న్యూజిలాండ్‌కి ఇక కష్టమే... ఉత్కంఠపోరులో ఇంగ్లాండ్ విజయం, వరల్డ్ కప్ ఆతిథ్య జట్టుకి...

Published : Mar 20, 2022, 12:34 PM IST
న్యూజిలాండ్‌కి ఇక కష్టమే... ఉత్కంఠపోరులో ఇంగ్లాండ్ విజయం, వరల్డ్ కప్ ఆతిథ్య జట్టుకి...

సారాంశం

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌కి తప్పని ఓటమి...  ఆరు మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న న్యూజిలాండ్... పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో ఇంగ్లాండ్...  

వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇప్పటికే ఐదుకి ఐదు విజయాలు అందుకున్న ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం మిగిలిన జట్లు పోటపడుతున్నాయి. ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుని, ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా నిలుపుకుంది ఇంగ్లాండ్...

ఆరు మ్యాచుల్లో రెండే విజయాలు అందుకుని, నాలుగు పరాజయాలు చవిచూసిన ఆతిథ్య న్యూజిలాండ్ ప్లేఆఫ్స్ అవకాశాలు క్లిష్టతరం చేసుకుంది. మార్చి 26న పాకిస్తాన్‌తో ఆఖరి మ్యాచ్ ఆడనుంది న్యూజిలాండ్. ఇప్పటికే నాలుగు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లో మ్యాచులు ఆడనుంది...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 203 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సూజీ బేట్స్ 22 పరుగులు చేయగా సోఫియా డివైన్ 41 పరుగులు చేసింది. ఆమేలియా కేర్ 24, సథర్‌వైట్ 24 పరుగులు చేసి అవుట్ కాగా మాడీ గ్రీన్ 75 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసింది...

టమ్మీ బౌమంట్ 25, డానెల్లీ వ్యాట్ 12, కెప్టెన్ హేథర్ నైట్ 42 పరుగులు చేయగా నటాలియా సీవర్ 108 బంతుల్లో 5 ఫోర్లతో 61 పరుగులు చేసింది. సోఫియా గుంక్లీ 33 పరుగులు చేయగా విజయానికి 8 పరుగులు కావాల్సిన దశలో 9వ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. దీంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. మిగిలిన బంతుల కంటే చేయాల్సిన పరుగులు చాలా తక్కువగా ఉన్నా చేతిలో ఒకే వికెట్ ఉండడంతో మ్యాచ్‌ ఆతిథ్య జట్టు చేతుల్లోకి వెళ్తుందా? అనే అనుమానాలు రేగాయి. అయితే 11వ బ్యాటర్‌గా వచ్చిన అన్య సూబ్సోలే ఓ ఫోర్ బాది 7 పరుగులు చేసి... ఇంగ్లాండ్‌కి ఉత్కంఠ విజయాన్ని అందించింది...

ఈ మ్యాచ్‌తో టోర్నీలో రెండో విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో టీమిండియా, ఇంగ్లాండ్ కంటే పైన నాలుగో స్థానంలో ఉంది. మార్చి 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న సౌతాఫ్రికాతో మ్యాచులు ఆడుతుంది భారత జట్టు. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే టీమిండియాకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి...

అలాగే మార్చి 24న పాకిస్తాన్‌తో, మార్చి 27న బంగ్లాదేశ్‌తో మ్యాచులు ఆడనుంది ఇంగ్లాండ్ జట్టు. ఈ రెండింట్లో ఓ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఓడితే, టీమిండియా ఈజీగా ప్లేఆఫ్స్ చేరుతుంది. లేదంటే ఇరుజట్ల మధ్య నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ చేరే జట్టును నిర్ణయిస్తుంది. 

అయితే భారత జట్టుకి సౌతాఫ్రికాతో చెప్పుకోదగ్గ రికార్డు లేదు. అదీకాకుండా లీగ్‌లో వరుసగా నాలుగు విజయాలు అందుకుని ప్లేఆఫ్స్‌కి చేరువైన సౌతాఫ్రికాను భారత జట్టు ఓడించగలదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు కూడా మిగిలిన జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలను, పాయింట్ టేబుల్‌ను తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి...

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?