బాల్ ట్యాంపరింగ్ టెక్నిక్స్ ఇవే... తాగిన మైకంలో వాగిన వార్నర్...: కుక్

By Arun Kumar PFirst Published Sep 11, 2019, 4:08 PM IST
Highlights

ఇంగ్లాండ్  మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. అతడు కేవలం సాండ్ పేపర్ తోనే కాదు మరెన్నో టెక్నిక్స్ తో బంతి స్వరూపాన్ని మార్చగల సమర్ధుడిని కుక్ ఆరోపించారు.   

బాల్ ట్యాంపరింగ్... కేవలం ఆస్ట్రేలియా జట్టునే కాదు... అంతర్జాతీయ క్రికెట్ ను కుదిపేసిన విషయం తెలిసిందే. క్రీడా స్పూర్తిని మంటగలుపుతూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామరూన్ బాన్‌క్రాఫ్ట్ లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డారు. కేప్‌టౌన్ వేదికన  సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బంతి స్వరూపాన్ని మార్చి లబ్ధిపొందాలని ప్రయత్నించిన ఈ ముగ్గురు అడ్డంగా బుక్కయ్యారు. దీంతో వీరు అంతర్జాతీయ క్రికెట్ నుండి ఏడాది నిషేధానికి గురయ్యారు. 

అయితే ఇటీవలే నిషేధాన్ని ముగించుకున్న స్మిత్, వార్నర్ లు ఇంగ్లాండ్ తో యాషెస్ సీరిస్ ఆడుతున్నారు. ఈ క్రమంలో మైదానంలోని ఇంగ్లీష్ అభిమానులు వారిద్దరని చీటర్స్ అంటూ హేళన చేస్తుండటం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ బాల్ ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చింది. అయితే వార్నర్ ట్యాంపరింగ్ పాల్పడటం మొదటిసారి కాదని అంతకుముందు కూడా అతడు ఈ పని చేసినట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ సంచలన విషయాలను బయటపెట్టాడు.

డేవిడ్ వార్నరే స్వయంగా బాల్ ట్యాంపరింగ్ కు ఎలా పాల్పడవచ్చో వివరించినట్లు కుక్ తెలిపాడు. '' 2017-18 యాషెస్ సీరిస్ ను ఆస్ట్రేలియా జట్టు 4-0 తో కైవసం  చేసుకుంది. ఈ సమయంలో క్రీడాస్పూర్తిని ప్రదర్శిస్తూ మేము కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కలిసి సంబరాల్లో పాల్గొన్నాం. అయితే ఈ వేడుకల్లో ఫుల్లుగా మద్యం  సేవించిన వార్నర్ కొన్ని భయంకరమైన  నిజాలను  బయటపెట్టాడు. 

తాను కేవలం చేతికి ధరించే బ్యాండ్ ను ఉపయోగించి కూడా బంతి  స్వరూపాన్ని మార్చగలనని గొప్పగా చెప్పుకున్నాడు. ఇలా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో  చాలాసార్లు చేశానని అన్నాడు. అంతేకాదు బాల్ ట్యాంపరింగ్ కు ఉపయోగించే మరికొన్ని టెక్నీక్స్ గురించి కూడా వివరించాడు. ఆ సమయంలో స్టీవ్ స్మిత్ కూడా  వార్నర్ పక్కనే వున్నాడు. '' అని కుక్ తన ఆత్మకథ ''ద ఆటోబయోగ్రఫీ'' లో  పేర్కొన్నారు. 

click me!