వదిలేసింది కెప్టెన్సీనే.. క్రేజ్ కాదు..! అది పోయినా ఇప్పటికీ కోహ్లినే కింగు.. ఇది సార్ విరాట్ బ్రాండ్

By Srinivas MFirst Published Jan 17, 2022, 3:20 PM IST
Highlights

Virat Kohli Brand Value: టీమిండియా ‘కెప్టెన్’ ట్యాగ్ తొలగిపోయిన తర్వాత విరాట్ కోహ్లిలో మళ్లీ ఆ ఫైర్ చూస్తామా..? అగ్రెసివ్ గా ఉండే కోహ్లి..  తిరిగి మునపటి ఫామ్ ను అందుకుంటాడా..? అతడి బ్రాండ్ వాల్యూ పడిపోతుందా..?  కోహ్లి అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలివి..

టీమిండియాలో విరాట్ కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ముగిసింది. గతేడాది టీ20 ప్రపంచకప్ కు ముందు పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన కోహ్లి.. రెండ్రోజుల క్రితం టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. డిసెంబర్ లో బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్ ట్యాగ్  వెళ్లిన తర్వాత కోహ్లి గతంలో మాదిరి అగ్రెసివ్ గా ఉండగలడా..? కోహ్లి లో ఉన్న మునపటి ఆట, ఆ తెగువ మళ్లీ  చూస్తామా..? అని అతడి అభిమానుల్లో ఒకటే ఆందోళన. దీంతో పాటు  కోహ్లికి అన్నీ భాగున్న రోజుల్లో  పలు  కంపెనీలకు అతడు బ్రాండ్ అంబాసిడర్. కోహ్లి వెంట కంపెనీలు పరిగెత్తేవి.

ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ముప్పై బ్రాండ్లకు కోహ్లి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. యూత్ లో అతడికి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. అతడితో ఎండార్స్ చేసుకోవడానికి గతంలో పలు సంస్థలు క్యూలో ఉండేవి. మరి ఇప్పుడు ‘కెప్టెన్’ ట్యాగ్ పోయింది. గతంలో మాదిరిగా పరుగులు కూడా చేయలేకపోతున్నాడు. కోహ్లి సెంచరీ చేసి ఎన్నాళ్లయిందో..?  అంతేగాక కొంతకాలంగా  బీసీసీఐతో విబేధాల కారణంగా అతడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో  కోహ్లి బ్రాండ్ విలువ తగ్గుతుందా..? గతంలో మాదిరిగా అతడు ఏకఛత్రాధిపత్యం సాగిస్తాడా..? అని  అతడి అభిమానులను వేధిస్తున్న  ప్రశ్న. 

అయితే  కెప్టెన్సీ పోయినా.. సెంచరీ చేయక రెండేండ్లు గడుస్తున్నా కోహ్లి బ్రాండ్ వాల్యూలో ఎలాంటి మార్పూ ఉండబోదంటున్నారు  మార్కెట్ నిపుణులు.  పారిశ్రామిక వర్గాల అంచనా  ప్రకారం.. అతడి క్రేజ్ ను క్యాష్ గా మలుచుకోవడంలో  చాలా కంపెనీలు సఫలమయ్యాయి. కెప్టెన్ గా అతడు వైదొలిగినా ఆటగాడిగా ఇంకో నాలుగైదేండ్లు కొనసాగడం ఖాయం. అదీగాక ఇప్పుడు కెప్టెన్సీ ఒత్తిడి కూడా లేకపోవడంతో  కోహ్లి స్వేచ్ఛగా.. గతంలో మాదిరి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఉంది. దీంతో ఇప్పుడప్పుడే  కంపెనీలు అతడితో బంధాన్ని తెంచుకునే సాహసాన్ని చేయవు. అంతేగాక ముందుగా కుదిరిన ఒప్పందాల మేరకైనా అవి..  విరాట్ తో కలిసి సాగాల్సిందే అంటున్నారు నిపుణులు. 

అతడి హవాకు ఏ డోకా లేదు.. 

కోహ్లి బ్రాండ్ వాల్యూ గురించి మార్కెట్ అనలిస్టు సంతోష్ దేశాయ్ మాట్లాడుతూ.. ‘కోహ్లికి ఉన్న అశేష అభిమానుల కారణంగా అతడు ఎండార్స్ చేసిన సంస్థలు కోట్లలో లాభాలు ఆర్జించాయి. ఇప్పుడు కెప్టెన్ ట్యాగ్ కోల్పోయినంత మాత్రానా అతడి ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. బ్రాండింగ్ లో అతడి హవాకు ఇప్పట్లో వచ్చిన డోకా ఏమీ లేదు.. ’ అని తెలిపాడు.

ఇక ఇదే విషయమై స్పోర్టీ   సొల్యూషన్స్ సీఈవో ఆశిష్ చద్దా స్పందిస్తూ... ‘దూకుడైన ఆటగాడిగా విరాట్ కు ఉన్న క్రేజ్ కంపెనీలకు వరం వంటిది. కోహ్లి భారత కెప్టెన్ గా ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఏమీ లేదు. ధోని కొన్నాళ్ల క్రితం రిటైర్ అయ్యాడు.  మరి అతడి బ్రాండ్ వాల్యూ ఏమైనా తగ్గిందా..? అదే కోహ్లికీ వర్తిస్తుంది. కొత్త బ్రాండ్లన్నీ కోహ్లితో ఎండార్స్ చేసుకోవడానికి ఎగబడుతాయి...’ అని వ్యాఖ్యానించాడు. 

విరాట్ కోహ్లి ఎండార్స్మెంట్ వివరాలు.. వాటిద్వారా ఏడాదికి అతడి ఆస్తుల విలువ : 

- 2021 లో  ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లి సంపాదించిన మొత్తం రూ. 179 కోట్లు 
- కోహ్లి రోజుకు ఒక ఎండార్స్మెంట్ కు రూ. 7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల దాకా చార్జ్ చేస్తాడు. 
- ఇప్పటివరకు కోహ్లితో ఎండార్స్మెంట్ చేసుకున్న బ్రాండ్లు : సుమారు 30కి పైనే (ఇందులో పూమా, హీరో టూ వీలర్, ఎంఆర్ఎఫ్ టైర్స్, ఆడి కార్స్, మింత్రా, అమెరికన్ టూరిస్టర్ లగేజ్, వీవో స్మార్ట్ ఫోన్, హైపరైస్ వెల్నెస్ వంటి కీలక బ్రాండ్లు కూడా ఉన్నాయి)
- ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టు (స్పాన్పర్డ్)కు విరాట్ కు దక్కే  మొత్తం : రూ. 5 కోట్లు 
- డఫ్స్ అండ్ ఫెల్ఫ్స్ ప్రకారం కోహ్లి బ్రాండ్ విలువ : 237.7 మిలియన్ డాలర్లు  

పైవన్నీ ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చేవే.. బీసీసీఐ,  ఐపీఎల్ ఫ్రాంచైజీల ద్వారా వచ్చే జీతాలు, ఇతరత్రా కలిపితే కోహ్లి ఏడాది ఆదాయం రూ. 250 కోట్లు దాటుతుందని గణాంకాలు చెబుతున్నాయి. 

click me!