మేము ఉన్నాము.. మేము ఆడతాము..!! సందు దొరికితే సత్తా చాటుతున్న యువ క్రికెటర్లు.. అంతా దాని మహిమే..

By Srinivas MFirst Published Jun 29, 2022, 12:19 PM IST
Highlights

Sanju Samson: భారత క్రికెట్ లో టాలెంట్ కు కొదవలేదు. కానీ కావాల్సింది సరైన వేదిక మాత్రమే. ఆ లోటును ఇప్పుడు ఐపీఎల్ పూడుస్తున్నది. ఈ లీగ్ ద్వారా టీమిండియా ఇప్పటికిప్పుడు మరో  నాలుగు  జట్లనైనా రెడీ చేసే సామర్థ్యం సంపాదించింది. 
 

గతంలో టీమిండియా తరఫున ఒక పేరుమోసిన ఆటగాడో.. భీభత్సమైన ఫామ్ లో ఉన్న క్రికెటరో రిటైర్ అవుతున్నా.. గాయపడి జట్టుకు దూరమైనా అతడి స్థానాన్ని భర్తీ చేయడం సెలక్టర్లకు తలకు మించిన భారమయ్యేది.  సరే.. ఆ స్థానంలో వచ్చిన ఆటగాడు   సరిగా ఆడతాడో లేదో తెలియదు. దీంతో ఒక ఆటగాడు జట్టులోకి వచ్చాడంటే ఏండ్లకేండ్లు అలా పాతుకుపోయేవారు. ఇప్పుడలా కాదు. అవకాశమివ్వండి చాలు మేమేంటో నిరూపిస్తామంటున్నారు కుర్రాళ్లు. దేశవాళీతో పాటు ఐపీఎల్ లో తమను తాము నిరూపించుకుని..  అవకాశమిస్తే తామేం చేయగలమో ముందే చేసి చూపిస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. టాప్ లేపడానికి సిద్ధమంటున్నారు కుర్రాళ్లు. 

ఇటీవలి కాలంలో ఫిట్నెస్, వర్క్ లోడ్, గాయల  కారణంగా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు తీరిక లేని క్రికెట్ ఆడటం లేదు. ఆ కమ్రంలో వారి స్థానంలోకి వస్తున్న యువ ఆటగాళ్లు మాత్రం ఛాన్స్ దొరికితే చాలు సత్తా చాటుతున్నారు. ఈ  జాబితాలో ముందువరుసలో నిలుస్తున్నవారిలో ఇషాన్ కిషన్,   దీపక్ హుడా, సంజూ శాంసన్ లు ఉన్నారు. 

తీసేయడానికి ఆప్షన్ లేకుండా.. 

మార్చిలో ముగిసిన శ్రీలంకతో టీ20 సిరీస్ లో రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేశాడు ఇషాన్.  ఆ సిరీస్  లో  (89, 16) ఫర్వాలేదనిపించాడు. ఇక ఇటీవలే ముగిసిన సఫారీ సిరీస్ లో కెఎల్ రాహుల్ కు గాయం, రోహిత్ కు విశ్రాంతి నేపథ్యంలో అతడికి మళ్లీ అవకాశమిచ్చారు సెలక్టర్లు. దీనిని అతడు రెండు చేతులా అందుకున్నాడు. ఆ సిరీస్ లో (76, 34, 54, 27, 15) నిలకడగా రాణించి తనను జట్టునుంచి తప్పించలేని పరిస్థితి కల్పించుకున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో కూడా తొలి మ్యాచ్ (26) లో కూడా దాటిగా ఆడాడు. టీ20 ప్రపంచకప్ లో తన పేరును పరిశీలించాల్సిందే.. అన్నంత స్థాయిలో ఇషాన్ ప్రదర్శన సాగుతున్నది. 

అయ్యర్ కు పోటీగా.. 

లంక సిరీస్ లో పెద్దగా అవకాశాలు రానప్పటికీ దీపక్ హుడా.. ఐర్లాండ్ సిరీస్ లో మాత్రం రెచ్చిపోయాడు.  ఐర్లాండ్ తో  (47 నాటౌట్, 104) రెండు ఇన్నింగ్స్ లలోనూ దూకుడుగా ఆడి మిడిలార్డర్ లో తానెంత కీలక ఆటగాడో సెలక్టర్లకు చూపాడు. ఈ సిరీస్ కు ముంద ముగిసిన ఐపీఎల్ లో కూడా అతడు నిలకడగా ఆడాడు. హుడా ఇలాగే ఆడి శ్రేయస్ అయ్యర్ తన వైఫల్యాలను కొనసాగిస్తే మాత్రం అతడి స్థానాన్ని హుడా భర్తీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. 

శాంసన్..  ఓ సర్ ప్రైజ్ ప్యాకేజీ.. 

టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా సరైన అవకాశాల్లేక.. అడపాదడపా ఛాన్సులు వచ్చినా వాటిని వినియోగించుకోని ఆటగాడిగా పేరున్న శాంసన్.. తన రూట్ మార్చాడు. ఐర్లాండ్ తో సిరీస్ లో రెండో మ్యాచ్ లో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. రెండో టీ20లో అతడు 77 పరుగులతో చెలరేగాడు. ఐపీఎల్-15లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ గా వ్యవహరించిన ఈ కేరళ కుర్రాడు.. 17 మ్యాచుల్లో 458 పరుగులు చేశాడు. బంతిని బలంగా బాదడంలో దిట్ట అయిన శాంసన్.. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే టీ20 ప్రపంచకప్ లో అతడిచి చోటు దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. గతంలో టీమిండియాలో పలు అవకాశాలు వచ్చినా శాంసన్ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. కానీ ఈసారి మాత్రం తనలోని అసలైన ఆటను బయటకు తీసి సెలక్టర్లకు ఇంగ్లాండ్ సిరీస్ లో మరింత పని కల్పించాడు. 

కేరాఫ్ ఐపీఎల్..

పైన పేర్కొన్న ముగ్గురు ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్  ద్వారా వెలుగులోకి వచ్చినోళ్లే కావడం గమనార్హం. ఈ లీగ్ ద్వారా ఎవరి జేబులు నిండుతున్నాయి..? లబ్ది పొందుతున్నది ఎవరు..? బీసీసీఐకి కామధేనువులా దొరికిన ఈ లీగ్ వల్ల ఎవరికి లాభం..? అనే విషయం కాసేపు పక్కనెడితే టీమిండియాకు మెరికల్లాంటి కుర్రాళ్లను అందిస్తున్నది  ఐపీఎల్. ఇప్పటికిప్పుడు భారత సీనియర్ జట్టులో చాలా మంది తప్పుకున్నా.. ఒకే టైమ్ లో మరో రెండు జట్లకు ఆడగల సత్తా ఉన్న ఆటగాళ్లను తయారుచేసుకుంది బీసీసీఐ. 

click me!