FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, గ్రూప్ దశలో రెచ్చిపోయిన ఇంగ్లాండ్ జట్లు రౌండ్ ఆఫ్ 16లో కూడా దుమ్మురేపాయి. ఇరు జట్లు తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి.
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ తన దూకుడును కొనసాగిస్తున్నది. ఆదివారం ప్రిక్వార్టర్స్ లో భాగంగా పోలండ్ తో ముగిసిన పోరులో ఫ్రాన్స్ విజయదుందుభి మోగించింది. 3-1 తేడాతో పోలండ్ ను ఇంటిబాట పట్టించి క్వార్టర్స్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. మరో పోరులో ఇంగ్లాండ్ కూడా సెనెగల్ ను మట్టికరిపించింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్.. 3-1 తేడాతో సెనెగల్ ను ఇంటికి పంపించింది.
ఆదివారం ఫ్రాన్స్ - పోలండ్ మధ్య జరిగిన ప్రిక్వార్టర్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రెచ్చిపోయింది. ఆ జట్టు తరఫున ఆట 44వ నిమిషంలో ఒలివియర్ జిరూడ్ తొలి గోల్ చేశాడు. ఇక ఎంబాపె.. ఆట రెండో అర్థభాగంలో రెచ్చిపోయాడు. ఆట 74వ నిమిషంలో ఒకటి, 91 వ నిమిషంలో మరో గోల్ చేసి ఫ్రాన్స్ ను క్వార్టర్స్ కు చేర్చాడు.
undefined
పోలండ్ తరఫున ఆ జట్టు సారథి లెవన్ డౌస్కీ ఆట ముగుస్తుందనగా 90+9వ నిమిషంలో గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని కాస్త తగ్గించాడు. ఈ విజయంతో ఫ్రాన్స్.. ప్రపంచకప్ లో తొమ్మిదోసారి క్వార్టర్స్ కు దూసుకెళ్లింది.
ఇక ఇంగ్లాండ్ - సెనెగల్ మధ్య ముగిసిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్ లో ఆట 38వ నిమిషంలో జోర్డాన్ హెండర్‌సన్ తొలి గోల్ కొట్టాడు. ఆ తర్వాత హ్యారీ కేన్ మరో గోల్ కొట్టి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. గేమ్ సెకండ్ హాఫ్ లో ఇంగ్లాండ్ కు మూడో గోల్ దక్కింది. 58వ నిమిషంలో బుకాయో సక గోల్ చేసి ఇంగ్లాండ్ కు పటిష్టస్థితిలో నిలిపాడు. గోల్ కోసం సెనెగల్ ఎంతగా ప్రయత్నించినా ఇంగ్లాండ్ అడ్డుకోవడంతో సెనెగల్ కు నిరాశతప్పలేదు. ఈ విజయంతో ఇంగ్లాండ్.. క్వార్టర్స్ లో ఫ్రాన్స్ తో తలపడనుంది.
బెర్తులు ఖాయం చేసుకున్న జట్లు..
ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్ లలో నాలుగు జట్లు తమ క్వార్టర్స్ బెర్త్ లను ఖాయం చేసుకున్నాయి. ఆ నాలుగు జట్లు అర్జెంటీనా, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. ఆస్ట్రేలియా, యూఎస్ఎ, పోలండ్, సెనెగల్ ఇంటిబాట పట్టాయి.
The Quarter-Finals are starting to take shape 👀 |
— FIFA World Cup (@FIFAWorldCup)నేడు ఫిఫాలో..
ప్రిక్వార్టర్స్ లో భాగంగా నేడు ఫిఫాలో జపాన్ - క్రొయేషియా తో పాటు బ్రెజిల్ - సౌత్ కొరియాలు తలపడనున్నాయి. డిసెంబర్ 7 వరకు రౌండ్ ఆఫ్ - 16 దశ ముగియనుంది. ఆ తర్వాత లాస్ట్ 8 (క్వార్టర్స్) మొదలవుతుంది.