400 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 68 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఘన విజయం దిశగా సౌతాఫ్రికా..
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీని ఆరంభించింది ఇంగ్లాండ్. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన ఇంగ్లాండ్, ఆ తర్వాత బంగ్లాదేశ్‌ని ఓడించి బోణీ కొట్టింది. ఆఫ్ఘాన్ చేతుల్లో ఊహించని పరాజయాన్ని మూటకట్టుకున్న ఇంగ్లాండ్.. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది..
400 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ని మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టోని, లుంగి ఇంగిడి అవుట్ చేశాడు. జో రూట్ 2 పరుగులు, డేవిడ్ మలాన్ 6 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు..
ఆదుకుంటాడని అనుకున్న బెన్ స్టోక్స్ కూడా 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి కగిసో రబాడా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 7 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ బాది 15 పరుగులు, సౌతాఫ్రికాపై కౌంటర్ అటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే గెరాల్డ్ కాట్జే బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి బట్లర్ అవుట్ కావడంతో 67 పరుగులకే సగం ఇంగ్లాండ్ టీమ్ పెవిలియన్‌కి చేరింది..
అదరగొడతాడని అనుకున్న యంగ్ బ్యాటర్ హారీ బ్రూక్ 25 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 68 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఇలాంటి పొజిషన్ నుంచి ఇంగ్లాండ్ 400 పరుగుల భారీ టార్గెట్‌ని ఛేదించడం అసాధ్యం...
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఖాతాలో మొదటి నాలుగు మ్యాచుల్లో మూడో పరాజయం చేరినట్టే. ఇక మిగిలిన 5 మ్యాచుల్లో అన్నింటికీ తప్పక గెలిస్తేనే ఇంగ్లాండ్‌ని నాకౌట్ స్టేజీకి చేరే అవకాశాలు కాస్తో కూస్తో బతికి ఉంటాయి. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది ఇంగ్లాండ్..