క్రికెట్లోకి కల్వకుంట్ల కవిత ఎంట్రీ.... అజారుద్దిన్-కేటీఆర్ ల మధ్య ఒప్పందం: వివేక్

By Arun Kumar PFirst Published Sep 25, 2019, 5:28 PM IST
Highlights

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలపై మాజీ అధ్యక్షులు జి. వివేక్ సంచలన ఆరోపణలు చేశారు. హెచ్‌సిఏ అధ్యక్షపీఠంపై కల్వకుంట్ల కవితనే కూర్చోబెట్టెందుకు రంగం సిద్దమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ రాజకీయాల్లో ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కల్వకుంట్ల ఫ్యామిలీ ఇక క్రికెట్లోనూ అడ్డుగుపెట్టేందుకు సిద్దమైందట. ప్రస్తుతం బిసిసిఐ అనుబంధ సంఘాలకు జరుగుతున్న ఎన్నికల ద్వారా క్రికెట్ తో కూడా రాజకీయాలు చేయాలన్నదే మంత్రి కేటీఆర్ ఆలోచన అని మాజీ హెచ్‌సీఏ అధ్యక్షులు జి. వివేక్ ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను తమ చెక్కుచేతల్లోకి తీసుకోవాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది.  అందుకోసమే కాంగ్రెస్ మాజీ ఎంపి, మాజీ  క్రికెటర్ అజారుద్దిన్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని మాజీ ఎంపి, ప్రస్తుతం బిజెపి నాయకులు వివేక్ ఆశించారు. అందుకోసం ఎన్నికల బరిలోకి దిగిన ఆయన నామినేషన్ కూడా దాఖలుచేశారు. కానీ లోథా కమిటీ సిపార్సులను అనుసరించి అయననామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. దీంతో వివేక్ హెచ్‌సిఏ అధ్యక్ష రేసునుండి తప్పుకున్నాడు. 

ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన ఇవాళ(బుధవారం) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ కేసీఆర్ కుటుంబంపై, అజారుద్దిన్ పై విరుచుకుపడ్డారు. ''ప్రస్తుత హెచ్‌సీఏ ఎన్నికల్లో చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. అందులో భాగమే నా నామినేషన్ తిరస్కరణ. అధికార టీఆర్ఎస్ పార్టీతో మాజీ క్రికెటర్ అజారుద్దిన్ తో కుమ్మక్కయ్యాడు. అందువల్లే అతడు పోటీలో నిలిచాడు. 

అజారుద్దిన్ ద్వారా తన సోదరి కల్వకుంట్ల కవితను హెచ్‌సీఏలోకి తీసుకురావాలని కేటీఆర్ భావిస్తున్నాడు. కాబట్టి ఈసారి అతన్ని అధ్యక్షున్నిచేసి తర్వాతి ఎన్నికల్లోపూ కవిత ఈ అసోసియేషన్ లో కుదురుకునేలా చేస్తారు. ఆ తర్వాత ఆమెనే హెచ్‌సీఏ అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారు. ఇదే అజారుద్దిన్-కేటీఆర్ ల మధ్య జరిగిన ఒప్పంద సారాంశం. 

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ జట్టుకు దూరమైన అజారుద్దిన్ అధ్యక్ష పదవికి ఎలా అర్హుడో చెప్పాలి. బిసిసిఐ నుండి ఇప్పటివరకు అతడి క్లీన్ చీట్ లభించలేదు. అతడి నామినేషన్ ఆమోదించడాన్ని బట్టే ఈ ఎన్నికల్లో రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఆలోచించవచ్చు. కాబట్టి క్లబ్‌ ప్రతినిధులు ఆలోచించి ఓటు వేయాలి. తాను ప్రకాశ్‌ చంద్‌ జైన్ ప్యానెల్ కు మద్దతిస్తున్నాను.'' అని వివేక్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

మాజీ ఎంపీ వివేక్ కు షాక్... నామినేషన్ తిరస్కరించిన హెచ్‌సీఏ

నో ఎలక్షన్స్... ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పదవులన్నీ ఏకగ్రీవం

click me!