్షలు), హరి నిశాంత్ (రూ. 20 లక్షలు), క్రిస్ జోర్డాన్ (రూ. 3.6 కోట్లు), కె.భగత్ వర్మ (రూ. 20 లక్షలు)