
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను తక్కువ చేస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐపీఎల్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) గొప్పదని, అక్కడి బౌలర్లతో పోల్చితే ఐపీఎల్ లో బౌలింగ్ క్వాలిటీ చాలా తక్కువని అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు అకీబ్ ను ఓ ఆటాడుకుంటున్నారు. ముందు మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ కావాలని సూచిస్తున్నారు.
మరికొద్దిరోజుల్లో పీఎస్ఎల్ ప్రారంభం సందర్భంగా అకీబ్ జావేద్ సంచలన కామెంట్స్ చేశాడు. అతడు మాట్లాడుతూ.. ‘కొవిడ్, ఇతర అవరోధాలేమీ లేకుండా సవ్యంగా సాగితే పీఎస్ఎల్ ఈ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన లీగ్ అవుతుంది. ఇక్కడి పిచ్ లు ఎలా స్పందిస్తాయో మీకు తెలుసు. లాహోర్ పిచ్ ను చూడండి.. అది బౌలర్లకు సహకరిస్తుంది. కరాచీ పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుంది. ఇక్కడి పిచ్ లలో భిన్నత్వం ఉంది.
కానీ మీరు ఐపీఎల్ ను చూడండి.. అక్కడ ఒకే రకమైన క్రికెట్ ఉంటుంది. అక్కడ (ఇండియాలో) అన్నీ ఫ్లాట్ పిచ్ లే. ఆ పిచ్ ల మీద బౌలింగ్ కూడా తక్కువ నాణ్యత కలిగి ఉంటుంది...’ అని అన్నాడు.
ఈ వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ లో పాక్ కు చెందిన ఓ జర్నలిస్టు అకీబ్ వ్యాఖ్యలను ఉన్నదిఉన్నట్టుగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వాటిపై స్పందిస్తూ... పాకిస్థాన్ లో గొప్ప బ్యాటర్లు లేక బౌలర్లు గుర్తింపు పొందారని, అంతే తప్ప అందులో మీ (బౌలర్ల) గొప్పతనం ఏమీలేదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
మరో యూజర్ స్పందిస్తూ.. ‘అతడికి పిచ్చి లేచినట్టుంది. మెంటల్ హాస్పిటల్ కు వెళ్తే మంచిది. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లంతా ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నారు. అది వాస్తవం కాదా..? మీ పీఎస్ఎల్ పాక్ దేశవాళీ క్రికెట్ కంటే ఏ మేరకు నాణ్యత కలిగిందో నువ్వు చెప్పగలవా..?’ అని కామెంట్ చేశాడు.
‘పాపులారిటీలో గానీ ఆదాయంలో గానీ ఐపీఎల్ అనేది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ను మించిపోయింది. రానున్న రోజుల్లో ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్పోర్ట్స్ లీగ్ కాబోతున్నది. క్రికెట్ లో ఐపీఎల్ ఒక సంచలనం..’అని మరో యూజర్ పోస్ట్ చేశాడు.
ఇదిలాఉండగా పీఎస్ఎల్ నాణ్యత గురించి మాట్లాడుతున్న జావేద్.. భారత జట్టులోకి సంపాదించిన జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ వంటి క్వాలిటీ బౌలర్లు ఎక్కడ్నుంచి వచ్చారో తెలుసుకోవాలని నెటిజనులు చురకలు అంటిస్తున్నారు. కాగా.. పీఎస్ఎల్ లో లాహోర్ క్వాలండర్స్ కు బౌలింగ్ కోచ్ గా ఉన్న అకీబ్ జావేద్.. గతంలో పాకిస్థాన్ జట్టుకు కూడా అవే బాధ్యతలను నిర్వర్తించాడు.