బ్రేకింగ్: కపిల్‌దేవ్‌కు గుండెపోటు, ఆందోళనలో అభిమానులు

By Siva KodatiFirst Published Oct 23, 2020, 2:54 PM IST
Highlights

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ శుక్రవారం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 61 ఏళ్ల ఈ దిగ్గజ క్రికెటర్‌కు యాంజియోప్లాస్టీ జరిగినట్లుగా తెలుస్తోంది.

అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. అటు కుటుంబసభ్యులు సైతం కపిల్ ఆరోగ్యంపై నోరుమెదపలేదు. తాజా వార్తల నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కపిల్‌ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేస్తున్నారు. హర్యానా హరికేన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే కపిల్ దేవ్ 1983లో లార్డ్స్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో శక్తివంతమైన వెస్టిండీస్‌ను ఓడించి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.

1978 అక్టోబర్ 1న క్వెట్టాలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా కపిల్ భారత్ తరపున అరంగేట్రం చేశాడు. 131 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు 430 వికెట్లు, 5,248 పరుగులు చేశాడు. 225 వన్డేల్లో 3,783 పరుగులు చేసి 253 వికెట్లు తీశాడు.

క్రికెట్ చరిత్రలో కేవలం 21 సంవత్సరాల వయసులో 1000 పరుగులు, 100 వికెట్లు సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆల్‌రౌండర్‌గా కపిల్ రికార్డుల్లోకెక్కాడు. 1994లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన కపిల్ దేవ్, టీమిండియాకు హెడ్‌ కోచ్‌గాను సేవలందించాడు. 

click me!