ODI World Cup 2027: ఇంగ్లాండ్ కు షాక్.. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ కోల్పోనుందా? 

ODI World Cup 2027: ఐసీసీ తాజా వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. దీని కార‌ణంగా ఇంగ్లాండ్ జ‌ట్టు 2027 వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించలేకపోవచ్చు.

Google News Follow Us

ODI World Cup 2027: ఇంగ్లాండ్ వన్డే క్రికెట్‌లో దారుణమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో మ‌రింత దిగ‌జారుతోంది. చిన్న జ‌ట్ల‌కు సైతం పోటీని ఇవ్వ‌డంలో క‌ష్ట‌ప‌డుతోంది.  ఇటీవల విడుద‌ల చేసిన ఐసీసీ వార్షిక‌ వన్డే ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ జ‌ట్టు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 

దీంతో  ఇంగ్లాండ్ జ‌ట్టు 2027 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత పొందే అవకాశం మీద తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఈ అప్‌డేట్ ప్రకారం, మూడు సంవత్సరాల కంటే పాత మ్యాచుల ఫలితాలు తొలగించారు. ఒక సంవత్సరానికి మించిన ఫలితాలకు తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. 

2024 మే 4 నుండి 2025 మే 4 మధ్యలో ఇంగ్లాండ్ కేవలం 14 వన్డేలు ఆడగా, అందులో మూడు విజయాలు మాత్రమే సాధించింది. ఇది 0.272 గల విజయాలు/పరాజయాల నిష్పత్తికి దారితీసింది. ఈ  కాలంలో ఇంగ్లాండ్ జ‌ట్టు కేవ‌లం నేపాల్, బంగ్లాదేశ్‌ల కన్నా మాత్రమే మెరుగ్గా ఉంది.

ప్రస్తుతం సహ-ఆతిథేయులైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత పొందగా, మరో ఆతిథేయ దేశ‌మైన నమీబియా మాత్రం ఫుల్ మెంబర్ కాకపోవడంతో ఆ అవకాశం కోల్పోయింది. మొత్తంగా 14 జట్లు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2027లో  పాల్గొంటాయి. సహ ఆతిథేయుల మినహాయించి మిగిలిన ఎనిమిది జట్లు మార్చి 31, 2027 నాటికి ఉన్న వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా అర్హత పొందుతాయి.

ప్రస్తుతం ఆ ఎనిమిది స్థానాలలో భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. ఐతే ఇంగ్లాండ్ కేవలం ఒక్క ర్యాంకింగ్ పాయింట్ తేడాతో వెస్టిండీస్ కంటే ముందున్నదీ, రాబోయే మూడు వన్డేల సిరీస్ ఈ రెండు జట్ల మధ్య జరగనుండటంతో ర్యాంకింగ్స్ మరింత మారే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ ఆ సిరీస్‌లో ఓడిపోతే, వెస్టిండీస్ పైకి చేరుతుంది.  అప్పుడు ఇంగ్లాండ్ క్వాలిఫయర్ ద్వారా వరల్డ్ కప్‌లోకి ప్రవేశించాల్సి వస్తుంది.

ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే 2023లో వెస్టిండీస్ అదే మార్గాన్ని ఎంచుకొని శ్రీలంక, నెదర్లాండ్స్ చేతిలో ఓడి వరల్డ్ కప్‌కి అర్హత పొందలేకపోయింది. ఇంగ్లాండ్ కూడా ఇప్పుడు అలాంటి ప‌రిస్థితిలోకి చేర‌వ‌చ్చు. కొత్త వన్డే కెప్టెన్ హ్యారీ బ్రూక్ నాయకత్వంలో ఇప్పటివే తప్పులు తిరగదిద్దుకోవడం అవసరం. ఇంగ్లాండ్ ఇప్పటివరకు ఒక్క 50 ఓవర్ వరల్డ్ కప్‌ను కూడా మిస్ కాలేదు. ఈ నేపథ్యంలో, రాబోయే మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌కు ఎంతో కీలకంగా మారాయి.

Read more Articles on