భారీగా పరుగులు ఇస్తున్న శార్దూల్ ఠాకూర్... హార్ధిక్ పాండ్యా గాయపడడంతో మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా భారత జట్టు, ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది. టేబుల్ టాపర్‌గా ఉన్న న్యూజిలాండ్ మొదటి నాలుగు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది. అజేయంగా ఉన్న రెండు జట్ల మధ్య మ్యాచ్ కావడంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి..
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కి అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో మహ్మద్ షమీ లేదా రవిచంద్రన్ అశ్విన్‌లకి చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. మంచి ఫామ్‌లో ఉన్న మహ్మద్ షమీని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టిన భారత జట్టు, శార్దూల్ ఠాకూర్‌ని వరుసగా మ్యాచులు ఆడిస్తోంది.
అయితే శార్దూల్ ఠాకూర్ ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అప్పుడప్పుడూ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు. అయినా అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వడంపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. దీంతో శార్దూల్ ఠాకూర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టాల్సిన సమయం వచ్చిందని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..
ధర్మశాలలో జరిగే మ్యాచ్‌లో హార్ధిక్ ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని, శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో మహ్మద్ షమీని ఆడించాలని సలహా ఇచ్చాడు భజ్జీ..
‘హార్ధిక్ పాండ్యా ఫిట్‌గా లేకపోవడంతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాలపై ప్రభావం పడింది. ఇప్పుడు బ్యాటింగ్ డెప్త్ పెంచడం కోసం సూర్యకుమార్ యాదవ్‌ని తుది జట్టులోకి తీసుకురావడం చాలా అవసరం. అతను కాకపోతే ఇషాన్ కిషన్‌ని బ్యాట్స్‌మెన్‌గా తుది జట్టులోకి తీసుకోవాలి..
శార్దూల్ ఠాకూర్, ఆల్‌రౌండర్ కోటాలో ఆడుతున్నాడు. అయితే అతని నుంచి బౌలింగ్‌లో రావల్సినన్ని వికెట్లు రావడం లేదు. కాబట్టి 10 ఓవర్లు బౌలింగ్ చేసే మెరుగైన బౌలర్ అవసరం. అందుకే మహ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకోవాలి..’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్..
అయితే న్యూజిలాండ్‌కి ఫాస్ట్ బౌలింగ్ కంటే స్పిన్ బౌలింగ్ వీక్‌నెస్ ఎక్కువగా ఉంది. ఇండియాలో ఆడే మ్యాచుల్లో న్యూజిలాండ్ బ్యాటర్లు, భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాటింగ్‌లో ఈ వీకనెస్ క్లియర్‌గా కనిపించింది..
దీంతో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రూపంలో మరో బ్యాటర్‌ని తెచ్చే బదులు రవిచంద్రన్ అశ్విన్‌ని తుది జట్టులోకి తీసుకుంటే న్యూజిలాండ్‌ని ఎక్కువ ఇబ్బంది పెట్టవచ్చని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..